వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు
గ్రామాలపై ప్రత్యేక అధికారులకు సంపూర్ణ హక్కులు…బాధ్యతలు
ప్రత్యేక అధికారులతో పాలనపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని, ప్రజలను యువతను మహిళలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను అద్దంలా తయారు చేయాలని, ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చివరి రోజున గ్రామసభ నిర్వహించాలని పారిశుద్ధ కార్మికులకు సన్మానించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) సూచించారు. డ్రైవ్లో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు శుభ్రం చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని, గ్రామంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలందరిని భాగస్వామి చేస్తూ అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ రహిత గ్రామాల రూపకల్పన దిశగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి అన్నారు. పకడ్బందీగా విధులు నిర్వహిస్తూ మన గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్ది, రాబోయే వేసవికాలంలో ఎట్టి పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని మంత్రి సీతక్క అన్నారు.
శనివారం మంత్రి ప్రత్యేక అధికారులచే గ్రామ పంచాయతీ పాలన నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..గ్రామాల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగిసినందున మళ్ళీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులతో పాలన సాగించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారులు ప్రత్యేక అధికారిగా నియమించామని మంత్రి అన్నారు. ప్రత్యేక అధికారులుగా నియమితులైన వారికి గ్రామంపై సంపూర్ణ బాధ్యత, హక్కులు ఉంటాయని, ప్రత్యేక అధికారులు నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించుకొని, గ్రామ పంచాయతీ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు.
మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో భక్తులు సైతం జాతరకు ప్లాస్టిక్ తీసుకురాకుండా అవగాహన కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిర్వహించే జాతరలో సైతం ప్లాస్టిక్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక అధికారులు త్రాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని, మిషన్ భగీరథ కార్యక్రమం కింద ప్రతి గ్రామానికి త్రాగునీరు బల్క్ సరఫరా జరుగుతుందని, గ్రామంలో అంతర్గత సరఫరా బాధ్యతలను గ్రామ పంచాయతీకే అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్రాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కోటి రూపాయలు నిధులు కేటాయించిందని మంత్రి అన్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేలా మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించాలని, అందుబాటులో ఉన్న ఆర్థిక సంఘం నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ గ్రామాల్లో అవసరమైన పనులు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అధిక మొత్తంలో కూలీలకు పని దొరికేలా చూడాలని, వర్కింగ్ సైట్లో ఉపాధి కూలీలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, ఉపాధి హామీ కింద మంజూరు చేసిన పనులను త్వరితగతిన గ్రౌండ్ చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇంద్రవెల్లి సభతో బిఆర్ఎస్ నేతల కళ్లు బైర్లు
అందుకే విమర్శలు…ప్రియాంక రాకపైనా కవిత అక్కసు
ప్రియాంక కాలిగోటికి కూడా కవిత సరిపోరు
ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ప్రియాంక గాంధీ చేతులవిూదుగా మహిళలకు 500కే గ్యాస్ సింలిండర్ పథకం అమలు చేస్తే అడ్డుకుంటామని, నల్లబెలూన్లు ఎగురేస్తామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంతకన్నా దుర్మార్గం మరోటి ఉండదన్నారు. ప్రియాంక కాంగ్రెస్ అగ్రనేత అన్న విషయం కవిత తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రియాంక కాలి గోటికి కూడా కవిత సరిపోదని మండిపడ్డారు. ఇంద్రవెల్లి సభ చూసిన బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అక్కసు వెళ్ల గక్కుతున్నారని విమర్శించారు. అందుకే విమర్వలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రియాంకది త్యాగాల కుటుంబం అయితే.. కవితది అమరుల త్యాగాల విూద రాజభోగాలు అనుభవిస్తున్న కుటుంబమని ధ్వజమెత్తారు.
ఇంద్రవెళ్లి సభ పార్టీ నిధులతో నిర్వహించాం..బీఆర్ఎస్లా ప్రజాధనం దుర్వియోగం చేయలేదని చెప్పారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్టాన్న్రి సొంత ఎస్టేట్ గా భావించి దోచుకున్నారని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. పదే పదే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటున్న బీఆర్ఎస్ కు ఎందుకంత అక్కసని ప్రశ్నించారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సాగు చేయని భూమికి రూ.14 లక్షల రైతుబంధు తీసుకున్నారు.. ఇలా కోట్లాది రూపాయల రైతుబంధు మింగిన వారెవరో కక్కిస్తామన్నారు. అసలైతన రైతులకు రైతుబంధు ఇస్తామని చెప్పారు. అంతకుముందు విూడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత ఇంద్రవెల్లి సభ కోసం కాంగ్రెస్ ప్రభుత్వ నిధులు ఎలా ఉపయోగించారని కవిత ప్రశ్నించారు. ఏ హోదాలేని ప్రియాంక గాంధీని ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీని పిలిస్తే నిరసన తెలుపుతామని హెచ్చరించారు.




