మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు
రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణవార్త విని బయలుదేరిన కుటుంబసభ్యులు సైతం మృత్యువాత
నిడమనూరు మండలం వేంపాడు వద్ద బైక్, ఆటో, లారీలు ఢీ
మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : దట్టమైన పొగమంచు…కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించనంత పొగమంచు కమ్ముకున్న దశలో సరైనా దారి కనబడక పోవడంతో ఆర్దరాత్రి 11 గంటల సమయంలో రోడ్డు వెంట ఉన్న దుకాణంను మూసి ఇంటికి వెళదామని ఓ పెద్ద మనిషి రోడ్డు దాటుతుండగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, ఆ ప్రమాదంలో కొడుకు మరణవార్త విని తల్లడిల్లిపోయిన కుటుంబసభ్యులు శోకసముద్రంతో విలపిస్తూ కొడుకు మృతదేహాన్ని చూసేందుకు వాహనంలో వొస్తుండగా ఆ కుటుంబ సభ్యులను సైతం అదే రోడ్డు ప్రమాదం లారీ రూపంలో బలిగొన్నది. ఇలా మొత్తం 6గురిని బలి తీసుకున్న హృదయ విశాదరకరమైన సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామ సమీపంలో గల జడ్చర్ల` కోదాడు హైవేపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్ధానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర మండలం మల్లెవానికుంట తండాకు చెందిన రమావత్ శివ(19) వ్యక్తిగత పని మీద మిర్యాలగూడకు వొచ్చి తిరిగి ఆర్ధరాత్రి 11 గంటల సమయంలో స్వగ్రామానికి వెళుతున్నాడు.

ఈ క్రమంలో రహదారిపై పొగమంచు అధికంగా ఉండడంతో నిదానంగా వెళుతూ నిడమనూరు మండలం వేంపాడు గ్రామ సమీపంలోకి వొచ్చాడు. అదే సమయంలో రోడ్డు వెంట చిన్న చిల్లర కొట్టును నడుపుకుంటూ జీవిస్తున్న బల్గూరి సైదులు(60) ఆర్ధరాత్రి అయిందని దుకాణంను మూసి ఇంటికి తిరిగి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనంపై వొస్తున్న శివ పొగమంచులో కనబడకుండా ఉన్న సైదులను బలంగా ఢీకొట్టాడు. దీంతో దాదాపు 50 గజాల దూరం వరకు ఎగిరిపడిన శివ అపస్మారక స్ధితిలోకి వెళ్లగా, తలకు బలమైన గాయాలు కావడంతో సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతర వాహనదారులు వెంటనే 108కు కాల్ చేయగా సంఘటన స్ధలంకు చేరుకున్న వైద్య సిబ్బంది అపస్మారక స్ధితిలోకి వెళ్లిన శివను చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించే ప్రయత్నం చేస్తుండగా శివ సైతం మృతి చెందాడు. శివ వద్ద లభించిన ఆధారాలతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ గ్రామ వాసుల సహకారంలో ఒక టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు.

సుమారుగా తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో అదే వేంపాడు గ్రామ సమీప:లోకి రాగానే దట్టమైన పొగ మంచు ఉండడంతో ఎదురుగా వొస్తున్న ఒక లారీని కుడివైపుకు టాటా ఏస్ వాహనం బలంగా డీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ రమావత్ పాండు(40), శివ పెదనాన్న రమావత్ గన్యా (48), మేనత్త మూఢావత్ బుజ్జీ(38), బావ ధూపావత్ నాగారాజు (28)లు అక్కడికక్కడే మృతిచెందారు. శివ తల్లిదండ్రులు రమావత్ ప్రబాకర్, తల్లి లక్ష్మీలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే వారిని మెరుగైన చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. గంటల వ్యవధిలోనే రెండు అత్యంత ప్రమాదకరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృత్యువాతకు గురికావడం పలువురికి కంటతడి పెట్టించింది. రహదారి మొత్తం రక్తసిక్తం కావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడం చాలా ఇబ్బందిగా మారింది. పొగ మంచు కావడంతో వాహనాలు ఎటు నుండి ఎటు వైపుకు వెళుతున్నాయో ఆర్దం కాక పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. మృతి చెందిన వారందరిని పోస్ట్‌మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్‌కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసడుతున్నట్లు నిడమనూరు సీఐ గాంధీ, ఎస్‌ఐ గోపాల్‌రావులు తెలిపారు.




