అంతటి సంక్షోభ సమయంలో, తమ వర్గం మీదే అక్కడ మారణకాండ జరిగినప్పటికీ, దాని ప్రభావం వల్ల ఇక్కడ హైదరాబాద్ లో విచక్షణ కోల్పోయే ప్రమాదాన్ని వూహించి పాతబస్తీ కాలనీల్లో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న వందలాదిమంది మహిళా లింక్ వాలంటీర్లు ఒక శుక్రవారం నమాజు ముగిసే సమయానికి, పోలీసుల నిర్బంధాన్ని, కట్టుబాట్లను ఎదిరించి మరీ చార్మినార్ చుట్టూ బలమైన మానవహారాన్ని నిర్మించారు. గుజరాత్లో జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహంతో వూగిపోతున్న యువకులను శాంతపరచటంలో, ప్రజాస్వామ్య నిరసన వైపు మళ్లించటంలో ఆ సామాన్య ముస్లిం మహిళలు తీసుకున్న చొరవ సదా స్మరణీయం. ఆరోజు వాళ్లు ఆక్కడ ఆ మానవహారం నిర్మించకపోయి వుంటే హైదరాబాద్ ఎంతటి కల్లోలాన్ని ఎదుర్కొని వుండేదో వూహించలేము!
నిశ్శబ్దంగా పనిచేసే అనేకమంది (అ)సామాన్యులు అన్ని మతాలలో వున్నారు కాబట్టే కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ‘మర్కజ్’ పేరుతో ఎంత మతవిద్వేషాన్ని రగిలించాలని చూసినా గానీ హైదరాబాద్ ఆ కష్టాన్ని నిబ్బరంతో దాటగలిగింది. సామాన్యప్రజల మధ్య వుండే మతపరమైన అంతరాల్ని, సందేహాల్ని, భయాలను రాజకీయ దురుద్దేశాల కోసం ఉపయోగించుకున్న సంధర్భాలు అనేకం మనకు కనిపిస్తాయి. అయితే, ఎన్ని వొడిదుడుకులు వచ్చినా గానీ హైదరాబాదీ తెహజీబ్ ని నిలిపే వ్యవస్థల్ని గౌరవించుకోవాలి. దీనికంటే ముందు గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని మతవిద్వేషంలో ముంచటానికి ప్రయత్నం చేసిన ప్రతీ సందర్భంలోనూ వాటిని ఎదుర్కుంటూ ప్రజల మధ్య స్నేహాన్ని, సామరస్యాన్ని పెంపొందించిన సందర్భాలు, సన్నివేశాలు సజీవంగా వున్నాయి. వాటిని గుర్తు చేసుకోవాలి. కొత్త తరానికి వాటిని పరిచయం కూడా చేయాలి.
1990- 1992 సంవత్సరాలలో హైదరాబాద్ నగరం మతాన్ని తమ రాజకీయ దురుద్దేశాల కోసం, అధికార కుమ్ములాటల కోసం ఉపయోగించుకున్న అనేక వొడిదుడుకులను ఎదుర్కొంది. రోజుల తరబడి నగరంలోని సగభాగమైన పాతబస్తీ కర్ఫ్యూలతో, నిర్బంధంతో కనీస అవసరాలు కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొన్నది. బాధితులు కేవలం ఒక వర్గంవారే కాదు. భిన్నసమూహాలు అలాంటి దాడులకు గురయ్యాయి. గుర్తు తెలియని, విచక్షణ లేని గుంపు చీకటిలో కత్తులతో దాడి చేసుకుంటూ వెళితే క్షతగాత్రులు పసిపిల్లలతో సహా అనేకమంది. ప్రాణాలు కోల్పోయిన వాళ్లు మరెంతో మంది. అప్పటి తరం వాళ్లకి గుర్తుండే వుంటుంది ఒక పసిపాప మొహం మీద అడ్డంగా పడిన కత్తి గాట్లతో దాదాపు ముప్పయికి పైగా వేసిన కుట్లు!
అలాంటి సమయంలో మతాల కతీతంగా హైదరాబాద్ పౌరసమాజం… యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ కార్యకర్తలు, యువతరం, కార్మికులు, మహిళలు ఒక విశాల వేదికగా ఏర్పడ్డారు. హత్యా రాజకీయాలను మౌనంగా చూస్తూ వుండటం మరింత ప్రమాదం అనే విచక్షణతో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఒక్కరోజు వ్యవధిలోనే పెద్ద ఎత్తున సహాయాన్ని ఒక దగ్గరకు తీసుకువచ్చారు. కర్ఫ్యూతో పనులకు దూరమై, రోజువారీ అవసరాలు భారమై, భయంతో వున్న అనేక బస్తీలను గుర్తించి నేరుగా వారి ఇంటి దగ్గరకే వెళ్లి రేషన్ అందించగలిగారు. ఇదంతా ఆషామాషీగా ఏమీ జరగలేదు. ముందు ఏఏ ప్రాంతాలు అలాంటి భయానక పరిస్థితుల్లో వున్నాయో తెలియజేసింది కూడా స్థానికంగా వుండే పాత్రికేయులు, సామాజిక బాధ్యతతో వుండే ప్రజలే. అప్పటికి ఏ సమాచారం రావాలన్నా లాండ్ లైన్ ఫోన్ల ద్వారానే సాధ్యం. పైగా అందరికీ ఫోన్ సౌకర్యం వున్న రోజులు కావు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని ప్రాంతాలకు ఫోన్ లైన్లు కూడా నిలిపేసేవారు.
