హర..హర…మహాదేవ శంభో..

రాష్ట్ర వ్యాప్తంగా శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు
నదీతీరాల్లో పుణ్యస్నానాలు..ఆలయాల్లో అభిషేకాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 8 : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్వరణతో ఆలయాలన్నీ మార్మోగాయి. గోదావరి, కృష్ణానదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. వేములవాడ, కాళేశ్వరం, వేయిస్తంభాల గుడి, రామప్ప, కీసర ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓం నమశ్సివాయ అనే పంచాక్షరి మంత్రంతో కీసరగుట్ట దేదీప్యమానంగా వెలిగిపోయింది. భక్తులు ఓం నమశ్సివాయ..అంటూ శివుడిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.  భక్తులు ఉదయం నుంచే శివాలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.  ప్రధాన ఆలయాలకు భక్తులతో కిటకిటలాడాయి. మంత్రులు ఆయా ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజరాజేశ్వర స్వామివారి దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు బారులు తీరారు. ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు మహా లఘుదర్శనం కల్పిస్తున్నారు.

రాజరాజేశ్వర స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి సమర్పించగా, తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శివరాత్రి శోభ సంతరించుకుంది. వేయిస్తంభాల దేవాలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నల్లగొండ జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చెర్వుగట్టు, పానగల్‌, వాడపల్లి ఆలయాల్లో భక్తుల రద్దీ  నెలకొంది. నిజామాబాద్‌ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడి, బోధన్‌ ఏకచక్రేశ్వరాలయం, ఆర్మూర్‌ సిద్ధులగుట్ట ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మంచిర్యాల జిల్లాలో మహా శివరాత్రి సందర్భంగా చెన్నూరు, గూడెం, లక్షెట్టిపేట, మంచిర్యాల, వేలాల గోదావరి ఘాట్ల వద్ద వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ధర్మపురి, బాసరలో గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాల్లో దర్శనం చేసుకున్నారు. వేలాల మల్లిఖార్జునస్వామి ఆలయం, కత్తెరశాల మల్లన్న, బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. బాసర, సోన్‌, బ్రహ్మపురి వద్ద గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. శైవ క్షేత్రాల్లో భక్తుల పూజలు కొనసాగుతున్నాయి. కదిలి పాపహరేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొమురం భీం జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా వాంకిడి శివకేశవ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈజ్‌ గాం శివమల్లన్న జాతరకు  భక్తులు భారీగా తరలి వచ్చారు. సూర్యాపేట జిల్లాలో  శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాటి అన్నారంలోని ప్రాచీన శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మేళ్లచెరువు శ్రీస్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గద్వాల జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా అలంపూర్‌ ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. భద్రాద్రిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. అన్నపురెడ్డిపల్లి, మోతె వీరభద్ర స్వామి, పాల్వంచ రామలింగేశ్వర ఆలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులతో పోటెత్తాయి. తీర్దాల సంగమేశ్వరాలయం, కూసుమంచి గణపేశ్వరాలయం, పెనుబల్లి నీలాద్రీశ్వరాలయం, బేతుపల్లి గౌతమేశ్వరాలయాల్లో భక్తుల రద్దీ కొనసా గుతోంది. సంగారెడ్డి జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శైవక్షేత్రాలకు తరలివెళ్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఆ మహాదేవున్ని తనివితీరా దర్శించుకున్నారు. జిల్లాలో ప్రముఖ ఆలయమైన కేతకీ సంగమేశ్వరా లయంలో భక్తుల రద్దీ పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *