ఆదివాసి, గిరిజనులకు ప్రత్యేక శుభాకాంక్షలు : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
కేంద్ర గిరిజన మంత్రితో కలిసి మహా జాతరలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ దంపతులు
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : గిరిజన కుంభమేలా మేడారం మహా జాతరలో గవర్నర్‌గా మూడోసారి పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. శుక్రవారం ఆమె కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండాతో కలిసి మేడారం మహా జాతరలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు, కేంద్ర గిరిజన మంత్రికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ ముఖ్యంగా గిరిజనులు సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు.
గిరిజనులకు అతి పెద్ద పండుగ మేడారం మహా జాతరలో 3వ సారి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని గవర్నర్ తెలిపారు. మహా జాతర సందర్భంగా దేశంలోని గిరిజనులు అందరికీ గవర్నర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది భక్తులు వొచ్చి అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని, జాతరకు వొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గవర్నర్‌గా విధులు నిర్వహిస్తూ తాను సైతం 6 గిరిజన, ఆదివాసి గ్రామాలను దత్తత తీసుకున్నానని ఆమె తెలిపారు. ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. దేశ అభ్యున్నతిలో ఆదివాసీలు గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని, దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది ఆదివాసీలు గిరిజనులు నివసిస్తున్నారని, ఈ మహా జాతర సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
మేడారం మహా జాతరకు వొచ్చి అమ్మవారు దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల సైతం మేడారం మహా జాతర గురించి తెలుసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇక్కడి అమ్మవార్లను దర్శించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం రాష్ట్ర మంత్రులు తెలంగాణ గవర్నర్ ను, కేంద్ర గిరిజన మంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక నోడల్ అధికారులు ఆర్వి కర్ణన్, కృష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ శబరిష్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





