ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు
కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీమ్ కోర్టు ఆదేశాలు
న్యూ దిల్లీ, సెప్టెంబర్ 16 : 20 వేల మంది విద్యార్థులకు ఊరట కలిగించేలా కేంద్రానికి సుప్రీమ్ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వొచ్చిన వైద్య విద్యార్థులు..ఇతర దేశాల కళాశాలల్లో చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ఇందుకోసం ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అకడమిక్ మొబిలిటీ పోగ్రామ్ కింద వారు ఇతర దేశాల కళాశాలల్లో చేరే అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. 20 వేల మంది విద్యార్థులు దేశంలో చదువు కొనసాగించే వీలు లేనందున..వారి విద్యాభ్యాసానికి సంబంధించి కేంద్రమే అన్ని చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది.
ఎంబీబీఎస్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లిన వేల మంది భారతీయ విద్యార్థులు..రష్యాతో యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగొచ్చారు. వారిలో కొందరు..తాము భారతీయ వైద్య కళాశాలల్లో చేరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీమ్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం విచారణ జరుపుతుండగా..గురువారం కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం..విదేశాల నుంచి తిరిగివచ్చిన విద్యార్థుల్ని భారతీయ కళాశాలల్లో చేర్చుకునే ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. దీనిపై విద్యార్థుల తరఫు న్యాయవాదులు శుక్రవారం వాదనలు వినిపించారు.
విద్యా సంవత్సరం కోల్పోకుండా..కేంద్రమే సంబంధిత దేశాలతో చర్చించి, తగిన చర్యలు చేపట్టేలా చూడాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్రానికి కీలక సూచనలు చేసింది సుప్రీమ్ కోర్టు. ఉక్రెయిన్ భాష, సిలబస్‌కు సరిపోయేలా..20 వేల మంది విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కేంద్రానికి సుప్రీమ్ కోర్టు నిర్దేశిరచింది. విద్యార్థులు చుట్టుపక్కల దేశాలకు వెళ్లి కళాశాలలు వెతుక్కోవాల్సిన పరిస్థితి రాకుండా..కేంద్రం చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయపడింది. వారి కోర్సును అభ్యసించ గలిగేలా..పారదర్శకతతో వివరాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది.
ఇందుకోసం కళాశాల ఫీజులు, అందుబాటులో ఉన్న సీట్లు వంటి వివరాలతో ఒక పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని సూచించింది. విద్యార్థులు కావాల్సిన కళాశాలను ఎంచుకునేలా బదిలీ ఆప్షన్ ఇవ్వాలని నిర్దేశిచింది. ఇందుకు అనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికతో వొస్తారని ఆశిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది సుప్రీమ్ కోర్టు. విచారణను వొచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. మరోవైపు..ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థుల్ని యుద్ధ బాధితులుగా ప్రకటించాలన్న న్యాయవాదుల అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అది సైనికపరమైన అంశాల్లోనే సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.



