భౌగోళికంగా భారత్‌తో నేపాల్, మాల్దీవ్స్, భూటాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మియాన్మార్, చైనా, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ దేశాలు సరిహద్దులను పంచుకుంటూ ఇరుగు పొరుగు దేశాలుగా నిలుస్తున్నాయి. మన ఇరుగుపొరుగు దేశాలతో చైనా సంబంధాల ప్రభావం భారత దౌత్య విధానాలకు పెను సవాళ్ళను విసురుతూ 2024లో ప్రధాన సమస్యగా నిలవవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సార్క్ దేశాలైన అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలకు చైనా ఆర్థిక సహాయం చేస్తూ ‘వన్ బెల్ట్ వన్ రోడ్డు’తో పాటు ఆ దేశాలను అప్పుల ఉచ్చులో బిగిస్తూ (డెట్ ట్రాప్ పాలసీ) తన ఆదీనంలోకి తీసుకోవాలనే కుయుక్తులు పన్నుతున్నట్లు తేలుతున్నది. ఆసియా దేశాల్లో చైనాతో ధీటుగా భారత ఆర్థిక వ్యవస్థ పెరగడం, భారత్ – యూఎస్ సంబంధాలు బలపడడంతో చైనా పట్టు సాధించడం కష్టంగానే తోస్తున్నప్పటికీ భారత ప్రభుత్వం తగు జాగ్రత్త చర్యలు సత్వరమే తీసుకోవలసిన అగత్యం ఏర్పడుతున్నది.
నేపాల్‌తో సంబంధాలు: నేపాల్‌కు 1.34 బిలియన్ డాలర్లకు పైగా సహాయం చేసిన చైనాతో నేపాల్ ఆర్థిక, దౌత్యపరమైన సంబంధాలు బలపడడంతో పాటు డజనులకు పైగా ఒప్పందాలు కూడా చేసుకొని నేపాల్‌ను తన పిడికిల్లో బంధించుకోవాలని డ్రాగన్ దేశపు విష కోరలు ఎదురు చూస్తున్నాయి. గత నేపాల్ ప్రభుత్వాలు చైనాతో పటిష్ట సంబంధాలకు తెరలేపినప్పటికీ నేటి బంగ్లా ప్రధానమంత్రి ‘ప్రచండ’ చొరవతో భారత్‌తో సంబంధాలు కూడా కొంత వరకు బలపడవచ్చని తెలుస్తున్నది. నేడు భారత్ కూడా నేపాల్‌కు అవసర సాయం చేస్తూ శక్తి లేదా పవర్ కొనుగోలు ఒప్పందాలు, దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందాలు, మధ్యంతర ఒప్పందాలు లాంటి సహాయాలను నేపాల్‌కు చేస్తున్న భారత్ కూడా చైనాతో సమఉజ్జీగా భారతం నిలిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థం అవుతున్నది.
మాల్దీవులతో సంబంధాలు: ఇప్పటికే 200 బిలియన్ల యూఎస్ డాలర్లు ఖర్చు చేసి 2012 నుంచి మాల్దీవులతో సంబంధాలను పటిష్ట పరుచుకోవడంలో చైనా ఇప్పటికే సఫలీకృతం అయ్యింది. ఏయిర్‌లైన్స్, వాటర్ ప్రాజెక్టులు, మురికి కాలువల నిర్వహణ వ్యవస్థలు, గృహ నిర్మాణాలతో మార్దీవులను సంకలో పెట్టు కోవడానికి చైనా పన్నాగం పన్నుతున్నది. మాల్దీవుల పరిధిలో ఉన్న 1,200 చిన్న చిన్న ద్వీపాల్లో 17 ద్వీపాలను ఇప్పటికే చైనా లీజుకు తీసుకోవడం కూడా జరిగిపోయింది. మాల్దీవుల జీడిపీలో 40 శాతం విలువగల 1.5 బిలియన్ల ఆర్థిక సహాయాన్ని చైనా చేయడంతో తిరిగి ఆ అప్పులను చెల్లించడంలో పేద దేశమైన మాల్దీవులు విఫలమై చిక్కులు పడవచ్చని, దీనితో చైనా సంబంధాల ప్రభావం పెరగవచ్చని తెలుస్తున్నది.
