7దశల్లో పార్లమెంట్‌ ఎన్నికలు

దేశంలో మోగిన ఎన్నికల నగారా
పార్లమెంట్‌తో పాటు నాలుగు రాష్టాల్ర ఎన్నికలు
అమల్లోకి  ఎన్నికల కోడ్‌
మే 13న ఎపి, తెలంగాణ ఎన్నికలు
అదేరోజు కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక
ఏప్రిల్‌ 19న తొలిదశ ఎన్నికల పోలింగ్‌
ఏప్రిల్‌ 26న రెండో దశ,మే 7న మూడో దశ
మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ
మే 25న ఆరో దశ, జూన్‌ 1న ఏడోదశ
జూన్‌ 4న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌
అదేరోజు ఫలితాల ప్రకటన
దేశంలో మొత్తం 97 కోట్ల మంది వోటర్లు
పురుష వోటర్లు 49.7 కోట్లు ,  మహిళా వోటర్లు 47.1 కోట్లు

న్యూదిల్లీ,ప్రజాతంత్ర,మార్చి16: దేశంలో సార్వత్రిక ఎన్నికల నాగారా మోగింది. పార్లమెట్‌ ఎన్నికలతో పాటు నాలుగు రాష్టాల్ర ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏదుదశల్లో పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఎన్నికల కోడ్‌ వెంటనే అమల్లోకి వొచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. శనివారం  న్యూ దిల్లీ  లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. లోక్‌సభతోపాటే నాలుగు రాష్టాల్రు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ముఖ్య ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రెస్‌ విూట్‌ ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడిరచారు. లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 19న నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 26న, మూడో దశ ఎన్నిలక పోలింగ్‌ మే 7న, నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ మే 13న, ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ మే 20న, ఆరోదశ ఎన్నికల పోలింగ్‌ మే 25న, ఏడోదశ ఎన్నికల పోలింగ్‌ జూన్‌ 1న జరుగనున్నాయి. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిరచనున్నారు. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్టాల్ర అసెంబ్లీలకు ఒకే దశలో, ఒడిశాకు రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్టాల్ర అసెంబ్లీలకు లోక్‌సభ తొలి దశ ఎన్నికలతోపాటు ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది.

ఆంధప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలతోపాటు మే 13న ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి లోక్‌సభ నాలుగు, ఐదు, ఆరు, ఏడు దశల ఎన్నికలతోపాటు నాలుగు దశల్లో మే 13న, మే 20న, మే 25, జూన్‌ 1న పోలింగ్‌ జరుగనుంది. ఇక కేవలం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ విషయానికి వస్తే.. అరుణాచల్‌ ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు,ఆంధ్రప్రదేశ్‌, చండీఘర్‌, డామన్‌ డయ్యూ,దిల్లీ, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, కేరళ, లక్షద్వీప్‌, లడఖ్‌, మిజోరం, మేఘలాయ, నాగలాండ్‌, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, పంజాబ్‌, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో సింగిల్‌ ఫేజ్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదేవిధంగా కర్ణాటక, రాజస్థాన్‌, త్రిపుర, మణిపూర్‌లలో రెండు దశల్లో.. ఛత్తీస్‌గఢ్‌, అసోం రాష్టాల్ల్రో మూడు దశల్లో.. ఒడిశా, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లలో ఐదు దశల్లో.. మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌లలో ఆరు దశల్లో, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, వెస్ట్‌ బెంగాల్లో ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ సహా వివిధ రాష్టాల్ల్రో మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక లు నిర్వహిస్తున్నట్లు సీఈసీ రాజీవ్‌కుమార్‌ చెప్పారు. తెలంగాణ లో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అసెంబ్లీ స్థానం ఖాలీ అయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 412 జనరల్‌ స్థానాలు కాగా, 84 ఎస్సీ రిజర్వ్‌డ్‌, 47 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలు ఉన్నాయని ఆయన చెప్పారు.కాగా, ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ వోటు  హక్కును వినియోగించుకోబోతున్నారని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. అందులో కోటీ 82 లక్షల మంది కొత్త వోటర్లు ఉన్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 12 లక్షల పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడిరచారు.

ఎన్నికల విధుల్లో మొత్తం 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారని చెప్పారు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న  17వ లోక్‌సభ కాలపరిమితి వచ్చే జూన్‌ 16వ తేదీతో ముగియనుంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్టాల్ర ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది.  దాంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని సీఈసీ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉందని తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం 7 దశలలో ఎన్నికలు జరగనుండగా.. ఏపీలో 4వ దశలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించ నున్నారు. ఏప్రిల్‌ 18న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నామని ఈసీ స్పష్టం చేసింది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్‌ 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు ఏప్రిల్‌ 29 వరకు ఛాన్స్‌ ఇచ్చారు. మే 13న ఎన్నికలు నిర్వహించి, జూన్‌ 4వ తేదీన వోట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. దాదాపు 12 రాష్టాల్లో పురుషుల కన్నా మహిళా వోటర్ల సంఖ్యే అధికం. దాదాపు కోటిన్నర మంది అధికారులు ఎన్నికల పక్రియలో భాగం కానున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 55 లక్షల ఈవీఎమ్‌లు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేస్తామని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారికి ఇంటినుంచే వోటు అవకాశం కల్పించారు. దేశ వ్యాప్తంగా పురుష వోటర్లు 49.7 కోట్లు ఉండగా, మహిళా వోటర్లు 47.1 కోట్లు ఉన్నారు. 88.4 లక్షల మంది దివ్యాంగ వోటర్లు ఉండా, 1.85 కోట్ల మంది తొలిసారి వోటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి 1,000 మంది పురుషులకు 948 మంది మహిళా వోటర్లు ఉన్నారు. మొత్తం వోటర్లలో 48 వేల మంది ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు.

 ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చర్యలు

భద్రత దృష్ట్యా కొన్ని చోట్ల డ్రోన్లతో నిఘా
10.5 లక్షలకు పైగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
85 ఏళ్లు పైబడిన వోటర్లు ఇంటివద్దనే వోటేసే ఛాన్స్‌

న్యూదిల్లీ,ప్రజాతంత్ర,మార్చి16:ఈసారి ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చూస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. ఈ క్రమంలో మూడేళ్లకు పైగా ఒకే చోట ఉన్న పోస్టులను మార్చాలని జిల్లా మెజిస్టేట్ర్‌కు కఠిన ఆదేశాలు ఇచ్చామని వెల్లడిరచారు. భద్రత దృష్ట్యా కొన్ని చోట్ల డ్రోన్లతో నిఘా కూడా ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. గత కొన్ని ఎన్నికల్లో కోర్టు కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. తప్పుడు వార్తలపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు గత ఎన్నికల్లో రూ.3400 కోట్ల నగదు స్వాధీనం చేస్తున్నామని, ఇది 837 శాతం ఎక్కువ అని చెప్పారు. ఈ నేపథ్యంలో 1.5 కోట్ల మంది పోలింగ్‌ అధికారులు, భద్రతా సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిరచారు. దీంతోపాటు 4 లక్షల వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. అయితే ఈసారి ఎన్నికల కోసం 10.5 లక్షలకు పైగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో 55 లక్షలకు పైగా ఈవీఎంలను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు.
దేశంలో 100 ఏళ్లు పైబడిన వోటర్లు 2 లక్షలకు పైగా ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ చెప్పారు. 85 ఏళ్లు పైబడిన వోటర్లు తమ ఇళ్లకు వెళ్లి వోటు వేపిస్తామని చెప్పారు. ఈసారి దేశంలోనే తొలిసారిగా 85 ఏళ్లు పైబడిన వోటర్లు, 40శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు చెప్పారు. అయితే ఈ వోటర్లకు ఫారమ్‌లు పంపి ఇంటి వద్ద నుంచి వోటు వేసే విధానాన్ని అమలు చేయనున్నట్లు మొత్తం ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించబడతాయని స్పష్టం చేసింది. ఇకపోతే తమతమ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు ఆ అభ్యర్థి చరిత్ర ఏంటి? క్రిమినల్‌ రికార్డ్‌ కలిగి ఉన్నాడా? అనే వివరాలను తెలుసుకోవడానికి ’నో యువర్‌ క్యాండిడేట్‌ అనే అప్లికేషన్‌ వోటర్ల కోసం అందుబాటులోకి ఉందని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఆ అభ్యర్థుల ఆస్తుల దగ్గర నుంచి కేసుల వివరాల దాకా.. ప్రతి విషయం అందులో ఉంటాయని తెలిపారు. ఒకవేళ ఓ అభ్యర్థి క్రిమినల్‌ రికార్డ్‌ కలిగి ఉంటే.. ఆ వివరాలను అతను తప్పకుండా న్యూస్‌ పేపర్లు, టీవీలకు మూడుసార్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. అలాగే.. క్రిమినల్‌ రికార్డ్‌ కలిగిన అభ్యర్థిని ఏ ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీకి రంగంలోకి దింపాలన్న వివరణ రాజకీయ పార్టీలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. అంతేకాదు.. అవినీతి అక్రమాలను అరికట్టేందుకు తాము వోటర్ల సహకారంతో సాంకేతికతను వినియోగించుకోవాలని అనుకుంటున్నామని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వోటర్లకు ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే.. ’సీ`విజిల్‌’ యాప్‌ని ఉపయోగించాలని కోరారు. డబ్బులు పంచుతున్నా, ఉచితాలు సరఫరా చేస్తున్నా, నియమాలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నా.. వెంటనే ఒక ఫోటో తీసి, యాప్‌లో తమకు ఫిర్యాదు అందజేయాలని అన్నారు. అప్పుడు మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా.. ఆ ప్రాంతానికి తమ బృందాన్ని 100 నిమిషాల్లోపే పంపిస్తామని.. వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలంగాణలో ఒకే విడతలో పార్లమెంట్‌ ఎన్నికలు
మే 13న పార్లమెంట్‌తో పాటు కంటోన్‌మెంట్‌ ఉప ఎన్నిక


న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,మార్చి16: తెలంగాణలో మొత్తం 17 లోకసభ స్థానాలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.  దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించ నుండగా తెలంగాణలో నాలుగో విడత పోలింగ్‌ జరగనుందని సిఇసి రాజీవ్‌ కుమార్‌ వెల్లడిరచారు. నాలుగో విడుతలో మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 13న ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. జూన్‌ 4న ఎన్నికల కౌంటింగ్‌ ఉంటుందని ఈసీ వివరించింది.లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడత జరుగనుండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడుతలో జరుగనున్నాయి. తొలి విడత ఏప్రిల్‌ 19న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. ఏప్రిల్‌ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడుత పోలింగ్‌, 20న ఐదో విడత, 25న ఆరో విడత, జూన్‌ ఒకటిన ఏడో విడత పోలింగ్‌ జరుగుతుందని సీఈసీ తెలిపారు. లోక్‌సభతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్‌ వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *