గంప గోవర్ధన్ ఆహ్వానం మేరకే కామారెడ్డిలో సిఎం పోటీ
కొడంగల్‌లో చెల్లనిది కామారెడ్డిలో చెల్లుతావా?
కెసీఆర్ ప్రభుత్వ పథకం అందని కుటుంబం లేదు
గజ్యా నాయక్ తండాలో కార్యకర్తల సమావేశంలో మంత్రి కెటిఆర్
ఇంకా సాక్షాలు కావాలా రాహుల్ : ఎంపి కొత్త ప్రభాకర్‌పై దాడిపై మంత్రి కెటిఆర్ ట్వీట్
కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో ప్రతిపక్షాల ఫ్యూస్‌లు ఎగిరిపోయాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కామారెడ్డి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని, ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూపు కామారెడ్డి వైపు ఉందన్నారు. గంప గోవర్ధన్ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని వివరించారు. ఒక నాయకునికి కావల్సింది ప్రాంతం అభివృద్ది, ప్రజల సంక్షేమమని, రాష్ట్రంలోని 119 నియోజిక వర్గాల ప్రజలు కేసీఆర్‌ను అభిమానిస్తున్నారని, కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయడం మన అదృష్టమన్నారు.
ప్రభుత్వం వొచ్చాక వొచ్చే అరు నెలల్లో మద్దిమల్ల నుంచి మాచారెడ్డికి కాళేశ్వరం ద్వారా సాగునీరు తీసుకొస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. కొడంగల్‌లో చెల్లని నువ్వు కామారెడ్డిలో చెల్లుతవా..అంటూ ప్రశ్నించారు. మంగళవారం మాచారెడ్డి మండలం గజ్యా నాయక్ తండాలో ఏర్పాటు చేసిన రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రెటిఆర్ మాట్లాడుతూ..గిరిజన బిడ్డల పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని, రాబోయే రోజుల్లో అర్హులందరికి పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు. 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన నాయకుడు కేసీఆర్ అని, కామారెడ్డి కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారం చేస్తరని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులకు వోటు వేస్తే తప్పు చేసిన వాళ్లం అవుతామని, సిమెంట్, సలాకా ఇచ్చే నాయకులను నమ్మవొద్దన్నారు. షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేయడానికే భయపడుతున్నడని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే కామారెడ్డి నుండి పోటీ చేయాలని, కొడంగల్‌లో చెల్లని ఆయన కామారెడ్డిలో చెల్లుతడా అని మంత్రి ప్రశ్నించారు. మాచారెడ్డి మండలం ఉద్యమాల గడ్డ అని, గత ప్రభుత్వాలు బాగా పని చేసి ఉంటే ఇప్పుడు ఇంత గోస ఉండేది కాదని విమర్శించారు. 11 దఫాలు 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు సాయం అందించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త అని, ఇప్పుడు 24 గంటల కరెంట్ సరఫరా జరుగుతున్నదని అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తెలంగాణకు వొచ్చి తమ రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నమని అన్నడని, అది చూసి మన రైతులు ముక్కున వెలేసుకున్నరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు వోటు వేస్తే మళ్ళీ చీకటి రోజుల్లోకి వెళ్తామని, కాబట్టి ఆలోచించి వోటు వేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3 వేల చొప్పున అర్హులైన ఆడబిడ్డలకు ఇస్తామని, కేసీఆర్ బీమా పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన అన్ని కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తామని కెటిఆర్ తెలిపారు.
ఇప్పుడు తెలంగాణలో 3.5 కోట్ల టన్నుల వరి ధాన్యం పండిచే స్థాయికి ఎదిగామని, దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు 15వ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు మొదటి స్థానానికి చేరామన్నారు. మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులందరికి సన్న బియ్యం ఇస్తామన్నారు. మన రాష్ట్రంలో మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకూ అందరికీ కేసీఆర్ పథకాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. తెలంగాణలో హనుమంతుని గుడిలేని ఊరు లేదని, కేసీఆర్ పథకం లేని కుటుంబం లేదని, కార్యకర్తలే కథానాయకుల్లా మారి ప్రజలు వోట్లు వేసే విధంగా ప్రయత్నం చేయాలని కెటిఆర్ సూచించారు. రాష్ట్రంలో ఎక్కడరాని భారీ మెజారిటీ కామారెడ్డి నుంచి రావాలని, 30 రోజులు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని కోరారు. కామారెడ్డిని సిరిసిల్ల కంటే ఎక్కువ చూసుకుంటానని మంత్రి కేటీఆర్ హావి• ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ఫుడ్స్ కార్పోషన్ మాజీ చైర్మన్ తిర్మల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇంకా సాక్షాలు కావాలా రాహుల్ : ఎంపి కోత్త ప్రభాకర్‌పై దాడిపై మంత్రి కెటిఆర్
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడింది కాంగ్రెస్ కార్యకర్త అని స్పష్టం చేస్తూ మంత్రి కేటీఆర్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడిచేసింది కాంగ్రెస్ గూండానే అంటూ..ఆ పార్టీ కండువాతో ఉన్న నిందితుడి ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఇంకా ఆధారాలు కావాలా అని పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.





