బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ‘ఆస్కార్ చల్లగరిగ’కు అరుదైన ఘనత
తెలుగోడి ప్రతిభకు కేన్స్ చిత్రోత్సవం మరోసారి జేజేలు పలికింది. వివరాల్లోకి వెళితే.. కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత్ నుంచి షార్ట్ లిస్ట్ అయిన చిత్రం ‘ఆస్కార్ చల్లగరిగ’. ప్రముఖ తెలుగు సినీ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్‌పై రూపొందించిన ఈ డాక్యుమెంటరీ కేన్స్ చిత్రోత్సవంలో పలువురి ప్రశంసలు అందుకోవడమేగాక.. బెస్ట్ డాక్యుమెంటరీగా ఘనతను సాధించి కాలరేగిరేసింది.
కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు అమెరికా, జర్మనీ, కెనడా, బల్గేరియా, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, స్వీడన్, స్పెయిన్ వంటి తదితర దేశాల నుంచి వచ్చిన చిత్రాల పోటీని తట్టుకుని షార్ట్ లిస్ట్ అయిన ఈ చిత్రం.. తాజాగా విన్నర్‌గా నిలవడం గమనార్హం. ఈ సందర్బంగా ఈ చిత్రం.. డాక్యుమెంటరీ విభాగంలో విన్నర్ (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్) గా నిలిచిందని ప్రఖ్యాత సీనియర్ జర్నలిస్ట్ చిల్కూరి సుశీల్ తెలిపారు. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ డాక్యుమెంటరీని నిర్మించారు. ఆస్కార్ చల్లగరిగ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌గా నిలిచినందుకు గాను చంద్రబోస్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రముఖ దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ‘నాటు నాటు’ పాట రాసినందుకు గాను రచయిత చంద్రబోస్‌తో పాటు సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణీలకు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆస్కార్ వచ్చిన తర్వాత తన స్వంతగ్రామమైన భూపాలపల్లిలోని చల్లగరిగకు వచ్చినప్పుడు చంద్రబోస్‌ను ఆ గ్రామ ప్రజలు ఎంతగానో రిసీవ్ చేసుకున్న తీరు.. ఆ గ్రామంతో ఆయనకుండే అనుభవాలను ఇతివృత్తంగా తీసుకుని సుశీల్ కుమార్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు.





