మరెన్నో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతాం..
కాంగ్రెస్ అలవిగాని హామీలను నమ్మి ప్రజలు మోసపోయారు..
ప్రభుత్వ పాలన రోజు రోజుకు దిగజారుతోంది.
ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : తెలంగాణ కోసం సాగిన తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సి ఉన్నదని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాలపాటు దిక్కు మొక్కు లేక కొట్టుమిట్టాడిన తెలంగాణ ను దరికి చేర్చేందుకు నాడు ఉద్యమ కేతనమై ఎగిరిన గులాబీ జెండా రెపరెపలు., తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే దాకా, కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో ఆగమైతున్న తెలంగాణను అక్కున చేర్చుకుని మళ్లీ గాడిలో పెట్టేవరకు కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘటించారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి కేసీఆర్ బుధవారం ప్రసంగించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ…” తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించాం. లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు..” అని తెలిపారు. “తెలంగాణ సాధించేనాటికి మనది సమైక్యపాలనలో దిక్కు మొక్కు లేని పరిస్థితి. సాగు, తాగునీరు కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నాం. పదేండ్ల అనతికాలం లోనే తెలంగాణ లో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయం లో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారు. అని కేసీఆర్ వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్, రైతు బంధు అందట్లేవన్నారు. తాగునీరు, సాగునీరు,విద్యుత్ సరఫరా కాట్లేవన్నారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నాయని తెలిపారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.
నాడు ఎన్టీఆర్ ని తిరిగి ఎట్లైతే ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బిఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారని., అంతకంటే రెట్టింపు మద్దతుతో మనలను గద్దె మీద కూర్చుండబెట్టే రోజు త్వరలోనే వస్తుందని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ అధినేత ప్రకటించారు. కాంగ్రేస్ ప్రభుత్వ పాలన రోజు రోజుకు దిగజారుతున్నదన్నారు. పార్టీ అనేది నాయకులను సృష్టిస్తదని, నాయకులు పార్టీ లోకి వచ్చి పోతుంటారని కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని ప్రకటించారు.
కాగా… నియోజక వర్గాలవారీగా కార్యకర్తలు, నేతలతో అధినేత వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.ఇందుకు సంబంధించి ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇంచార్జీలకు ఇచ్చిన సమయం మేరకు అధినేత తో నియోజక వర్గాల వారీగా వరుస సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా తమ అధినేతను కలిసేందుకు అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఆర్మూర్,హుజూరాబాద్ నియోజక వర్గాలకు చెందిన నేతలు కార్యకర్తలు వందలాదిగా ఎర్రవెల్లి లోని కేసీఆర్ నివాసానికి తరలివచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కేసీఆర్ ఫోటోలు దిగారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచులు పాల్గొన్నారు.




