సెమికండక్టర్(అర్థ వాహకం), కంప్యూటర్, మైక్రో లేదా ఇంటిగ్రేటెడ్ చిప్స్ రూపంలో ఇన్ఫర్‌మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) ఉపకరణాల ముఖ్య భాగాలుగా ప్రపంచ మానవాళి ముందు మరో ప్రపంచాన్ని నిలుపుతున్నాయి. నేటి అత్యాధునిక డిజిటల్ విప్లవంతో దేశ సరిహద్దులు రేఖలు/కంచెలు చెరిగి పోయి, దూరాలు అర్థరహితం కావడంతో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోవడం చూస్తున్నాం. అరచేతిలో స్మార్ట్‌ఫోన్ వైకుంఠం తిష్ట వేసింది. డిజిటల్ అంతర్జాల వలతో ప్రపంచ నలుమూలలు అనుసంధానించబడ్డాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణానికి మెదడుగా కంప్యూటర్ చిప్ పని చేస్తుంది.
ఆధునిక డిజిటల్ ప్రపంచానికి గుండెకాయగా సెమికండక్టర్ చిప్స్ పేరు పొందాయి. నేటి ఆధునిక శాస్త్రసాంకేతిక యుగంలో సెమికండక్టర్ (అర్థవాహకం) చిప్స్ రూపంలో సమాచారాన్ని నిల్వ ఉంచడం (మెమొరీ చిప్స్), ఆప్తులతో ప్రేమల్ని పంచుకోవడం (కమ్యూనికేషన్ చిప్స్), వేకువనే నిద్ర లేపడం (లాజిక్ చిప్స్), నిద్రించినపుడు అవయవాల పర్యవేక్షణ (సెన్సార్ చిప్స్) లాంటి పలు అంశాలతో సెమికండక్టర్ చిప్స్ బహువిధాలుగా మన జీవనశైలిలో తెలియకుండానే భాగం అయ్యాయి. ప్రపంచంలో ఏ భాగంలో ఏ సమయంలో పయనించినా మనకు సుస్పష్టంగా దారిని చూపగల గూగుల్ మ్యాప్‌లు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. చిప్స్‌లో అంతర్భాగంగా ఎలక్ట్రానిక్ సర్కూట్ పొరలు సిలికాన్ ఉపరితలంపై ఏర్పడి ఉంటాయి. సమాచార నిల్వ, సమాచార ప్రసారం, వేగంగా డాటాను విశ్లేషించడం లాంటి ముఖ్య విధులను సెమికండక్టర్ చిప్స్ నిర్వహిస్తూ, నేటి డిజిటల్ విప్లవానికి కారణమవుతూ, ఐసిటి వ్యవస్థలకు పుణాదులుగా మారుతున్నాయి. ఆధునిక డిజిటల్ ప్రపంచంలో అర్థవాహక (సెమికండక్టర్) చిప్స్ హీరోలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి.
చిప్స్ తయారీ అత్యంత సంక్లిష్ట ప్రక్రియ
ముఖ్యంగా సెమికండక్టర్ చిప్స్ లాజిక్, మెమొరీ చిప్స్ అనబడే రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి ఎలక్ట్రానిక్ ఉపకరణంలో ఈ రెండు రకాల చిప్స్ అవసరం అవుతాయి. ప్రాసెసర్స్, గ్రాఫిక్ కార్డులు లాంటివి లాజిక్ చిప్స్‌కు ఉదాహరణలు కాగా రామ్, యస్‌డి కార్డులు మెమొరీ చిప్స్‌కు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. సెమికండక్టర్ చిప్స్ తయారీ బహుదశల్లో అత్యంత శుద్దతతో కూడిన సంక్లిష్ట ప్రక్రియలు, అతి ఖచ్చితత్వ దశలు ఉంటూనే అధిక పెట్టుబడులతో పాటు అధిక సమయం వెచ్చించాల్సిన అవసరం అవుతాయి. 1971లో 4004 ట్రాన్‌సిస్టర్ చిప్స్ తయారు చేసిన ప్రపంచం నేడు బిలియన్ల ట్రాన్‌సిస్టర్లను తయారు చేసే స్థితికి చేరినా డిమాండ్‌కు తగిన ఉత్పత్తులను చేయలేకపోవడం విచారకరమే. ఆధునిక సెమికండక్టర్ చిప్స్ స్మార్ట్‌గా, సూక్ష్మంగా, తేలికగా, శీతలంగా ఉంటున్నాయి. నేటి కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్ టెక్నాలజీల్లో సెమికండక్టర్ చిప్స్ పాత్ర అమూల్యం. కోవిడ్-19 ప్రళయకాలంలో మానవాళిని ఏకం చేసిన సెమికండక్టర్ చిప్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్, డిజిటల్ టివి లాంటి అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు కృతజ్ఞతలు తెలుపవలసిందే. ఆన్‌లైన్ విద్యాబోధనలు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ-వాణిజ్యాలు మన శీవనశైలిలో అనివార్యంగా భాగం కావడం చూసాం. ప్రపంచ గమనానికి డిస్పే డ్రైవర్స్, కమ్యూనికేషన్ చిప్స్, వీడియో ఆడియో ప్రాసెసింగ్ యూనిట్స్ రూపంలో సెమికండక్టర్లు దోహదపడుతున్నాయి. కరోనా అలల కల్లోలంలో కోవిడ్ టీకాల అభివృద్ధి, ఆర్థిక సామాజిన కార్యాల గమనాలు ప్రపంచవ్యాప్తంగా పునఃప్రారంభం కావడానికి సెమికండక్టర్ చిప్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. కంప్యూటర్ చిప్స్ కొరతో కార్లు, ప్లేస్టేషన్లు, బ్రాడ్‌బాండ్ రూటర్లు లాంటి అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తయారు చేసే పరిశ్రమలు తమ ఉత్పత్తులను తగ్గించుకున్నాయి. అత్యంత చిన్నదైనప్పటికీ చిప్స్ లేకుండా డిజిటల్ ప్రపంచం క్షణం కూడా గడవదు. ఆసియాకు చెందిన తైవాన్, చైనా, దక్షిణ కొరియాల్లోని కంపెనీలు సిలుకాన్ చిప్స్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడం జరుగుతోంది. కోవిడ్ మహమ్మారి ప్రభలడంతో పాటు యూయస్-చైనా సంబంధాలు చెడిపోవడంతో చిప్స్ కొరత పెరిగింది.
స్వయం సమృద్ధి సాధనకు ‘‘సిలికాన్ ఇండియా’’
సెమికండక్టర్ చిప్స్‌తో కూడిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు టెలికమ్, రక్షణ, అంతరిక్ష, అంతర్జాల పర్యవేక్షణ, పవర్, ఆటోమొబైల్ లాంటి అన్ని రంగాల్లో వినియోగించబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిప్స్ కొరత ఇండియాలో కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. 2020లో ఇండియాలో సెమికండక్టర్ల వినియోగం 20 బిలియన్లుగా అంచనా వేయబడిరది. ఈ చిప్స్ కొరతను తీర్చడానికి భారత ప్రభుత్వం స్వదేశీ ఉత్పత్తులను ‘సిలికాన్ ఇండియా‘ ప్రోగ్రామ్‌ను తీసుకొని ప్రోత్సహిస్తున్నది. సెమికండక్టర్ చిప్స్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడానికి పరిశ్రమలకు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి సిలికాన్ చిప్స్ తయారీలో స్వయంసమృద్ధిని పొందడం కనీస అవసరం అయ్యింది. 2021లో భారత ప్రభుత్వం 76,000/- కోట్ల ఆర్థిక సహాయం చేస్తూ కంప్యూటర్ చిప్స్ తయారు చేయగల విదేశీ కంపెనీలను భారత్‌కు ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తున్నది.
‘మేక్ ఇన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా‘ కలల సాకారానికి ‘సిలికాన్ ఇండియా’ పథకం ఫలప్రదంగా కావాలని కోరుకుందాం. దేశ సమగ్రాభివృద్ధిలో సెమికండక్టర్ల పాత్రను గ్రహించిన భారత ప్రభుత్వం వడివడిగా ఆ దిశన అడుగులు వేయడం హర్షదాయకం. సిలికాన్ చిప్స్ కొరతను అధిగమించడమే సత్వర మార్గమని భావించిన ప్రభుత్వం స్వదేశీ తయారీకి కావలసిన చర్యలను తీసుకుంటున్నది. 2020లో భారతం 54 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతుల్లో అధిక భాగం చైనా నుంచి రావడం గమనించారు. డిజిటల్ విప్లవానికి మూల స్థంబాలైన సమికండక్టర్ చిప్స్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తూ స్వయంసమృద్ధిని సాధించాలని కోరుకుందాం. సిలికాన్ చిప్స్‌ను ఎగుమతి చేసే స్థాయికి ‘సిలికాన్ ఇండియా’ చేరాలని ఆశిద్దాం.
-డా.బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037





