తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నది. ఈసారి నిర్వహించే ఉత్సవాల్లో కాకతీయుల వారసుడు ‘కమల్ చంద్ర బాంజ్‌దేవ్’ ముఖ్యఅతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ. కాకతీయుల పాలకుల్లో చివరి వాడుగా చెప్పబడుతున్న ప్రతాపరుద్రుని పతనానంతరం ఈ వంశం వారు ఛత్తీస్ గడ్‌లోని బస్తర్ జిల్లా జగ్దల్‌పూర్ ప్రాంతానికి చేరుకున్నట్లుగా తెలుస్తున్నది. అతర్వాత వారిని గురించిన విశేషాలేవీ వెలుగుచూడలేదు. కాగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న కమల్‌చంద్ర బాంజ్‌దేవ్‌ను కాకతీయ వంశానికి చెందిన 22వ వారసుడిగా చెబుతున్నారు.
ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2012 డిసెంబర్ 21నుండి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017-18ల్లో ‘ఓరుగల్లు కళావైభవం’పేర ఉత్సవాలు కొనసాగాయి. అనంతర కాలంలో రామప్ప దేవాలయం నిర్మించి ఎనిమిది వందల సంవత్సరాలు అయిన సందర్భంలో ఉత్సవాలు జరిపారు. కాకతీయ సప్తాహం పేరున మరోసారి ఇప్పుడు జూలై ఏడు నుండి పదమూడవ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా సన్నద్దమయింది. ఉత్సవాలను నాటి కాకతీయ రాజధాని ఓరుగల్లు ఖిలాలో టూరిజం శాఖమంత్రి శ్రీనివాసగౌడ్, మంత్రి సత్యవతిరాథోడ్, చీప్‌విప్ వినయ్ భాస్కర్, ఎంపి సంతోష్‌కుమార్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధలు కలిసి ప్రారంభించనున్నారు. కాకతీయులు మట్టికోట, పుట్టకోట అంటూ ఏడు ప్రాకారాలతో కోట నిర్మాణం చేసుకున్నారు. దాని గుర్తుగా ఏడు కోటల పరిధిలో ఉత్సవాలను నిర్వహించ తలపెట్టారు. ఈ సందర్బంగా పేరిణి నృత్యాలు, కోలాటాలు సాహితీ సమావేశాలు, సెమినార్‌లను నిర్వహించనున్నారు. విచిత్రమేమంటే గతంలో ఇంతవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే ఉత్సవాలు ఇప్పుడు ఆరు జిల్లా) పరిధిలోకి మారాయి.
‘నిజాం కాలనుండే ఉత్సవాలు ప్రారంభం:-
కాకతీయ ఉత్సవాల తీరు తెన్నును పరిశీలిస్తే వాస్తవంగా ఈ ఉత్సవాలకు నాంది ‘నిజాం పాలకుల’ కాలంలోనే జరిగింది. ఎంతో విశిష్టకలిగిన కాకతీయ పాలకులగురించి, వారి పాలనా విధానం, అద్భుత శిల్పకళా నైపుణ్యంగురించి భావితరాలకు తెలియజేయాలని నాటి కవులు, చరిత్రకారులు ఆనాడే ప్రయత్నించారు. అయితే ముందుగా అంగీకరించని ఏడవ నిజాంనబాబు ఆ తర్వాత ఉత్సవాల పేరున కాకుండా వర్థంతి పేరున నిర్వహించుకోవడానికి అనుమతిచ్చాడు. అదే మొట్టమొదటి ప్రయత్నం కూడా. 1932 ఏప్రిల్ 25 నుండి మూడు రోజుల పాటు ఆ నాడు ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం దాదాపు ఎనిమిది దశాబ్ధాల కాలంలో కేవలం నాలుగయిదు సార్లు మాత్రమే ఇలాంటి ఉత్సవాలకు అవకాశం లభించింది. ఈ ఉత్సవాలను నిర్వహించాలన్న ఆలోచన వాస్తవంగా అంతకు ఏడు సంవత్సరాల (1925) క్రితమే ఏర్పడింది. రాజమహేంద్ర నగరం లోని ‘ఆంధ్రేతిహాస పరిశోధనామండలి’ మూడు వందల సంవత్సరాలపాటు ప్రజారంజకంగా పాలించిన కాకతీయ రాజుల చరిత్రను గ్రంథస్థం చేయాలని భావించింది. దాని ప్రతిరూపమే 1934 ప్రాంతంలో డాక్టర్ మారేమండ రామారావు సంపాదకత్వంలో వెలువడిన ‘కాకతీయ సంచిక’. పేరుపొందిన చరిత్రకారులనేకులు ఎంతో పరిశోధించి కాకతీయుల చరిత్రను గ్రంథస్తం చేశారు. ఈ పుస్తకాన్నే 1991లో ర్రా పురావస్తు ప్రదర్శన శాఖ పునర్ముద్రించింది. మొదటిసారిగా దీన్ని ముద్రించేందుకు హైదరాబాద్‌లోని రాజా వెంకటరామారెడ్డి బహద్దూర్, నాటి గద్వాల మహారాణి ఆర్థిక, హార్థిక సహాయం అందజేశారు. ఇంకో గొప్ప విషమేమంటే నిజాం ఆర్ష(పురావస్తు)శాఖ ఇందుకు కావల్సిన ఫోటోలు అందజేయటం.
