అవలక్షణాలతో చతికిలబడుతున్న మానవ జీవన ప్రస్థానం

వర్తమానంలో కీర్తి ప్రతిష్ఠలు కేవలం డబ్బు, అధికారం వలనే ప్రాపిస్తు న్నాయి.ఇది కాదనలేని కలికాలపు కఠిన సత్యం. మంచితనం, సంస్కారం, వినయం, విశ్వాసం వంటి విశిష్ఠమైన లక్షణాలకు ధరాతలంపై నెలవు కరువైనది. అహంకారం,స్వార్ధం, కృతఘ్నత వంటి అవలక్షణాలే గొప్ప లక్షణాలుగా భావించే రోజులు వచ్చాయి.  ఔన్నత్యం అంటే అదేదో తెలియని బ్రహ్మపదార్థం గా మారింది. ప్రాచీన కాలం నుండి నేటి కాలం వరకూ మానవజాతి ఔన్నత్యాన్ని గురించి అనేక ప్రాచీన గ్రంథాల్లో, తాళపత్రాలలో, ఆధునిక రచనల్లో విశదీకరించడం జరిగింది.అటువంటి మహిమాన్వితమైన మానవ శక్తి నిర్మాణాత్మకంగా ఉపయోగపడకుండా విధ్వంసకరంగా పరివర్తన చెందడం నేటి వ్యవస్థ చేసుకున్న పాప పరిహార ఫలితమేమో అనిపించక మానదు. వివేకం స్థానంలో మూర్ఖత్వం,విచక్షణ స్థానంలో  విధ్వంస మనస్తత్వం బలంగా నాటుకుపోయాయి. మానవ మేథస్సు వక్రమార్గంలో పయనిస్తుంది. మానవుని ఆలోచనా విధానం వక్రగతిలో పురోగతి చెందడం అనర్ధదాయకం- అటవికం.యుగాలు గడిచాయి. తరాలు అంతరించాయి. పాతతరాన్ని,పాతతరపు ఆలోచనలను నవతరం ఎప్పటికప్పడు ప్రక్కకు నెడుతూ కొత్తొక వింత- పాతొక రోత గా మారుతూ, స్థానభ్రంశం చెందడం కాలానికున్న  సహజలక్షణం. అయితే గతంలో ఒక తరం వారి ఆలోచనా విధానాలను అవగతం చేసుకుంటూ వారిని గౌరవిస్తూ వారు చూపిన బాటలో పయనించడానికే ప్రయత్నం చేసేవారు.విలువలకు పెద్ద పీటవేస్తూ,సమాజంలో ఎలాంటి అలజడులు,అశాంతి లేకుండా జీవించేవారు. కుల,మత,వర్గబేధాలు పాతకాలంలో ఉన్నప్పటికీ అందరూ కలసి మెలసి అరమరికలు లేని జీవన విధానం అనుసరించేవారు.

పెద్దలను గౌరవించడం, విలువలను పాటిస్తూ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటూ, సాధ్యమైనంతవరకూ సుహృద్భావ వాతావరణం లోనే జీవించేవారు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఖండిస్తూ, న్యాయబద్దమైన తీర్పులు చెప్పే పెద్దరికం నాటి వ్యవస్థలో ఉండేది. బలహీనులు కూడా ఎవరి అండా లేకపోయినా యథేచ్ఛగా జీవించేవారంటే నాటి సమాజంలోని హుందాతనం,పెద్దరికం, న్యాయ నిర్ణయాలే కారణం. అలాంటి పరిస్థితులు నేటి కాలంలో ఎక్కడా కనిపించవు. బలవంతులకే అగ్రతాంబూలం-డబ్బున్న వారికే సమాజంలో విలువ. డబ్బుంటే తప్పులన్నీ ఒప్పులు గా చెలామణీ అవుతున్న రోజులివి. మంచికి వంచన తప్ప విలువ లేదు. అవకాశవాదం వేయితలల విష సర్పంలా అవతరించింది. మాటకు విలువ తగ్గింది. మనిషి సృష్టించిన నోటు మనిషినే కబళించే విడ్డూరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నోటుకున్న  ప్రాధాన్యత నోటిమాటకు లేదు.

స్నేహబంధాలు తెగిపోతున్నాయి- రక్తసంబంధాలు రావణకాష్ఠంలా రగిలిపోతున్నాయి. సమాజమంతా అసూయతో నిండిపోయింది. అహంకారపు పైత్యప్రకోపాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. దొడ్డిదారిలో ధనార్జనచేసి,పైకి రావడానికే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తున్నారు.నేటి కాలంలో నటించే వారే జీవిస్తున్నారు.విలువలతో జీవించేవారు నశిస్తున్నారు.మానవ ఆయుష్సుకు  నేటి కాలంలో సరైన ప్రమాణం లేదు. పుట్టుకుతోనే రోగాలు…జీవించినంత కాలం ఔషధసేవనం. ఎప్పుడు పోతామో తెలియదు. అయినా మానవ నైజం మారలేదు. మానవ ప్రవృత్తి ప్రకృతిలో ఒక వికృతం గా తయారైంది.మానవ ఆయుఃప్రమాణం క్రొవ్వొత్తిలా కరిగి పోతున్నది. జీవించిన కొద్ది కాలంలో కూడా కడుపునిండా తినలేరు…కంటి నిండా నిద్రపోలేరు. రకరకాల రోగాలతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నా,సక్రమంగా జీవించాలన్న ఆలోచన మచ్చుకైనా మన మస్తిష్కంలో జనించదు. అవయవాలన్నీ చెడిపోయి,అంపశయ్యపై ఉన్నా, ధనాశ చావదు…లోభత్వం నశించదు. లేవలేక మనిషి  మంచం పాలైనా, తాను పోయినా తమ బిడ్డలకు కోట్లు కూడబెట్టాలనే వికృతమనస్తత్వాలు  మారడం లేదు. నేటి సమాజంలో మంచితనం,మానవత్వం లేకపోలేదు. అయితే ఇలాంటి వ్యక్తిత్వం గలవారిని కేవలం వేళ్ళ సంఖ్యలో లెక్కించగలం. సాయం చేసిన చేతులు కొరగాకుండా పోతున్నాయి.

ఎక్కించిన నిచ్చెనలు అవసరం తీరాక విరగ్గొట్టబడుతున్నాయి. మంచితనం మసక వెలుతురులో మూలుగుతున్నది. ద్రోహం, స్వార్ధం,వంచన, అవినీతి,కృతఘ్నత వంటి హీనమైన లక్షణాలు నేటి అస్తవ్యస్తమైన సమాజంలో  అత్యుత్తమ లక్షణాలుగా  దృగ్గోచరమవుతున్నాయి. డబ్బు కోసం గడ్డి తినే రోజులొచ్చాయి.  డబ్బుంటేనే గౌరవిస్తున్న రోజులు దాపురించాయి.కృతజ్ఞత కొడిగట్టిన దీపంలా తయారైనది. కృతకమైన భాషణంతో, కృత్రిమమైన బంధాలు ఆర్ధిక సంబంధాల కోసం  అర్రులు చాస్తున్నాయి. చదువు సమాజానికి ఉపకరించడం లేదు.  నీతి తప్పి,అవకాశవాదంతో రంగులు మారుస్తున్న వారే బ్రతకగలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజమైన మేథావులు నడుస్తున్న చరిత్రను చూసి,బాధాతప్త హృదయులై, నైరాశ్యంతో మౌనముద్ర వహిస్తున్నారు. మారుతున్న అస్తవ్యస్తమైన మానవ జీవనక్రమం యొక్క గమ్య స్థానానికి తుది మజిలీ ఎక్కడ? ఆరోగ్యవంతమైన లక్షణాలతో మనిషి మనిషిగా జీవించే మంచి రోజులకు నిజమైన మజిలీ ఎప్పుడు  ప్రారంభమోతుంది?  అప్పటి వరకు ఆశతో ఎదురు చూడడం తప్ప చేయగలిగిందేమైనా ఉందా?   మంచి కోసం పాటుబడుతూ, నీతి కోసం నిలబడుతున్న కొద్ది శాతం వ్యక్తుల కోసమైనా మన ప్రోత్సాహం కరువైతే, ఇక రాబోవు పరిణామాలు భయంకరమైన మలుపులతో మానవాళిని అధోగతి వైపు నడిపించక మానవు.
image.png
సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు, కాలమిస్ట్) 9704903463.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *