హన్మాండ్ల రవీందర్ మంచి కవి. సమాజం పట్ల సీరియస్ నెస్ ఉన్న కవి. తన జీవితంలో ఎక్కువ కాలాన్ని అనేక రకాల ప్రజాఉద్యమాల కోసం ఖర్చు చేసిన వాడు. స్పష్టమైన సామాజిక దృక్పథం కల్గిన వాడు. సమాజం గురించి నిబద్ధతతో కవిత్వం రాసే రవీందర్ గారికి ఆ కవిత్వాన్ని పుస్తకంగా తేవాలనే నిబద్ధత మాత్రం లేదు. నా లాంటి వాళ్లు పుస్తకం వేయమని ఒత్తిడి చేసినా నవ్వుతూ ప్రయత్నం చేద్దామని చెప్పి తప్పించుకునేవాడు. గట్టిగా అడిగితే నాకు బద్దకం ఎక్కువ అని నిజం కూడా చెప్పేవాడు. అలాంటి రవీందర్ ఇప్పుడొక పుస్తకం వేసాడు.దాని పేరు ‘‘సముద్రమంత మనుషులు’’.రవీందర్ తన అమ్మానాన్నలతో బాటు విప్లవోద్యమకారుడైన తన తమ్ముని యాదిలో వేసిన పుస్తకం ఇది. ఎప్పుడో చనిపోయిన తమ్మున్ని, నాన్నను అదేవిధంగా అమ్మను తలచుకుంటూ ఆమె చనిపోయిన పదిరోజులకు సభ పెట్టి పుస్తకాన్ని ఆవిష్కరించాడు రవీందర్.తన కవిత్వం పుస్తకంగా తేవటానికి బద్ధకించిన రవీందర్ ఈ పుస్తకం విషయంలో మాత్రం ఏమాత్రం అలసత్వం వహించలేకపోయాడు. దానిక్కారణం వాళ్ళతో రవీందర్ కున్నది రక్త సంబంధం మాత్రమే కాదు.అంతకు మించి .ఈసమాజానికి ఏదో చేయాలనే తపన వీళ్ళందరిలోనూ ఉన్న కామన్ క్వాలిటీ .
ఈ ముగ్గురి జీవితాల గురించి తెలిసిన వాళ్ళకెవరికైనా ఈ పుస్తకం పేరులోని సామంజస్యం బోధపడుతుంది. కొత్తవాళ్ళకు కూడా ఈ పుస్తకం మొత్తం చదివితే అర్థమవుతుంది.సముద్రమంత గాంభీర్యం ఉన్న మనుషులు వాళ్ళు. ఈ సమాజం మీద సముద్రమంత ప్రేమ గలవాళ్ళు.’’ఈ ప్రజల కోసం పోరాటం చేయటానికి విప్లవోద్యమం లోకి వెళ్దామని నిర్ణయించుకున్న హన్మాండ్ల సత్యనారాయణ అమ్మకు చెప్తే తల్లి మనసు విలవిలలాడిరది. ఈ నిర్ణయం పట్ల మౌనం వహించిన భర్తను నిలదీస్తే-వాడు చెప్పింది వింటే ఎట్లా ఆపల్నో అర్థమయితలేదే అన్నాడట తండ్రి’’.ప్రజల విముక్తి పోరాటంలో తన ప్రాణాలని సైతం లెక్కచేయని కొడుకు ఔన్నత్యాన్ని గుర్తించటం, తనకు మద్దతు తెలపటం అంటే మామూలు విషయం కాదు.అందుకే వాళ్ళను సముద్రమంత మనుషులు అన్నాడు రవీందర్. అందుకే వాళ్ల జ్ఞాపకాలను పుస్తకం చేసాడు.
సమాజం పట్ల ఈ ముగ్గురిలో ఉన్న ఎనలేని ప్రేమ వీళ్ళను ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెట్టింది. సత్యనారాయణ అంటే హైదరాబాద్ నగరంలో చదువుతూ అక్కడి పోరాటాల్లో భాగమై తర్వాత రోజుల్లో పూర్తి కాలం విప్లవోద్యమంలో పనిచేసాడు. రామయ్య గారు ఐదవ తరగతి దాకా చదివినవారు. ఈశ్వరమ్మ అయితే నిరక్షరాస్యురాలు. అయినా వీళ్లంతా సమాజాన్ని సక్రమంగా అవగాహన చేసుకున్నారు. సమాజంలో దోపిడీ ఉందని, దాని కోసం ఎవరోఒకరు పోరాటం చేయక తప్పదనే సత్యాన్ని అర్థం చేసుకున్నారు.అందుకే కొడుకు నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. సత్యమైనా, ఆయన తల్లిదండ్రులయినా ఎంతటి త్యాగశీలులు?
రవీందర్ తమ్ముడు సత్యనారాయణ గొప్ప సృజనకారుడు. ఆయన కవిత్వం రాసాడు. సాహిత్య విమర్శ చేసాడు. కథలు రాసాడు. ఆయన మరణాంతరం ‘‘పునరంకితం’’పేరుతో ఆయన సాహిత్యం విరసం ప్రచురణలలో భాగంగా వచ్చింది.ఈ సాహిత్యం రావటానికి గల కారణాలను గురించి, ఆ చరిత్ర గురించి ప్రస్తావిస్తూ వివరమైన ముందుమాటలు రాసారు వరవరరావు,శివారెడ్డి .సత్యం సాహిత్యం చదువుతుంటే అంత చిన్న వయసులో అంత విస్తృతమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించాడోనని ఆశ్చర్యం వేస్తుంది. సాహిత్యం గురించి, చరిత్ర గురించి, రాజకీయాల గురించి ప్రజల కోణంలో ఆయన చేసిన విశ్లేషణలు మనకు కొత్త పాఠాలు నేర్పుతాయి.ఆయన కవిత్వం గురించి రాయాలంటే మరో పుస్తకం అవుతుంది. విప్లవోద్యమానికి కవిత్వానికి గల సంబంధం గురించి మనం ఊహించని నిజాలు చెప్తాడు సత్యం. ‘‘ఇక్కడ/ అక్షరానికి జీవం పోయటం అనివార్యం అక్షరాన్ని సాయుధం చేయటం అనివార్యం తనని తాను పిండుకుని/ జీర్ణించుకుని, నిగ్గు దేల్చుకుని, మొగ్గు చూసుకుని/ ఒక్కొక్కరు ఒక్కో అక్షరమయ్యారు/ అక్షరాన్ని ఆపోసన పడుతున్నారు.
ఇప్పుడు వారి రక్తంలో/ ఎర్ర తెల్ల కణాలే కాదు అక్షర కణాలు కదులుతున్నాయి’’ అంటాడు. బహుశా విప్లవమూర్తులకు ఆహారంలాంటిది కవిత్వం. వాళ్ళ ఆచరణకు ఊపిరి లాంటిది కవిత్వం. కవిత్వాన్ని ఇంత ప్రేమిస్తారా వాళ్ళు అని మనకు ఆశ్చర్యం వేస్తుంది ఇట్లాంటి వాక్యాలు చదివితే. కవిగా సత్యం ఎంత ఎత్తున ఉంటాడో విమర్శకునిగా అంతే ఎత్తులో నిలబడ్డాడు. ఆయన రాసిన ప్రతీ వాక్యం ఆయన రక్తంతో రాసినట్టు ఉంటుంది. ఆయన చేసిన ప్రతీ ఊహ ఆయన ఊపిరితో నేసినట్టు ఉంటుంది. అంతటి సాహిత్య ప్రేమికుడు సత్యం. అయితే సత్యం తన నిబద్ధతను విప్లవోద్యమంలొనే కాదు సాహిత్య విప్లవోద్యమం లోనూ స్పష్టంగా ప్రకటించినవాడు సత్యనారాయణ. ఈ రకంగా సత్యం ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.అందుకే ఈ ఆదర్శమూర్తులను ప్రపంచానికి మరోసారి పరిచయం చేయటానికి రవీందర్ చేసిన మంచి ప్రయత్నం ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఎన్వీయార్,ఫాలాంక్స్, నోవా ల పేరుతో ఉన్న వ్యాసాలతో పాటు రవీందర్ రాసిన వ్యాసాలు కవితలు ఉన్నాయి.రవీందర్ చేసిన అక్షర చిత్రణలో ఈ ముగ్గురు మనుషులూ సముద్రమంత మనుషులన్న సంగతి స్పష్టమవుతుంది.సమాజం మీది ప్రేమనే వాళ్ళను సముద్రమంతటి మనుషులను చేసింది. వాళ్ల మీద రవీందర్ కు సముద్రమంత ప్రేమ ఉండటం వల్లనే ఈ పుస్తకం వచ్చింది. వ్యక్తివాదం ప్రబలుతున్న ఈనాటి సమాజానికి ఇట్లాంటి పుస్తకాల అవసరం ఎంతో ఉంది.
-తోకల రాజేశం
మంచిర్యాల, 9676761415
పుస్తకం : సముద్రమంత మనుషులు
పుటలు : 26, వెల:అమూల్యం
ప్రతులకు : హన్మాండ్ల రవీందర్
మందమర్రి, మంచిర్యాల జిల్లా
సెల్:9912233533





