నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం
ప్రజల చేతిలో పాశుపతాస్త్రంలా ఉన్నటువంటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని గత పాలకులు సక్రమంగా అమలు చేయకపోవడంతో అది దాని ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉన్నది. 1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడ్డది. అప్పటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో ఇది చట్టంగా రూపుదిద్దుకున్న అనతి కాలంలోనే రాష్ట్రాలు అంతే వేగంగా అమలు చేశారు. ఆ సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ వినియోగదార్ల ఫోరం లకు అన్ని వసతులు కల్పించి అధ్యక్షులు, సభ్యుల నియామకం చేయడం వల్ల అవి విశేషంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాయి. కోర్టులకు భిన్నంగా ఈ వినియోగదారుల ఫోరంలు ఉంటాయి. కోర్టులలో కేసులు సంవత్సరాల తరబడి పెండిరగ్లో ఉండడం సర్వసాధారణమైపోయిన పరిస్థితుల్లో వినియోగదారుల సేవల్లో లోపాలకు పైసా ఖర్చు లేకుండా ఫోరంలను సంప్రదిస్తే అవి 90 రోజులలో పరిష్కారం చూపిస్తాయి.
సేవలోపంతో జరిగిన నష్టాలకు నష్టపరిహారం కూడా ఫోరంలు ఇప్పించాయి. ఈ చట్టంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమకు జరిగిన సేవలోపాలకు, అసౌకర్యాలకు నష్టపరిహారాన్ని పొందారు. 1986 నుండి ప్రతియేటా డిసెంబర్ 24 న వినియోగదారుల దినోత్సవంను ప్రభుత్వాలు జరపడం ఆనవాయితీగా వస్తున్నది. ఒక్కోసంవత్సరం ఒక్కో అంశంపై జరుపుతుండగా ఈ సంవత్సరం ‘‘ఈ- కామర్స్, డిజిటల్ ట్రేడ్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, వినియోగదారుల హక్కులు’’ అనే విషయాలను అధ్యయనానికి ఎంపిక చేశారు. సైబర్ క్రైమ్‌లు విపరీతంగా జరుగుతున్న ఈ తరుణంలో పై అంశాలకు ప్రాధాన్యత లభించనుంది మరియు పరిష్కారం కూడా చూపనున్నాయి.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 9 ఆగస్టు 2019లో ఈ చట్టానికి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అప్పటినుండి ఫోరంల పేరు కమిషన్ గా మారింది. చట్టం అమలు తీరు జిల్లా కలెక్టర్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలి కానీ అది జరగడం లేదు. కేసుల పరిష్కారాలు కూడా 90 రోజులు దాటి పోతున్నాయి. బియ్యం సేకరణ బాధ్యతను తీసుకున్న తర్వాత సివిల్ సప్లైస్ శాఖ తన ఉనికిని కోల్పోయింది. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం ధాన్యాన్ని కస్తం మిల్లింగుకు ఇవ్వడమే సరిపోతుంది. ఈ విధానం అమ్యమ్యాలకు దారితీసింది. దీని ఫలితంగా వేలకోట్ల అవినీతి ఈ శాఖలో జరిగింది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఇవ్వవలసిన మిల్లర్లు యదేచ్చగా బయట మార్కెట్లలో అమ్ముకున్నారు అలా అమ్ముకున్న బియ్యం వేలకోట్లలో ఉంటుందని ఇటీవల సమీక్షించిన ఆ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడిరచారు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా చట్టాల అమలు తీరు మారడం దురదృష్టకరం. నూతన రాష్ట్రంగా తెలంగాణ గడచిన పది సంవత్సరాలలో తిరోగమన దశలో పయనించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వినియోగదారుల పరిరక్షణ చట్టం, ఆర్టిఐ, మానవ హక్కుల సంఘం, లోకయుక్త లాంటి చాలా సంస్థలు నిమిత్తమాత్రంగా మిగిలిపోయాయి. ఆర్టిఐ లో కమిషనర్లు లేక 20వేల అప్పిళ్లు పెండిరగ్ లో ఉన్నాయి. ఆహార పదార్థాలలో కల్తీ పరాకాష్టకు చేరుకున్నది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. 2022 లో దేశవ్యాప్తంగా 19 నగరాల్లో 291 ఆహార కల్తీ కేసులు నమోదు కాగా ఒక్క హైదరాబాదులోనే 246 కేసులు అయ్యాయని ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లాల్లో, పట్టణాల్లో, మారుమూల పల్లెల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అనుచిత వ్యాపారులను రాజుల కాలంలోనే ఉపేక్షించేవారు కాదని ఆ రోజుల్లో కటిన దండనలకు జడిసి కల్తీ చేయడానికి జంకెవారని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతున్నది. అట్లాంటిది ఇంత హైటెక్ యుగంలో యదేచ్చగా అక్రమ వ్యాపారాలు జరుగుతుండడం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఫార్మాలో ఇంకా విస్తుగోల్పే విషయాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో నిషేధించిన మందులు ఇక్కడ మనదేశ మందుల షాపుల్లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఆర్థిక భారం ఉంటది. ప్రజల మన్ననలు పొందిన ఇలాంటి చట్టాల పట్ల ప్రజలను జాగృతం చేస్తే ప్రజలు ఎక్కువ లబ్ధిపొందుతారని ప్రజలకు పారదర్శక పాలన అందించడానికి దోహదపడే సిటిజన్ చార్టర్ ను సత్వరమే అమలులోకి తీసుకురావాలి. వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి వసతులు, సౌకర్యాలు, నియామకాలు చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి ఎలాంటి భారం లేకుండా కేవలం కొన్ని మార్పుల ద్వారా ప్రజలకు అనేక సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. గతంలో నిర్వీర్యమైన అన్ని అజమాయిషి సంస్థలన్నిటికీ వెంటనే పూర్తిస్థాయిలో అర్హులను నియమించి పెండిరగ్లో ఉన్న ఫిర్యాదులను చూడవలసిన బాధ్యత పాలకులదే.
సీనియర్ జర్నలిస్టు, 9441331288





