18 ఏళ్లలో ఎన్నో మార్పులతో వటవృక్షంగా కమలదళం

అప్పట్లో ఎన్‌డిలో మిత్రపక్షాలు కీలకం.. ఇప్పుడు మాత్రం వారు కేవలం నామమాత్రమే. ఎందుకంటే బిజెపికి తగినంత మెజార్టీ ఉంది. నాడు ఎన్డీయేలో ఉన్న శివసేన ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా లేదు. నాడు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు టీడీపీ అధి కారంలో లేదు. అలాగే ఎన్డీఎలో భాగస్వామి కూడా కాదు. తమిళనాడులో అన్నాడీఎంకే ఇప్పటికీ మిత్రపక్షంగగానే ఉంది. జయలలిత మరణం తరవాత అన్నాడిఎంకె బిజెపితో జత కట్టింది. అప్పట్లో జయలలిత ఎన్డీయే శిబిరంలో చేరితే డీఎంకే కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. తమిళనాట ఇప్పుడూ అదే పరిస్థితి ఉన్నా.. తమకు ఏ మిత్రపక్షం అవసరం లేదనే ధీమా ఇప్పుడు బీజేపీలో నెలకొంది. నాడు జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికల వాతా వరణం ఉంటే ఈసారి తెలంగాణలో ఏడాది ముందే ఆ వాతావరణం ఏర్పడింది.

ఒకప్పుడు టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో కీలకంగా మారింది. అప్పట్లో బీజేపీ నేతలు హైదరాబాద్‌ ‌వచ్చినా భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించేవారు కాదు. ఇప్పుడు ఆ ఆలయం తెలంగాణలో బీజేపీ రాజకీయాలకు కేంద్రంగా మారింది. మరోవైపు 2004 సమావేశాలు జరిగినప్పుడు గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నా.. మోదీ అంతగా ప్రభావం చూపలేక పోయారు. హైదరాబాద్‌ ‌సమావేశాల తర్వాత ఎన్నికల్లో రెండుసార్లు సారథ్యం వహించేందుకు ఆడ్వాణీకి అవకాశం లభించినా.. ఆయన తన సత్తా నిరూపి ంచుకోలేకపోవడంతో పార్టీ, సంఘ్‌ ‌పరివార్‌ ‌దృష్టి మోదీపై  పడింది. యూపీఏ పదేళ్ల హయాంలో జరిగిన అవినీతి కుంభ కోణాలు, ఆరోపణలు, జనాందోళనలు మోదీకి అనుకూలంగా మారాయి. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన మోదీ.. ఇప్పుడు బీజేపీని దేశమంతటా విస్తరించాలన్న ఊపులో ఉన్నారు.

దేశవ్యాప్తంగా మోదీకి తిరుగులేని వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలో విజయపతాకం ఎగుర వేయాలన్న లక్ష్యంతో ఈసారి హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 18 ఏళ్లలో బీజేపీ ఎన్నో ఉత్థాన పతనాలను చూసింది. అలాగే, బీజేపీ రాజకీయాలూ ఎంతో మారాయి. అప్పట్లో అయోధ్య, కాశీ, మధుర, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు ఎజెండాగా ఉన్నాయి. సంకీర్ణ సర్కారు కావడంతో వాజపేయి హయాంలో వాటిని పక్కన పెట్టాల్సి వచ్చింది. కానీ, అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని మోదీ సాకారం చేశారు. కశ్మీర్‌లో అధికరణ 370ని రద్దు చేశారు. కాశీ, మధురలకు ప్రాధాన్యం లభించింది. అయితే ఆనాటికీ నేటికీ ఎంతో తేడా ఉంది. ఆనాడు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడ్డ బిజెపి ఇప్పుడు అప్రతిహతంగా ఎదిగింది. మహావటవృక్షంగా పెరిగింది. దేశంలో తిరుగులేని పార్టీగా ఆవిర్భవించింది.  అదే సమయంలో కాంగ్రెస్‌ ‌పతనం అంచున ఉంది. అందుకే అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. నాడు వాజపేయి ఒక సంకీర్ణ ప్రభుత్వానికి నేత అయితే.. ఇప్పుడు మోదీ పార్టీని రెండుసార్లు పూర్తి మెజారిటీతో అధికారంలోకి తెచ్చిన నేతగా నిలిచారు. బీజేపీలోకి కొత్త రక్తం, కొత్త తరం వచ్చింది. ఈ క్రమంలో బిజెపి మరింత చొచ్చుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *