నా సాహితీ వృక్షానికి తల్లివేరు మావూరే (మునగాల పరగణా నారాయణగూడెం) అని సగర్వంగా చెప్పుకుని అక్కడి జనజీవనాన్ని కవిత్వం చేసిన కవి డాక్టర్ బాణాల శ్రీనివాసరావు. ఉస్మానియాలో విద్యార్థిగా చదివింది, ఇప్పుడు అధ్యాపకునిగా బోధించేది ఆంగ్లమే అయినా సిగ్నేచర్ పోయెంగా పేరొందిన కుంపటి వంటి అత్యద్భుతమైన దీర్ఘకవితను ఇదివరకే తెలుగు పాఠకులకు అందించిన ఆయన తన కవితా ప్రత్యేకతను చాటుకున్నారు. బతుకుయానాన్ని, కుల వృత్తిని పునర్నించుకునే లక్ష్యంతో ఊరితో, కుటుంబంతో, కులవృత్తితో ఉన్న సంబంధాను బంధాన్ని తన జ్ఞాపకాల ఊటలోంచి తోడి కదిలించే కవితా వాక్యాలుగా మలిచారు. తనతో తానే ఒంటరై, సమ్మోహమై, అస్తిత్వపు ఆత్మ నివేదనై వ్యక్తమైన ఆయన కవిత్వం అనిర్వచనీయతను కప్పుకున్న మానవ సంభాషణగా కనబడుతుంది. తన సంపుటికి రాత్రి సింఫని అని పేరుపెట్టి అరుదైన నిత్య జీవన దృశ్యాలను నలభై కవితల్లోకి ఒంపారు.
కాలానికి వ్యాఖ్యానం చెప్పేది ఎప్పటికైనా కవిత్వమే. నిశ్శబ్దంలోంచి మాటై కవిత్వం పుట్టి మనస్సులో చెరగని కాంతిలా ముద్రించుకుపోతుంది. ప్రాకృతిక కలవరమే కవిత్వమై క్షణక్షణ వికీర్ణమై మహాద్భుతంగా విస్తరిస్తుంది. చిన్నప్పటి చెప్పుల్లేని/ నెత్తురోడుతున్న పాదాలు జ్ఞాపకాలై సలుపుతుంటే నిన్ను నువ్వే ఓదార్చుకుంటూ/ మాసిపోని మచ్చల్ని మాన్పుకోవాలి అని వ్యూహాగామి కవితలో కవి చెప్పారు. రాలిపడుతున్న పూలకు కనీసం చూపుల లేపనమైనా రాయాలన్నారు. గడ్డకట్టని విషాదమేదో గొంతులో తారాడితే మౌనాన్ని ఆలింగనం చేసుకుని బేలతనాన్ని కప్పుకున్న తడారని మాటల వేదనని ఆర్తిగా అక్షరీకరించారు. గాయాల తడి తగిలినా మేల్కొని ఆకాశం కొలనులో ఆడుకుంటున్న నక్షత్రాలు, చేప పిల్లలను దృశ్యీకరించారు. జీవితం కొమ్మచుట్టూ/ గిరికీలు కొడుతున్న/ గూడు దొరకని పక్షులు భయం ఊబిలో కూరుకుపోతున్న తీరును తెలిపి హెచ్చరికను సూచించారు. మనిషిని చూసి మనిషి భయపడే దుస్థితి రావడమే చారిత్రక విషాదమని అన్నారు.
నిరంతరం గాయపడుతూనే ఎదురొచ్చే ఆయుధాలనన్నీ సమర్థవంతంగా, ఆత్మనిబ్బరంతో ఎదుర్కొన్నప్పుడే అద్భుత ఔషధాయుధమవుతావని మనిషిని ఉద్దేశించి అన్నారు. రాత్రి సింఫని కవితలో నిద్రపట్టని మనసును తెరలు తెరలుగా మెలిపెడుతున్న సంఘటనలను క్రమంగా చిత్రీకరిస్తూ అచేతనంలోంచి చేతనలోకి అందరినీ రమ్మన్నారు. కదిలించే కవిత్వ పాదాల్ని కనుపాపలకద్దుకోవాలని చెప్పారు. మహాశూన్యాన్ని కవిత్వ శంఖంతో ఎలాగైనా పూరించాలని తెలిపారు. కనుమరుగైన చిరునామాలను వడబోస్తూ ఎండిపోయిన చెరువు, వాడిపోయిన చెట్టులను గుర్తు చేశారు. ఆన్లైన్ జూమ్ క్లాసులతో వేసారి ఏకాంతంలో కూడా ఎంతో నిర్లిప్తంగా ఉండే స్టాఫ్ ముఖాలను గురించి ఆలోచనాత్మకమైన కవితా వ్యాఖ్యాలు రాశారు.
