ఎనిమిది మంది లొంగుబాటు
భారీగా ఆయుధాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ములుగు ఎస్పి శబరిష్
ములుగు, ప్రజాతంత్ర ,మే 17: జిల్లాలో 20 మంది మావోయిస్టులను అరెస్టు చేసి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ శబరిష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లడుతూ.. ప్రభుత్వ నిషేదిత సిపిఐ మావోయిస్టులు ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు పెరురు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా ఎలిమిడి , ఊసురు పోలీస్ స్టేషన్ల పరిధిలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టు గెరిల్లా బేస్ స్థాపించేందుకు ఐఈడీలు (బాంబులు) అమర్చారు. ఈ నెల 8న ఆదివాసీలు ఇతరులు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోకి రావద్దని మావోయిస్టులు ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేశారు. మావోయిస్టులు కొంత కాలంగా కర్రెగుట్టలను కేంద్రంగా చేసుకొని చట్టవ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తుండడంతో, ఇటీవల సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులు భారీ స్థాయిలో కర్రెగుట్టలపై సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించారని అన్నారు. ప్రస్తుతం కర్రే గుట్టల్లో గాలింపు చర్యల నేపథ్యంలో అక్కడ ఆశ్రయం పొందిన సిపిఐ మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకొని చిన్న చిన్న గ్రూపులుగా వివిధ ప్రదేశాలకు పారిపోతున్నారని ములుగు పోలీసులకు సమాచారం ఉందని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పాలెం ప్రాజెక్టు వద్ద వాహనాల తనిఖీలో ఆరుగురు మావోయిస్టులను, శనివారం ఉదయం వాజేడు పీఎస్ పరిధిలో మురుమూరు అటవీ ప్రాంతంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో ఏడుగురు మావోయిస్టులను కన్నాయిగూడెం పోలీస్ పరిధిగుట్టల గంగారాం గుత్తికోయ గ్రామ సమీపంలో చేపట్టిన పెట్రోవింగ్ లో ఏడుగురు మావోయిస్టులను మొత్తం 20మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన మావోయిస్టులలో వివిధ హోదాలో పనిచేయుచున్న వారు ఉన్నారు.. వారిలో డివిజన్ కమిటీ సభ్యుడు 1, ఏరియా కమిటీ సభ్యులు 5, పార్టీ సభ్యులు 14, మొత్తం 20 మంది అరెస్టు చేసినట్టు తెలిపారు.అజ్ఞాతంలో పనిచేస్తున్న నిషేదిత సిపిఐ మావోయిస్టు నాయకులు, సభ్యులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ పాలిసీ విధానాన్ని వినియోగించుకొని వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించారు. అలాగే ప్రజలు నిషేధిత సీపీఐ మావోయిస్టు లకు సహాయం చేయొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్పీ ,డిఎస్పి సిఐలు, ఎస్సై పాల్గొన్నారు.