దాదాపు పదిహేను రోజులకు పైగా పాతబస్తీలోని కర్ఫ్యూ ప్రభావిత ప్రతి ప్రాంతానికి హోదాలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ స్వయంగా వెళ్లి మరీ రేషన్ అందించారు. కర్ఫ్యూ వున్నప్పుడు పోలీస్, పారా మిలిటరీ పర్మిషన్ లేకుండా బయటకు అడుగుపెట్టటం కూడా కష్టం. అయినప్పటికీ వోపికగా అధికారులతో సంప్రదించి పాస్ తీసుకుని నిర్ణీత కాలవ్యవధిలోనే రేషన్ ఇవ్వడం అనేది స్థానిక సామాన్య ప్రజల సహకారంతోనే సాధ్యం అయింది. ఒక పక్క రేషన్ పంపిణీ చేస్తూనే, హింసకు గురయిన కుటుంబాలను కలవటం, వారి అనుభవాలను రికార్డు చేయటం కూడా నిజానికి ఎంతో పెద్ద సవాలు అయింది. ముందు నోరు విప్పటానికి భయపడిన ఇరు వర్గాల ప్రజలు కూడా ఆ సమయంలో తమ అనుభవాలను మనసు విప్పి మాతో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ దాడికి గురయ్యారు, అదే సమయంలో మరికొంత మంది వారికి సహాయం చేశారు. మేము రికార్డు చేసిన వందకు పైగా సంఘటనల్లో (అన్ని మతాలూ, సమూహాలూ వున్నాయి) ఆశ్చర్యకరంగా దాదాపు తొంభై శాతం మంది అవతలి వర్గానికి చెందిన వారే తమను రక్షించారని చెప్పారు. నిజానికి ఇది పెద్ద విషయంగా మీడియా భావించలేదు. కానీ, ప్రజల నిత్యజీవితంలో దీని ప్రాముఖ్యతను తెలియజేయటానికి బాధితులను రక్షించిన హైదరాబాదీ శాంతిదూతలను గుర్తించి నాంపల్లిలోని లలితకళాతోరణంలో పౌరసన్మానం జరిపి గౌరవించుకోవటం జరిగింది. అదొక అపురూప సందర్భం. ఆ తర్వాత భిన్న మతాల పిల్లల మధ్య స్నేహసంబంధాలు పెరగటం కోసం కనీసం అయిదారు సంవత్సరాలపాటు వేసవి ఆటపాటల శిబిరాలు నడిచాయి.
అయితే ఒకటి రెండు కార్యక్రమాలతోనే సంక్షోభం పరిష్కారమవదు. విద్వేషం మూలాలు బలంగా వేళ్లూనుకుని వుంటాయి. అందుకే హైదరాబాద్లో అల్లర్లు తరచూ పునరావృతమయ్యే ప్రాంతాల్లో పనిచేసే స్థానిక స్వచ్ఛంద సంస్థలు కాన్ఫిడరేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్ గా ఏర్పడి (COVA) ఆయా ప్రాంతాలలోని రెండు వర్గాలను కలుపుకొని అక్కడి ప్రజల సామాజిక అభివృద్ధి కోసం పనిని ప్రారంభించాయి. సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, విద్యాభివృద్ధి లక్ష్యంగా పరస్పర సహకారం, సామూహిక కృషితో ఘర్షణలో ఉన్న సమూహాలను ఒకదానితో ఒకటి కలిసి పనిచేసే విధంగా చేయటంతో, మతకలహాలకు పేరొందిన దాదాపు నలభై రెండు ప్రాంతాల్లో హింస పునరావృతమవకుండా ప్రజలే అడ్డుకున్నారు.
మత కలహాలు చెలరేగకుండా మరో ముఖ్యమైన సంఘటన 2002 మార్చిలో జరిగింది. 2002 గుజరాత్లో జరిగిన మత మారణకాండ అందరికీ గుర్తుండే వుంటుంది. అంతటి సంక్షోభ సమయంలో, తమ వర్గం మీదే అక్కడ మారణకాండ జరిగినప్పటికీ, దాని ప్రభావం వల్ల ఇక్కడ హైదరాబాద్ లో విచక్షణ కోల్పోయే ప్రమాదాన్ని వూహించి పాతబస్తీ కాలనీల్లో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న వందలాదిమంది మహిళా లింక్ వాలంటీర్లు ఒక శుక్రవారం నమాజు ముగిసే సమయానికి, పోలీసుల నిర్బంధాన్ని, కట్టుబాట్లను ఎదిరించి మరీ చార్మినార్ చుట్టూ బలమైన మానవహారాన్ని నిర్మించారు. గుజరాత్లో జరుగుతున్న పరిణామాల పట్ల ఆగ్రహంతో వూగిపోతున్న యువకులను శాంతపరచటంలో, ప్రజాస్వామ్య నిరసన వైపు మళ్లించటంలో ఆ సామాన్య ముస్లిం మహిళలు తీసుకున్న చొరవ సదా స్మరణీయం. ఆరోజు వాళ్లు ఆక్కడ ఆ మానవహారం నిర్మించకపోయి వుంటే హైదరాబాద్ ఎంతటి కల్లోలాన్ని ఎదుర్కొని వుండేదో వూహించలేము!
ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించీ ఇప్పుడెందుకు ప్రస్తావించడం, ఇప్పుడంతా బానే వుంది కదా అని అనుకోవచ్చు ఎవరైనా! క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక ప్రయత్నాల వల్ల గత 11 సంవత్సరాలుగా హైదరాబాద్లో మతపరమైన అల్లర్లు జరగలేదు. అయితే, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న మతవిద్వేష రాజకీయాలను దృష్టిలో వుంచుకున్నప్పుడు సంవత్సరాల తరబడి నిర్మించిన హైదరాబాద్ మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయటానికి, ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని కొన్ని శక్తులు కాపు కాసుకుని వున్నాయి. మత అసహనం ఇప్పుడు సామాన్య ప్రజల జీవితాల్లోకి చొచ్చుకుని వస్తోంది. సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలతో కూడిన ద్వేష సమాచారం విపరీతంగా యువతకు అందుతోంది.
సమీప భవిష్యత్తులో నగరంలో మతపరమైన సంఘర్షణలు జరగవచ్చునన్న సంకేతాలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది, ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న ఒకే రోజు వస్తున్న గణేష్ నిమజ్జనం, మిలాదున్నబీ పండుగలు. ఈ రెండూ కూడా ఆయా సమూహాలకు అత్యంత ముఖ్యమైనవి. సామూహిక వూరేగింపులతో కూడినవి. ఒకే దారిలో, ఒకే సమయానికి పరస్పరం ఎదురయ్యే సందర్భం కనిపిస్తోంది. ఇప్పుడున్న రాజకీయ విద్వేష పరిస్థితుల్లో, ఎక్కడ ఏ చిన్న అపశృతి ఎవరివైపు నుంచి జరిగినా గానీ తలెత్తబోయే విధ్వంసాన్ని వూహించలేము. హైదరాబాద్ కోలుకోలేని విధంగా మూల్యం చెల్లించుకోవలసి వుంటుంది. దానిని నివారించాలి అంటే ఇరు సమూహాల బాధ్యులను ముఖ్యంగా ఈ ఉత్సవ కమిటీల బాధ్యులను కలిపి కూర్చోబెట్టి, రెండు మత ఉత్సవాలను ప్రశాంతంగా కొనసాగే విధంగా ప్రయత్నాలు చేయాలి. దీనికోసం నాలుగు దశాబ్దాలుగా మత సామరస్యం కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అనేక పౌర సమాజ సంఘాలు, వ్యక్తులు అందరూ కలిసి ప్రభుత్వంతో, పోలీసు అధికారులతో, రాజకీయ పార్టీలతో, ఇరు సమూహాల ఉత్సవ కమిటీలతో ఒక సంభాషణ చేస్తున్నారు. ఇది కేవలం కొంతమంది వ్యక్తుల, సంస్థల బాధ్యతే కాదు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. దీనిని కేవలం శాంతిభద్రతల విషయంగానే పరిగణించకుండా, సున్నితమైన సామాజిక అంశంగా కూడా చూసి అందుకు అనుగుణమైన చర్యలను తీసుకోవాలి. హైదరాబాద్ తెహజీబ్ ని నిలబెట్టటంలో పౌరసమాజాన్ని, అన్ని రాజకీయ పార్టీలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. మతపరంగా సున్నితమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ స్థానిక ప్రజల సహకారంతో మత సామరస్యం కోసం భిన్న సమూహాల మధ్య పరస్పరం నిరంతరం జరగాల్సిన సంభాషణ ఇప్పుడు అత్యంత అవసరం.