రెండు రెక్కలతో రివ్వున మళ్ళీ పక్షిలా దిగంతాలకు కవి తాను ఎగిసి అనంత ప్రయాణం చేయాలనుకున్నారు. చీకటి కొమ్మన కూసే వెలుగు కోయిల స్వరాన్ని ఎంతో జాగ్రత్తగా విన్నారు. మమ్మల్ని బతకనీయండి రా అని మబ్బుల ప్రాణాల్ని చిదిమేసి, నలిపేసే రాక్షసత్వాన్ని ఉద్దేశించి సూటిగా అన్నారు. దృశ్యాదృశ్యంగా వేళ్ళాడుతున్న అమ్మ జ్ఞాపకాలను మనసారా మననం చేసుకున్నారు. నిశ్శబ్దాన్ని తాకడమంటే శూన్యాన్ని పిడికిల్లో బిగించినంత మహాకార్యంగా చిత్రించి చూపారు. త్యాగ వీరుల రక్తంతో దాహం తీర్చుకునే చరిత్ర హీనుల చేష్టల్ని తీవ్రంగా నిరసించారు. పాదం కదిలినంత వరకే/ ప్రాణం ఉన్నంత వరకే జీవితం సాఫీగా సాగుతుందని చెప్పారు.
హైద్రాబాద్ బుక్ ఫెయిర్‌ను కవిత్వోద్యమా లకు నాయకునిగా అభివర్ణించారు. స్థలాన్ని బట్టి/ దేహ వర్ణాన్ని మార్చుకునే ఊసరవెళ్లి ముఖాల వికృత విన్యాసాలను ఎండకట్టారు. గుండె లోపలి గొంతు చేసే ఆంతరిక స్వరాలాపనే మరో ప్రస్థానపు ఓంకార ధ్వని అవుతుందని అన్నారు. నేటి తెలంగాణను మహాజన పోరాటపు ఫలితంగా ఆవిర్భవించిన కొత్త వ్యూహాల పురిటి గడ్డ అని చెప్పారు. రాత్రిలో ఇంటిని వెలిగించే వెన్నెల దీపాన్ని సహజ రక్షణ వలయమని తెలిపారు. సూర్యాస్తమయాల రంగుల ప్రపంచాన్ని చిట్టితల్లి తన బోసినవ్వుల్లో ఎంతో గొప్పగా, చూడముచ్చటగా ఆవిష్కరిస్తున్నదని అన్నారు. అత్యంత ఆధునిక ధర్మాలన్నీ మరోవైపు గ్లోబల్ నేరాలకు ప్రతిరూపాలని చెప్పారు. నల్ల మబ్బుల్ని కప్పుకున్న నిర్లిప్త ఆకాశంలో తెలంగాణ సూర్యుడి కోసం ప్రజల ఎదురుచూపు కొనసాగిందని అన్నారు. నిశ్శబ్ద నదిలో ఒంటరి నావలా కొట్టుకుపోతున్న నేను ఏమౌతానో చెప్పారు. ప్రవహించి ఆగేది నదీ ప్రవాహం/ ఎప్పటికీ ఆగనిదే రక్త ప్రవాహమని స్పష్టీకరించారు. కాలం ఘనీభవిస్తే/ క్షణమొక/ రెక్క విరిగిన పక్షి అన్నారు. ప్రశ్నల వల్మీకాల్ని పరిష్కరించలేని సమాధానాల సరీసృపాల మధ్య హింస పరమధర్మమైన వేళ/ ఏకత్వంలో భిన్నత్వమా అని వేదన చెందారు.
