తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరో తెలియక పోవచ్చు కానీ, ఆధునిక ముంబై నిర్మాణంలో మాత్రం తెలుగువారి క్రియాశీలక పాత్ర గురించి తెలియని వాళ్ళెవ్వరూ లేరనే చెప్పొచ్చు. మూడు వందల సంవత్సరాలకు మించిన చరిత్ర కలిగిన ముంబై తెలుగు శ్రామికుల ప్రస్థానం కొలాబా నుండి మొదలై కామాఠిపురా వరకు చేరుకొని, వర్లీ, ఖేడ్ గల్లీ, లోయర్ పరేల్ , ప్రభాదేవి ప్రాంతాల నుండి ముంబై నగరమంతా విస్తరించి, నేడు సుమారు 10 – 12 లక్షల జనాభాతో అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. ముంబై ప్రగతిలో పాలుపంచుకోవడమే కాకుండా సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో కూడా చిత్తశుద్ధితో పాల్గొని ప్రాణాలు కూడా అర్పించిన చరిత్ర తెలుగువారికి ఉంది. హుతాత్మ చౌక్ లో ఏర్పాటు చేసిన అమరవీరుల జాబితాలో తెలుగువారి పేర్లు ఉండడం మనకెంతో గర్వకారణం. ఏ ప్రాంతానికి వలస వెళ్లినా అక్కడి సంస్కృతిలో మమేకమై, అక్కడి స్థానిక ప్రజా ఉద్యమంలో పాలుపంచుకొని, అక్కడి ప్రాంతీయతను సొంతం చేసుకోవడం తెలుగువారి విశిష్టత అని చెప్పుకోవాలి.
ముంబైలో తెలుగు వారు నిర్మించిన భవనాలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలు, జలాశయాలు, విశాలమైన రోడ్లు, రైల్వే స్టేషన్లు, నేటికీ సగర్వంగా నిలబడి ఉన్నాయి. తెలుగు వారి పేర్ల మీద రహదారులు, చౌక్ లు, స్మారకాలు కూడా ఉన్నాయి. అయితే, రానురాను ముంబై లో తెలుగువారి చారిత్రిక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు తెలుగు శ్రామికుల కేంద్రంగా ఉండే కొలాబా ప్రాంతం నేడు అపరకుబేరుల స్థావరంగా మారిపోయింది. ఇప్పుడు కొలాబాలో కొన్ని తెలుగు కుటుంబాలు ఎక్కడో ఏ మూలనో అస్తిత్వ పోరాటం చేస్తూ బిక్కుబిక్కుమంటూ నివసిస్తున్నాయి. అక్కడిప్పుడు తెలుగు గుర్తులు చెదిరిపోతున్నాయి.
కామాఠిపురాలో బ్రిటిష్ ప్రభుత్వం కేటాయించిన ఉప్పు పొలాల్ని చదును చేసుకొని, నవ్య నాగరికత ఉట్టిపడేలా 16 వరుసల భవన సముదాయాలు , విశాలమైన రోడ్లు నిర్మించుకొని, ఏడు మందిరాల్ని కట్టుకొని, ఆ మందిరాల్లో గాంధీజీ పిలుపుమేరకు దళితులకు సామూహిక ప్రవేశం కలిగించిన చరిత్ర తెలుగువారిది. డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ జనతా ప్రెస్ కు ఆర్థిక సహాయం అందించడం, మహాత్మా జ్యోతిరావు ఫూలే సత్య శోధక సమాజాన్ని ప్రచారం చేయడం లో కామాఠిపురకు చెందిన తెలుగువారే ముందుకు వచ్చిన చారిత్రిక ఆధారాలున్నాయి. కామాఠిపురా లోనే ఎందరో తెలుగు నాయకులు ఉన్నత స్థానాలకు ఎదిగారు. అలాంటి కామాఠిపురా నుండి తెలుగు వారు క్రమక్రమంగా వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కమాఠిపుర నేడు మధ్య తరగతి తెలుగు కుటంబాలకు అందుబాటులో లేని ప్రాంతంగా మారిపోతోంది. రెండు మూడు అంతస్తుల భవనాలను కూల్చి ఆకాశాన్ని అంటే టవర్ల నిర్మాణం కొనసాగుతోంది. అభివృద్ధి పేరుతో అక్కడి ప్రజల్ని సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అందులో తెలుగువారే ఎక్కువ సంఖ్యలో ఉండడం శోచనీయ సత్యం. నిర్మాణం జరిగిన ఎత్త్తైన టవర్లను గుజరాతీలు, మార్వాడీలు ఆక్రమించుకుంటున్నారు.