పింగళి వెంకటరామారెడ్డి ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా మొదటిసారి ఉస్మానియా కాలేజీ హాస్టల్‌లో 1932 ఏప్రిల్ 25న జరిగిన సభలో నాటి వరంగల్ సుబేదారు దరబ్జీ బాపూజీచినోయి, తాలుక్దారు మహమ్మద్ అబ్దుల్ బసిత్ ఖాన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి పండిత కేశవరావు, ఉస్మానియా కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ అజీజ్‌ఖాన్, మాడపాటి హనుమంతరావు, అడవి బాపిరాజు, పోలీసు సూపరింటెండెంట్ నిరంజన్‌సింగ్, ఆకారపు చెన్నయ్య, ఆంధ్రేతిహాస పరిశోధక మండలి గౌరవ కార్యదర్శి రాళ్ళబండి సుబ్బారావు, ప్రొఫెసర్ పిరుగూరి హన్మంతరావులాంటి ప్రముఖులెందరో పాల్గొన్నారు. మరుసటి రోజున (26-4-1932) వరంగల్‌ల్లో ఆనాటి ప్రముఖ న్యాయవాది మాదిరాజు రామకోటేశ్వర్‌రావు ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా, దూపాటి రమణాచార్యులు, ఒద్దిరాజు రాజేశ్వర్‌రావులు బాధ్యతలను నిర్వహించారు. హైదరాబాద్‌నుండి కొత్వాల్ వెంకటరామారెడ్డి బహద్దూర్, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, పింగళి వెంకటరామారెడ్డి దేశ్‌ముఖ్ లాంటివారు సహకారం అందించిగా, నిజాం కళాశాలకు చెందిన నాటి చరిత్ర అధ్యాపకులు ప్రొఫెసర్ సింగూరి హనుమంతరావు ఉత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హనుమకొండలోని రాజరాజ నరేంధ్రాంద్ర గ్రంథాలయం, రామప్పదేవాలయాలను మండలి సభ్యుల సందర్శించి ఓరుగల్లుపై వారిచ్చిన నివేదికలను కాకతీయ సంచికలో గ్రంథస్థం చేశారు, మూడవ రోజున (27-4-1932) ప్రాచీన శిథిలాలు, వరంగల్‌లోని శబ్ధాను శాసన గ్రంథాలయ సందర్శనా కార్యక్రమాలను నిర్వహించారు.
ఆ తర్వాత కాకతీయ ఉత్సవాలు నిర్వహించేందుకు 59 ఏండ్ల కాలం తీసుకుంది. నిజాం నిర్భందకాలంలో హాయిగా చేసుకోగలిగిన ఈ ఉత్సవాలను స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేసుకోలేక పోవడం దురదృష్టకరం. సుదీర్ఘ విరామం తర్వాత 1991 ఫిబ్రవరి 24 నుండి మూడు రోజులపాటు రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ, తంజావూర్‌కు చెందిన దక్షిణ ప్రాంత సాంస్కృతిక కేంద్రం, జిల్లా సాంస్కృతిక మండలి సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి ఓరుగల్లు కోటలో ప్రారంభించగా, ఆనాటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్కక్షులు, ప్రముఖ కవి డాక్టర్ సి. నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. మొదటి రోజున వరంగల్ ఇంటాక్ చే ‘కాకతీయ వైభవం’ సౌండ్ అండ్ లైట్ కార్యక్రమం, మద్రాసుకు చెందిన వాణిగణపతి భరత నాట్యం, వరంగల్ లాల్‌బహద్ధూర్ కళాశాల అధ్యాపకులు డాక్టర్ ఇందారపు కిషన్‌రావు రచించిన ‘రామప్ప విజయం’ నృత్య రూపకం ప్రదర్శనలు జరిగాయి. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లో జరిగిన రెండవ రోజు కార్యక్రమంలో చారిత్రక పరిశోధకుడు డాక్టర్ అమ్జదలిచే కాకతీయ వైభవం చిత్రప్రదర్శన, మధ్యాహ్నం రామప్ప ఆలయ ప్రాంగణంలో వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ (నాటి ఆర్‌ఇసి నేటి నిట్)కళాశాల వారిచే ‘కాకతీయ నిర్మాణ శైలి’పై సాంకేతిక గోష్టి, డాక్టర్ నటరాజ రామకృష్ణచే పేరిణి నృత్యప్రదర్శన జరిగింది.
చివరి (26-2-1991) రోజున ‘కాకతీయ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలపై ఆర్‌ఇసిలో నాటి రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ పి. యశోధారెడ్డి ప్రారంభించిన సదస్సుకు, ప్రముఖ ఉర్థూ కవి, కళా మెషాద్ కాళోజీ రామేశ్వర్‌రావు అధ్యక్షత వహించారు. వెయ్యిస్తంభాలగుడిలో నాటి స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ పి.వి. రంగారావు అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.పి.రామారావు(ఐఏఎస్) ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నృత్యచూడామణి శోభానాయుడు బృందం ‘కళ్యాణ శ్రీనివాసం, కూచిపూడి నృత్య రూపకాన్ని ప్రదర్శించగా వరంగల్ ఇంటాక్ కాకతీయ వైభవంపై సౌండ్ అండ్ లైట్ కార్యక్రమాన్ని నిర్వహించింది, జిల్లా కలెక్టర్ బి.పి. ఆచార్యతో పాటు ముఖ్యఅతిధిగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు దేవులపల్లి రామానుజరావు పాల్గొన్నారు.
ప్రతీ సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహించాలనుకున్నప్పటికీ తిరిగి రెండేళ్ళ తర్వాత 1993లో జరిగాయి. ఏప్రిల్ 9 నుండి మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాలను నాటి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి వెయ్యిస్థంభాల గుడిలో ప్రారంభించారు. అప్పుడు రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన డాక్టర్ సి. నారాయణరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ప్రముఖ సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వర్‌రావు, ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు, నాటి సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ చామర్తి ఉమామహేశ్వర్‌రావు, జిల్లా కలెక్టర్ బి.పి. ఆచార్య పాల్గొన్నారు. ముగింపు సమావేశాల్లో (11-4-1993) భాగంగా ‘కాకతీయులు సాధించిన ఇంజనీరింగ్, టెక్నాలాజికల్ విజయాలు’ పై వరంగల్ ఆర్‌ఇసిలో ‘ఇన్‌టాక్’ నిర్వహించిన సదస్సులో కాకతీయుల నాటి చెరువులు, నీటి సామర్ధ్యంలాంటి విషయాలపై ప్రముఖులు ప్రసంగించారు.
మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత 1997 జూన్ 14 నుండి మూడు రోజులపాటు నాల్గవ విడుతగా ఈ ఉత్సవాలను నాగపూర్‌కు చెందిన దక్షిణ మధ్య ప్రాంత సాంస్కృతిక కేంద్రం, జిల్లా సాంస్కృతిక మండలి సంయుక్తంగా నిర్వహించాయి. నాటి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు వెయ్యిస్థంభాల గుడిలో ప్రారంభించిన ఉత్సవ సమావేశానికి సాంస్కృతిక శాఖ మంత్రి పడాల అరుణ అధ్యక్షత వహించగా, సాంఘీక శాఖామంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. నాటి సాంస్కృతిక శాఖ సంచాలకులు, సమాచార, పౌరసంబంధాలశాఖ స్పెషల్ కమీషనర్ బి.పి. ఆచార్య. జిల్లా కలెక్టర్ అంబరీష్‌లు హాజరైన ఈ కార్యక్రమంలో శ్రీమతి వెంపటి నాగేశ్వరి బృందం స్వాగత నృత్యం, పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక గాత్రం, కాకతీయ వైభవం దృశ్య, శ్రవణ కార్యక్రమాలు జరిగాయి.