బాధలోంచి వచ్చే భావమే కవిత్వం/ వేదనలోంచి వచ్చే నాదం కవిత్వం అన్నారు. పగిలిన గుండెల్ని అతికించుకుని, గాయాల గేయాలకు కొత్త రాగాలల్లుకుంటామని చెప్పారు. మా కండల బండలపై ఊరి మురికినంతా ఉతికినా మాసిన బట్టలు కట్టుకుని ఆకలి కేకలు వేయక తప్పడం లేదని వాపోయారు. ఆశయాల మొగ్గల్ని పువ్వులుగా మలచుకునే ఉద్విగ్న క్షణాలలో సంకల్పపు ఉలి రేపటి కలలను తప్పక చెక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చరిత్ర పుటల్లో పేరు శిలాక్షరమయ్యేలా సంజీవని లాంటి ఒక్క కవిత్వ పాదం రాస్తే ఈ జన్మకు చాలునని చెప్పారు. దుఃఖపు నదుల్ని దాటి ఊహించని విపత్తులను ఎదుర్కొనడమే ఇప్పటి యాంత్రిక కాల జీవనంలోని కఠోరపు సవాళ్ళని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అమృత ఘడియలను నిరంతరం ఇక్కడ పుట్టిన వారంతా స్మరించుకోవాలని చెప్పారు. ఐసోలేషన్‌తో సాగించేది నయాయుద్ధమన్నారు. ఎగిరిపోయిన మేఘం రాక కోసం ఆశగా ఆకుల ఊయల్లో కూర్చొని చూస్తున్న సీతాకోక చిలుక ఓపికను ఒద్దికగా కవితాత్మకం చేశారు. కరోనా కోసం చివరి ఎలిజీ రాశారు. నిరంతరం ఆకాశాన్ని, భూమిని కలిపి కుడుతున్న గాలి తెరచాప ధైర్యాన్ని అక్షరమయం చేశారు.
నెత్తుటి గాయాలతో దూసుకుపోతున్న వేయి ఏనుగుల సంకల్పాలే రాజీ పడక ముందుకు సాగే వలస జీవులన్నారు. ఆశల కొమ్మల చివర్లను అందుకోవాలన్న తపనతో మనిషి అనంత ప్రయాణీకుడవుతున్నాడని తెలిపారు. భూమాత ఒడిలోకి ఆవిరవుతున్న కాలాన్ని మనిషికి గుర్తు చేశారు. ఎండాకాలంలో అకస్మాత్తుగా వర్షపు చినుకులు కురిస్తే మహా దాహం తీర్చుకుంటున్న భూమిని రగిలే పెనంతో పోల్చారు. నిద్రరాని నిశ్శబ్దపు నిశిరాత్రులలో గతం గూట్లోంచి నక్షత్రపు కళ్ళతో మానవేతిహాసాల మాననని గాయాలలోకి తొంగి చూశారు. ఈ కవితల నిండా ఆలోచనాత్మకమైన సజీవధార కురిసింది. ముళ్ళ సంకెళ్ళను విప్పుకుని కొత్తగా మెరవడం కోసం కవి పడే తపనకు నిదర్శనాలుగా ఈ కవితలు సాక్షీభూతాలయ్యాయి. బతుకు తడి కవితల్లో నిండారా నిండి కనిపించింది. ఆకులన్ని రాలిన కొమ్మ/ తన దుఃఖాన్ని ఆపకుండా/ ఒక్కో ఆకురాలుతున్నప్పటికీ/ కన్నీటి కథల్ని ఒంపుతుంది కీచురాయిలా అన్న కవి తనకు తానే వేసుకున్న స్వీయ సంకెళ్లను విప్పి మరుగుల్ని, మెరుగుల్ని నిర్భయంగా తొలగించారు. తరంగ కల్లోలంలా, యాంత్రిక, స్వాభావిక జీవన సర్వస్వంలా సాగిన ఈ కవిత్వం మానవీయ మూలాలను తట్టి లేపింది.
-డా. తిరునగరి శ్రీనివాస్
9441464764





