పదేళ్లలో 4.26 లక్షల మంది ఆత్మహత్యలు
•రైతుల అండగా నిలబడ్డ వారిపై అక్రమ కేసులు
•వ్యవసాయాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టే యత్నం
•పంటల కొనుగోలు పథకానికి నిధులలో కోత
•ఆత్మహత్యలు చేసుకున్నా రుణమాఫీ చేయలే
•భూ సేకరణ చట్ట సవరణకు విఫల ప్రయత్నం
•అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు పొడిచారు
•మోదీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలి
•సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత నేతలు
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, మే 06 : రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయని బిజెపిని ఒంటరి చేద్దాం, వ్యతిరేకిద్దాం, శిక్షిద్దాం అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 13న జరుగు పార్లమెంట్ ఎన్నికల్లో రైతాంగం బిజెపిని ఓడించేందుకు సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్.కె.ఎం) అఖిలభారత నాయకులు డాక్టర్ విజ్జూకృష్ణన్, డాక్టర్ సునీలం, సురేష్ రౌత్, అవతార్ సింగ్ మెహ్మ, కె.బాలకృష్ణ,రవి కిరణ్ పుంచ, అరుణ్ కుమార్, రాయల చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బిజెపి అధికారంలో ఉన్న ఈ పది సంవత్సరాల కాలంలో రైతులు, వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలు 4.26 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు పూనుకున్నదని మండిపడ్డారు. కరోన కాలంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా 13 నెలల పాటు సుదీర్ఘ పోరాటం జరిగిందని, 750 మంది రైతులు ప్రాణాలు బలిదానం చేశారన్నారు. ఫలితంగా 2021 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కోవడంతోపాటు కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని, రుణమాఫీ చేస్తానని, విద్యుత్ సవరణ బిల్లును రైతులతో మాట్లాడకుండా పార్లమెంట్లో పెట్టనని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తానని, ఫనల్ భీమా యోజన రైతాంగానికి ఉపయోగపడే విధంగా మారుస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చిందన్నారు.
ఈ రెండు సంవత్సరాల కాలంలో హామీలను అమలు చేయకపోగా వ్యవసాయరంగాన్ని ఐదు కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకున్నదని అన్నారు. పంటల కొనుగోలు పథకానికి నిధులలో కోత పెట్టిందని, రైతుల ఆత్మహత్యలకు కారణమైన అప్పుల మాఫీకి పూనుకోలేదన్నారు. బడా కార్పోరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారన్నారు. కనీస మద్దతు ధరల చట్టం ఊసే లేదన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న హామీని తుంగలో తొక్కిందన్నారు. ఈ కాలంలోనే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వకపోగా అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు పొడిచారని అన్నారు. రాష్ట్ర నాయకులు సుంకెట అన్వేష్ రెడ్డి, టి.సాగర్, విస్సా కిరణ్, వి.ప్రభాకర్, కోటేశ్వరరావు, మామిడాల బిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టానికి సవరణలు చేసేందుకు విఫల ప్రయత్నం చేసి చివరికి రాష్ట్రాలకే అధికారాలను కట్టబెట్టిందన్నారు. రైతాంగంపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయకపోగా రైతుల పోరాటానికి అండగా నిలబడిన మేధావులు, విలేకర్లపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. సహకార వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు మల్టి స్టేట్ కో-ఆపరేటివ్ వ్యవస్థను తీసుకు వచ్చిందన్నారు.
ఉపాధిహామీ పథకాన్ని 200 రోజులకు పెంచి, రోజు కూలీ రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా ఈ పది సంవత్సరాల కాలంలో ఏటా నిధులు తగ్గిస్తూ వచ్చారన్నారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ను పట్టించుకోలేదన్నారు. రెండవ దశ ప్రారంభమైన రైతాంగ ఉద్యమంపై తీవ్ర నిర్భందాన్ని ప్రయోగించారని అన్నారు. రైతాంగానికి ఇచ్చిన హామీలలో వైఫల్యంతోపాటు కార్మికులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థి, యువజన, మహిళా, మైనార్టీ, సామాజిక తరగతులకు ఉన్న హక్కులన్నింటిని హరించి వేసిందన్నారు. అందువల్ల సబ్బండ వర్గాలు కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 13న జరుగు ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలని కోరుతున్నామని అన్నారు. వ్యవసాయాన్ని కాపాదుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం, కార్పోరేట్ దోపిడినీ అరికడదాం అని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.





