నేను సైతం ప్రపంచాగ్నికి/ సమిధనొక్కటి ఆహుతిచ్చాను/ నేను సైతం విశ్వవృష్టికి/
అశ్రువొక్కటి ధారపోశాను/ నేను సైతం భువన ఘోషకు/ వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను
అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యంలోకి కొత్త గొంతుకలు మొలకెత్తి మేము సైతం అంటూ అద్భుతాలను సునాయాసంగా అక్షరాల్లోకి ఒంపి ఎందరినో ఆలోచింపజేస్తున్న తరుణమిది. పుట్టిన చోట ఒంటబట్టిన స్వచ్ఛమైన గ్రామీణత,
కలం పట్టగా చేతికందొచ్చిన సామాజిక బాధ్యత కవిత్వమై అతనిలో పొంగిపొర్లింది.
ఎన్నో ప్రజా సమస్యలను స్పృశించి కవిత్వీకరించిన ఆ యువకవి మిద్దె సురేష్.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సాతాపూర్కు చెందిన వ్యవసాయాధారిత కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి స్నాతకోత్తర విద్య వరకు చదివి జర్నలిజం, గ్రామీణాభివృద్ధి,
మానవ హక్కులలో పిజి డిప్లొమాలను సురేష్ పొందారు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిరంతరం నిశితంగా పరిశీలించి ఆ అనుభూతిని విలక్షణమైన కవిత్వంగా అభివ్యక్తీకరించారు. లోతైన దృష్టి కలిగిన కవిగా ఆయన తన కవితలలో కనిపిస్తారు.
తన పరిశీలనలకు పరిపూర్ణమైన సృజన భావాలను ఎంతో జాగ్రత్తగా కవి అద్దారు. కవిలోని విలక్షణ వ్యక్తిత్వానికి అద్దంపట్టే పలు కవితలతో
ఈ తొలి కవితా సంపుటి తొలకరి జల్లు వెలువడిరది.
పంచాన్ని వణికించిన మహాగండం కరోనా. ప్రాణాల్ని దూదిపింజల్లా ఎగరేసుకెళ్ళిన కరోనా విపత్కర పరిస్థితులలో కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా సేవలందించిన పారిశుధ్య కార్మికులకు కవి మనసారా వందనమర్పించారు. కరోనా కాలంలో/ పొర్క పట్టుకున్న కార్మికుల/ సేవలు మరవలేనివి/ రోడ్లు ఊడ్చిన చేతులకు వందనమని కృతజ్ఞతలర్పించారు. భిన్నత్వంలో ఏకత్వంతో సాంస్కృతిక సమ్మేళనంగా భాసించే దివ్యధామమైన భారతదేశం సమతామమతల సంకేతం, ఏకతకు ఉదాహరణమని చెప్పారు. మతాలేవైనా, భాషలు, భావాలు వేరైనా మనమంతా భారతీయులం అన్నారు. కరోనా తీసిన కోలుకోలేని దెబ్బతో భారత్ లాక్డౌన్ అయ్యిందన్నారు. గుడి, బడి, మందిరం, మనిషి జీవితం కరోనా ధాటికి వెలవెలబోయాయని ఎంతో వేదన పడ్డారు. కంటికి కనిపించని వైరస్ కంటే/ కనిపించే శత్రువుతో యుద్ధం చేయడం సులువని చెప్పారు.
