– వర్చువల్‌గా ప్రారంభించనున్న నరేంద్రమోదీ
– రాష్ట్రంలో బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు ప్రారంభం
– పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 103 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. ఇందులో బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడపనుండటం విశేషం. బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
పునరాభివృద్ధి పనులు జరుగుతున్న అన్ని రైల్వేస్టేషన్లలో ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముఖద్వారం, స్టేషన్ ప్రధాన భవనాల నిర్మాణం సాగుతోంది. అంతేకాకుండా స్టేషన్ లోపల ప్రయాణికులకు అనువుగా ఫుట్‌పాత్‌లు, విశాలమైన ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, బుకింగ్ ఆఫీస్, టాయిలెట్ల నిర్మాణం, సైనేజ్ బోర్డుల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగనున్నట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.