– మేడారంలో వైద్య సేవల కోసం ఏర్పాటు
– జాతరకు వెళ్లే రూట్లలో మరో 42 క్యాంపులు
– 35 అంబులెన్సులు, 3,199 మంది సిబ్బందితో వైద్య సేవలు
– ఏర్పాట్లపై అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోద ర్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాదిమంది భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈమేరకు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే లక్షలమంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గద్దెల వద్ద, జంపన్న వాగు సమీపంలో, ఆర్టీసీ బస్టాండ్ వద్ద మూడు వైద్య శిబిరాలను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాలలో మరిన్ని వైద్య శిబిరాలను ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు. భక్తులు మేడారం బయలుదేరిన దగ్గరి నుంచి అమ్మవార్లను దర్శించుకుని క్షేమంగా ఇళ్లకు చేరేవరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మేడారం చేరుకునే అన్ని రూట్లలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
50 పడకల ప్రధాన హాస్పిటల్
అత్యవసర వైద్య సేవల కోసం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో కూడిన ప్రధాన హాస్పిటల్ (శ్రీ సమ్మక్క సారలమ్మ వైద్యశాల) ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీనికి అదనంగా జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద ఆరు పడకల సామర్థ్యంతో రెండు మినీ హాస్పిటళ్లు, జాతర పరిసరాల్లో 30 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎనిమిది రూట్లలో క్యాంపులు
వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చే 8 ప్రధాన రూట్లలో ఎక్కడా వైద్య సేవలకు లోటు రాకూడదని మంత్రి సూచించారు. ఇందుకోసం 42 ఎన్-రూట్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. హనుమకొండ – మేడారం రూట్‌లో అత్యధికంగా తొమ్మిది, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే భక్తుల కోసం ఆరు, భద్రాచలం రూట్‌లో 5 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడిరచారు.
3,199 మందితో వైద్య సైన్యం
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భారీగా వైద్య సిబ్బందిని మోహరించాలని మంత్రి ఆదేశించారు. పూర్వ వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి మొత్తం 3,199 మంది సిబ్బందిని విధుల్లోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఇందులో 72మంది స్పెషలిస్టులు, 42మంది మహిళా వైద్యులతో కలిపి 544మంది వైద్యులు విధుల్లో ఉంటారు. వీరికి తోడుగా 2,150 మంది పారా మెడికల్ సిబ్బంది (నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు) షిఫ్టుల వారీగా 24 గంటలపాటు సేవలు అందించనున్నారు.
అత్యవసర సేవలకు 35 అంబులెన్సులు
గుండెపోటు, ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేలా 35 అంబులెన్సులను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు, వరంగల్ ఎంజీఎంలకు తరలించాలని మంత్రి సూచించారు. ఈ రెండు హాస్పిటళ్లలో నెల రోజుల పాటు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
మందుల కొరత రాకూడదు
చిన్న పిల్లల మందుల దగ్గరి నుంచి పాముకాటు విరుగుడు ఇంజెక్షన్ల వరకు 248 రకాల మందులు, సర్జికల్ సామగ్రిని ముందస్తుగానే సిద్ధం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే 25వ తేదీ నుంచి అన్ని వైద్య శిబిరాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. తక్షణమే మేడారం వెళ్లి ఏర్పాట్లను పరిశీలించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్‌ను మంత్రి ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





