ఆ కల జనవరి 22న సాకారం కాబోతున్నది
ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు
22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి
అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ
రైల్వే స్టేషన్, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం
ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు
22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి
అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ
రైల్వే స్టేషన్, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం
అయోధ్య, డిసెంబర్ 30 : యావత్ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం రోజు కోసం ఎదురుచూస్తుందని, జనవరి 22న జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఉంటుందని, అయితే అది సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొందరినే ఈ మహోజ్వల ఘట్టానికి ఆహ్వానించినందున ఆరోజు రావాలని అనుకోవద్దని ప్రజలను కోరారు. లాంఛనంగా రామాలయం ప్రారంభం కాగానే ఎవరికి వారు తమ వీలును బట్టి వొచ్చి భగవాన్ రామ్‌ను దర్శించుకోవచ్చని ప్రధాని సూచించారు. అయోధ్యలో ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభించారు. పలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జనవరి 22వ తేదీ చారిత్రక క్షణాల కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందని, సహజంగానే అయోధ్య వాసుల్లో మరింత ఎక్కువ ఉత్సాహం తొంగిచూస్తుందని అన్నారు. ఈ పుణ్యభూమిలోని అణువణువునూ తాను ఆరాధిస్తుంటానని, అందరిలాగే తాను కూడా రామమందిరం ప్రారంభమయ్యే ఘడియల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. 22న మరో దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో సుందర శ్రీరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. తుది దశకు చేరుకున్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో అయోధ్యలో పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజు జనవరి 22న దేశ ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ రోజున సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలగాలన్నారు. అందుకే జనవరి 22 వ తేదీన అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా భక్తులు ఎవరూ అయోధ్యకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23 వ తేదీ నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చని మోదీ సూచించారు. ప్రజలు ఎవరూ అయోధ్యకు వొచ్చి ఇబ్బంది పడకూడదనే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ఆధునిక హంగులతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్ తోపాటు మహర్షి వాల్మీకి ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితమిచ్చారు. రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన జనవరి 22న అయోధ్యకు రావద్దని ప్రజలను కోరారు. విూరు 550 సంవత్సరాలకు పైగా వేచి ఉన్నారు, మరికొంత కాలం వేచి ఉండండి అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, బ్రిజేష్ పాఠక్ కేశవ్ మౌర్య తదితరులు పాల్గొన్నారు.