ఉపాధులు లేక నిస్తేజంగా బతుకు బండిని ఎంతో కష్టంగా రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు వెళ్ళదీస్తున్నారని వేదన చెందారు. చినిగిన చొక్కాతో, లొట్ట చెక్కిళ్ళతో దిగాలుగా కనిపించే నిరుపేదల బతుకు ఎంతో భారంగా మారుతున్నదని చెప్పారు. పేదల బాధలు దేవుడెరుగడు అంటూ ఆకలితో అలమటించి అభాగ్యులెందరో మృత్యువు ఒడిలోకి చేరుతున్నారని తెలిపారు. బతుకులు బాగు చేయలేనంత చితికిపోయామని చెప్పారు. నిరీక్షించడమంటే మంచి జరుగుతుందేమోనని చిన్ని ఆశతో చివరి వరకు ఉండటమేనని తెలిపారు. కటిక దారిద్య్రం అనుభవిస్తున్నా భవిష్యత్తు కోసం ఆశతో ఎదురు చూడాల్సిందేనని తెలిపారు. విడిపోయిన బంధం కడవరకైనా కలవకపోతుందా అని వేచి చూడడంలో ఎప్పటికైనా ప్రయోజనం ఉండే ఉంటుంది అంటారు. పసి పిల్లలను మురిపాల మొగ్గలతో అత్యద్భుతంగా పోల్చారు. బడి సంచి పట్టుకోవాల్సిన సమయంలో చెత్త కుప్పలపై బాల్యం చెదిరిపోతుందని వేదన చెందారు. బాలామృతాల మధ్య ఉండాల్సిన బాలలు కర్కశంగా కర్మాగారాలలో కరిగిపోతున్నారని కన్నీరు పెట్టారు. బాల కార్మిక వ్యవస్థ పూర్తిగా నిర్మూలన కావాలన్నారు. చిట్టి పాదాలు బడికే కాని పనికి పోకూడదని చెప్పారు. ఓ వెన్నెల రాత్రిని వర్ణిస్తూ వెన్నెల రాత్రి/ చందమామ విరబూసిన వేళ/ లోకమంతా ఆనంద కేళితో ప్రకృతి పులకరిస్తున్న వేళ/ మధురానుభూతిలోకి జీవకోటి జారిందని చెప్పారు. బుడి బుడి అడుగులు వేస్తున్న పసివాడి ఆనందమంతా ప్రకృతి ఒడిని చేరుకోవడంలోనే ఉందని అన్నారు. కవులు, కళాకారులకు ప్రకృతే ఓ పెద్ద బడి అని చెప్పారు. వెన్నెల రాత్రిలో జంతుజాలం నూతనోత్తేజాన్ని పొంది మైమరుస్తుందని తెలిపారు. ప్రతి వెన్నెల రాత్రి ఒక మరిచిపోలేని మధురానుభూతి అని చెప్పారు. ఆడపిల్లంటే సబల అని తెలిపారు. చరిత్రలో ఉక్కు మహిళలుగా నిలిచిన రాణిరుద్రమ, చాకలి ఐలమ్మ వంటి వారి స్ఫూర్తితో మహిళలు కదిలి కదం తొక్కాలని చెప్పారు.
స్వేచ్ఛా భారతమంతా అమరుల త్యాగాలను సతతం స్మరిస్తూనే ఉంటుందని అంటూ నేడు స్వేచ్ఛ కోసం పోరాడవలసిన పరిస్థితి మనిషికి ఏర్పడిరదని చెప్పారు. అన్యాయాలు, అక్రమాలు, నిర్భంధాలు అంతటా పెరిగిపోయాయని అన్నారు. శాంతి, అహింసలకు నిలయమైన గాంధీ మార్గపు భారత దేశంలో సమానత్వపు స్వేచ్ఛా జీవితం మనిషికి అందాలని చెప్పారు. బతుకు పోరాటాలకు ఉదాహరణలు చిక్కి శల్యమైన బతుకులేనని చెప్పారు. చివరికి ఎక్కడికి చేరి, ఏమవుతారో తెలియని స్థితిలో ఉన్న అభాగ్యులెందరోనని అన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యే బతుకులే ఎక్కువగా పెరిగిపోయాయని చెప్పారు.
నమ్మించడం సులువు/ నమ్మకపోవడం కష్టం అన్నారు. వినడానికి చిన్న పదమైనా నమ్మకం లేకపోతే ఈ ప్రపంచమే సమూలంగా అంతమవుతుందని చెప్పారు. కలం మదిలోని భావాలకు ఊతమిచ్చి, రూపమద్దే బలగం అని కొనియాడారు. సమాజంలోని అన్యాయాలను ధైర్యంగా రాసే కలం ఎంతో పవిత్రమైనదని చెప్పారు. అంధకారంలోని జీవితం లక్ష్యం వైపు పరుగులు తీసే సమయాన్ని ఎప్పుడో ఒకసారి అందుకుంటుందని చెప్పారు. చీకట్లను చిదిమే వెలుగు ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని అన్నారు. రైతులు సమన్వయంతో వెళ్తే ఎన్నో సమస్యలకు అవలీలగా పరిష్కారాలు దొరుకుతాయని భావించారు. పండిరచిన పంటకు గిట్టుబాటు ధర సక్రమంగా అందక రైతులు పడుతున్న ఇబ్బందులను హృదయ ద్రావకంగా వివరించారు.
గమ్యం చేరుతానో లేదోనన్న సందేహం ప్రశ్నగా మారి మదిలో మెదులుతున్నా ప్రతి పనిలో లక్ష్యమే కనిపించి విజయం పొందాలన్న ఆకాంక్ష మరింత బలోపేతమైందని చెప్పారు. చీకట్లను తుదముట్టించేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ మానవాళికి మార్గదర్శకులేనని అభిప్రాయపడ్డారు. రైతుకు భీమా కావాలని అన్నారు. ఏకమై కదిలితే రైతాంగం శక్తిస్వరూపాన్ని ఎవరూ తట్టుకోలేరని చెప్పారు. ముసురు కవితలో ఈరోజు ఎడతెగని వాన/ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన మంట/ వర్షంతో తడిసి ముద్దయింది నేలంతా అన్నారు. ముసురుకు తనువంతా మురిసిన పుడమిని, చల్లగాలి చినుకులకు తల్లి పొదుగులో వెచ్చగా చలికాచుకుంటున్న పక్షి పిల్లలను గుర్తు చేశారు. ముసురు మనిషికి బంధాలు, బంధుత్వాలను దగ్గర చేసిందన్నారు. మాయదారి కరోనా చెడుతో పాటు జీవిత అనుభవాలను కూడా నేర్పిందని తెలిపారు. హరితహారంలో నాటే ప్రతి మొక్క ప్రకృతికి ఆకుపచ్చని మణిహారం కావాలన్నారు. తొలకరి జల్లుతో నేలంతా మట్టి వాసన అని తొలకరి జల్లు కవితను ఆరంభించారు. చినుకు చినుకు కలిసి వరదైతే పులకరించిన తల్లిని చూసి రైతు ముఖంలో వెల్లివిరిసిన చిరునవ్వును గుర్తు చేశారు. చినుకు కురిసి రైతును ఆకుపచ్చ చందమామను చేసిన తీరుకు తొలకరి జల్లు కవిత అద్దం పట్టింది. రాఖీ సోదరానుబంధానికి ప్రతీక అన్నారు. రక్ష కట్టి అందించే దీవెనలే శ్రీరామరక్ష అని చెప్పారు. ఈ కవితలలో సామాన్యుడి ఆవేదన, ఆందోళన ప్రతిఫలించింది. సమాజాన్ని మేల్కొల్పేందుకు కవి పడే తపనకు తార్కాణంగా ఇందులోని ఎన్నో కవితలు ఉన్నాయి. చెమ్మగిల్లిన తన కన్నుల్లో దాగిన మానవీయ దృశ్యాలన్నింటినీ అపురూప రూపాలుగా, కవితా జ్ఞాపకాలుగా నిలిపేందుకు కవి చేసిన సామాజిక యజ్ఞమే ఈ కవిత్వం.
– డా.తిరునగరి శ్రీనివాస్
9441464764