పాకిస్థాన్‌తో సంబంధాలు: అప్పుల ఉచ్చులో పాకిస్థాన్‌ను బిగించి పట్టు సాధించే ప్రయత్నాల్లో చైనా ముందడుగు వేస్తున్నది. 2020లో చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్‌కు డ్రాగన్ దేశం 63 బిలియన్ యూఎస్ డాలర్లు ఖర్చు చేసి పాక్‌ను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ఫిబ్రవరి 2024లో జరగనున్న పాక్ ఎన్నికల్లో నవాజ్ షరీప్ అధికారంలోకి రావచ్చనే తాజా అంచనాలతో భారత్ పాకిస్థాన్ సంబంధాల్లో కొంత మార్పు రానున్నట్లు తెలుపుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ కాలంలో బలహీనపడిన భారత్ పాక్ సంబంధాలు తిరిగి బలపడవచ్చని ఆశాభావం భారతం వ్యక్తం చేస్తున్నది. శ్రీలంకతో సంబంధాలు: శ్రీలంకతో చైనా సంబంధాల కన్న ఉదార సహాయంతో భారత్ సంబంధాలు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తున్నది. చైనాను శ్రీలంక అధ్యక్షుడు రాణి విక్రమసింగే ఆర్థిక సహాయం కోరగా డ్రాగన్ తిరస్కరించడంతో భారత్ ఆర్థిక చేయూతనిచ్చి శ్రీలంకను ఆదుకోవడంలో సఫలీకృతం కావడం ఉపశమనాన్ని కలిగిస్తున్నది. రానున్న రోజుల్లో మారనున్న రాజకీయ ముఖచిత్రంతో భారత్ చొరవ తీసుకొని శ్రీలంకతో ద్వైపాక్షిక దౌత్య సంబంధాలను పటిష్ట పరుచుకోవాలని కోరుతున్నారు.
బంగ్లాదేశ్‌తో సంబంధాలు: గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్‌తో భారత సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రానున్న బంగ్లా ఎన్నికల్లో తిరిగి హసీనా నేతృత్వ పార్టీ ప్రభుత్వం ఏర్పడవచ్చనే వార్తలతో భారత్ తన సంబంధాలను పటిష్ట పరుచుకోవడావికి అవసరమైన పావులు కదపవలసిన సమయం ఆసన్నమైంది. 2016-22 మధ్య చైనా 26 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేసి బంగ్లాతో దోస్తీ పెంచుకోవడానికి పావులు కదుపుతున్న విషయం భారత్ తెలుసుకొని మసలు కోవాలి. బంగ్లాకు అత్యధికంగా ఒక బిలియన్ డాలర్ల వరకు విదేశీ పెట్టుబడులు పెట్టడంలో చైనా సఫలం అయ్యింది.
మియన్మార్‌తో సంబంధాలు: మియన్మార్‌లో నియంతృత్వ పాలనను ప్రోత్సహిస్తూ చైనా అక్కడి మిలిటెంట్ గ్రూపులకు కూడా సహాయం చేస్తున్నది. మియన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడానికి భారత్ చేయూతను ఇస్తున్నది. ఉక్రెయిన్, పాలస్తీనా యుద్ధాల వైపు యూఎస్ దృష్టి అధికంగా ఉండడంతో మియన్మార్‌లో మిలిటరీ నియంతృత్వ బలగాలు ప్రజాస్వామ్యవాదులను అణచి వేయడం జరుగుతోంది. అణచివేత, హింసాత్మక ఘటనలకు లోనవుతున్న మియన్మార్ ప్రజాస్వామ్యవాదులకు నేటి భారత ప్రభుత్వం చేయూతనిస్తూ ఆయా వర్గాలను కాపాడుకోవడంలో దృష్టి సారించాలి.
భూటాన్‌తో సంబంధాలు: భూటాన్‌తో సత్సంబంధాలను కలిగి ఉన్న భారత ప్రభుత్వం చైనా సంబంధాలు పెరగకుండా చూసుకోవాలి. డోక్లామ్ ప్లాటీవ్‌లో దేశ భద్రతకు ప్రధానమైన భూటాన్-భారత్-చైనా ట్రై-జంక్షన్, చైనా నిర్మించ తలపెట్టిన వివాదాస్పద రోడ్డు పనులు కూడా మన దేశ భద్రతకు ముప్పుగా నిలవవచ్చని తెలుసుకొని భూటాన్‌తో సత్సంబంధాలను కొనసాగించాలి. సార్క్ దేశాలైన పాకిస్థాన్‌కు 12.9 బిలియన్ డాలర్లు, శ్రీలంకకు 3.11 బిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్‌కు 13.87 బిలియన్ డాలర్లు, అఫ్ఘానిస్థాన్‌కు 210 మిలియన్ డాలర్లు, నేపాల్‌కు 1.34 బిలియన్ డాలర్లు, మాల్దీవులకు 970 మిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక సహాయం చేసి పట్టు బిగిస్తున్న వేళ 2024లో భారత్ సత్వరమే మేల్కొని తన ఇరుగుపొరుగు దేశాలతో దౌత్యపరమైన సత్సంబంధాలను నెలకొల్పడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, లేని యెడల తీవ్రమైన భద్రతా సమస్యలను చైనా నుంచి భారత్ ఎదుర్కోవలసి ఉంటుందని మరువరాదు.
-డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