సొంతదారులైన తెలుగు వారికి ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చి అక్కడినుండి తరిమేస్తున్నారు. తెలుగు మందిరాల నిర్వహణ బాధ్యతల నుండి కూడా తెలుగువారిని తప్పించే కుట్రలు జరుగుతున్నాయి. మరికొంత కాలం తర్వాత కామాఠిపురా సరికొత్త పేరుతొ బడా బడా శేట్ల అడ్డాగా మారిపోనుంది. ఆ ప్రాంతం మాది అని చెప్పుకునే ఆనవాళ్లేవీ తెలుగువారికి కామాఠిపురాలో మిగిలే అవకాశాల్లేవు. గిరిణిగావ్ గా పేరుపొందిన వర్లీ, లోయర్ పరేల్, ఖేడ్ గల్లీ, ప్రభాదేవి ప్రాంతాల్లోని బట్టల మిల్లుల్లో తెలంగాణ కార్మికుల గలగలలు, కళకళలు ఆ ప్రాంతాన్ని నిత్యం పావనం చేసేవి. కానీ, దత్తా సామంత్ సమ్మె మూలంగా ఒక్కొక్కటిగా మిల్లులన్నీ మూతబడడం వల్ల తెలుగు కార్మికులకు చెందిన ఒక తరం మొత్తం దిక్కులేని పక్షుల్లా తలో దిక్కుకు ఎగిరిపోయారు. కొందరు స్వగ్రామాలకు తిరిగి వెళితే, మరి కొందరు ఏకంగా స్వర్గానికే వెళ్లి పోయారు. తెలుగు కుటుంబాలు నివసించే ఈ ప్రాంతాల్లో ఉండే చాల్స్ తో పాటు గుడిసెలన్నింటిని డెవలప్మెంట్ పేరుతొ కూల్చి వేస్తున్నారు. దాంతో వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి.
రెండు మూడు సంవత్సరాల తర్వాత పునర్నిర్మించిన భవనాల్లో ఇల్లు పోగొట్టుకున్న కుటుంబాలకు మళ్ళీ ఇళ్లను కేటాయించినప్పటికీ, అప్పటికే ఎన్నో కుటుంబాలు ఈ ప్రాంతాల్ని వదిలి మరెక్కడికో తరలి వెళ్లిపోయాయి. కొందరు నిరాశగా గ్రామాల బాట పట్టారు. వర్లీ బిడిడి చాల్స్ అంటేనే తెలుగు కేంద్రం. వర్లీలో అడుగు పెడితే తెలంగాణ లోని ఏదో ఒక పట్టణం లోకి అడుగు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ప్రతి రెండో వ్యక్తి తెలుగోడై ఉంటాడు. ప్రతి చోట తెలుగు వినిపిస్తుంది. రోడ్డుకు రెండు వైపులా ఉన్న దుకాణాల పై తెలుగు కనిపిస్తుంది. ఒక్క వర్లీ ప్రాంతం లోనే దాదాపు యాభై వరకు తెలుగు సంఘాలున్నాయి. కానీ, గత కొంత కాలంగా వర్లీ బిడిడి చాల్స్ భవనాల స్థానం లో బహుళ అంతస్తుల టవర్లను నిర్మించాలనే ఉద్దేశం తో బిడిడి చాల్స్ ను కూల్చి వేస్తున్నారు. బిడిడి చాల్స్ లో నివసించే తెలుగు కుటుంబాలని, తెలుగేతర కుటుంబాలను కూడా ఖాళీ చేయిస్తున్నారు. మరో రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ టవర్లలో ఇంటికి బదులుగా మరో ఇల్లు లభించవచ్చు. కానీ, అప్పుడు మన సంస్కృతీ, మన ఆచార వ్యవహారాలు కనుమరుగయ్యే ప్రమాదం ఇప్పుడే కనిపిస్తోంది.
ఏడు ద్వీపాలుగా విడిగా ఉండే ముంబైని ఎక్కడికక్కడ సముద్రపాయాల్ని పూడ్చివేసి నేటి మహానగరంగా తీర్చి దిద్దడం లో ప్రధాన పాత్ర పోషించి, బ్రిటిష్ ప్రభుత్వం నుండి సర్, రావు బహదూర్, లాంటి బిరుదులెన్నో పొంది, రాజకీయంగా, సామాజికంగా ఒక వెలుగు వెలిగిన తెలుగువారి అడుగుజాడలు ఈ మహానగరంలో క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. కొలాబా నుండి వర్లీ వరకు ఉండే తెలుగు కుటుంబాలు చిందర వందర అవుతున్నాయి. తెలుగు వారి ఉపాధి కేంద్రాలైన బట్టల మిల్లులు మూతబడ్డాయి. తెలుగు బడులు లేకుండా పోతున్నాయి. తెలుగు పత్రికలు కనిపించడం లేదు. చాల్స్ స్థానం లో టవర్ లు మొలకెత్తుతున్నాయి. ఇప్పుడు ముంబై ఒక బిగ్ బజార్ గా మారిపోతోంది. తెలుగు ఆనవాళ్లు రూపు మాసి పోతున్నాయి. తెలుగు వారి కర్మభూమైన ముంబై, నేడు తెలుగువారికే పరాయిదవుతోంది ˜
-సంగెవేని రవీంద్ర, ముంబై, 9987145310





