బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
అప్పుడుకర్ణుడు ఈ విధంగా అన్నాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యవంటి పెద్దలూ, గాంధారీ దృతరాష్ట్రులున్న ఈ సభలో ధర్మ నిర్ణయానికి దిగడం దుస్సాహసం. ధర్మరాజు పందెం కాస్తున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె అయిదుగురి భార్య. పతివ్రత ఎలా అవుతుంది? అలాంటి వనితను ‘బంధకి’ అనాలి. బంధకిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సభకు తీసుకురావచ్చును. కావున నీవు ఇక మాట్లాడకుండా కూర్చోమని చెప్పి, దుశ్శాసనుని, ద్రౌపది వస్త్రాలు విప్పెయ్యమన్నాడు.
పాండవులు తమ ఉత్తరీయాలు తీసివేశారు. దుశ్శాసనుడు ద్రౌపది కొంగుపట్టాడు. వికటంగా అట్టహాసంగావిస్తూ చీరను లాగేస్తున్నాడు. కొంతసేపు ఆమె పెనుగులాడింది. ఇక లాభం లేదనుకుని ఎవ్వరిని ప్రార్ధించిందో ఏమో లాగిన కొద్దీ చీర ఇంకా వస్తూనే వుంది. దుశ్శాసనుడు చీరలాగుతూనే వున్నాడింకా. చీరగుట్టలుగా పేరుకుపోయింది. అందరికీ ఆశ్చర్యం వేసింది. వారికళ్ళను వారే నమ్మలేకపోయారు. ఇంద్రజాలాన్ని చూస్తునట్లుగా చూస్తున్నారు.
దుశ్శాసనుడి పనైపోయింది. ఇంకా లాగలేక సిగ్గుతో విరమించుకున్నాడు. ద్రౌపదికి జరిగిన ఈ అవమానం భీమునికి ఎంతో కోపం తెచ్చింది. పళ్ళుపట్టపటాకొరుకుతూ, ఇందరు పెద్దలున్న ఈసభలో మధగర్వంతో ఇంతటి అఘాయిత్యానికి తలపడిన ఈ దుష్టుడి రొమ్ముచీల్చి, రక్తం తాగుతానంటూ ప్రతిజ్ఞ గావించాడు. విదురుడు లేచి ద్రౌపది ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం వుందన్నాడు. ఎవ్వరు సమాధానం ఇవ్వలేదు. కర్ణుడు నవ్వుతూ, ఈ దాసిని మీ ఇంటికి తీసుకుపో అన్నాడు దుశ్శాసనుడితో.
ద్రౌపది మాత్రం సదస్సులకు మరలా తనగోడు వినిపించింది. నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా తేల్చండి అంటూ నిలదీసింది. భీష్ముడు ఇలా చెప్పాడు. ధర్మం బహుసూక్ష్మం అయినది. ధర్మ నిర్ణయం చేయడం మహామహులకే కానిపని. బలవంతుడు ఏది చేస్తే అదే న్యాయం అనడమూ, బలహీనుడు చెప్పే ధర్మాలను తోసిపుచ్చడమూ, ప్రపంచంలో కనిపించే విచిత్రాల్లో ఒకటి. ఆ బలం ముందు ధర్మబలం ఎందుకూ పనికి రావు. కావున ధర్మరాజు ఒక్కడే ధర్మనిర్ణయం చేయగలవాడు అన్నాడు.




