(నేడు ‘‘వైజ్ఞానికశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినం’’ సందర్భంగా….)
విద్య ఏ ఒక్కరి సొత్తు కాదు. విద్యార్హతకు పేద ధనిక తేడాలు ఉండవు. పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఉండదు. బాలురు, బాలికలు అనే తేడా అసలే కనిపించదు. అయినప్పటికీ అనాదిగా మహిళలు, బాలికలను చిన్న చూపు చూడడం, పాఠశాల/ఉన్నత విద్యకు దూరం చేయడం కొనసాగుతూనే ఉన్నది. ఈ కారణంతో పురుషులు, బాలురతో పోల్చితే మహిళలు, బాలికల ప్రాతినిధ్యం సైన్స్ రంగంలో చాలా తక్కువ అని మనకు తెలుసు. గత అర్థ శతాబ్ద కాలంలో మహిళలు, బాలికల విద్య క్రమంగా పెరగడంతో పాటు సైన్స్‌లో డిగ్రీలు పొందుతూ కూడా వారి భాగస్వామ్యం పెరుగుతోంది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో మహిళాలోకం: నేటికీ ప్రపంచ దేశాల్లో నెలకొన్న లింగ వివక్ష, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, కార్మిక విపణిలో వివక్షాపూరిత పద్దతులు లాంటి సామాజిక అడ్డంకులతో మానవాళి సమగ్రాభివృద్ధికి తీవ్ర విఘాతం అవుతున్నాయి. అంతే కాకుండా ఐరాస తలపెట్టిన ప్రతిష్టాత్మక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు – 2030లను సుసాధ్యం చేయడంలో మహిళలు, బాలికల పాత్ర వెలకట్టలేనిది. లింగ సమానత్వమే ప్రపంచ సమగ్రాభివృద్ధికి కొలమానం అవుతుంది. సైన్స్ సుస్థిరాభివృద్ధి సాధనలో విద్యావంతులైన మహిళలు, బాలికల భూమిక అమూల్యమని మానవాళి గమనించాలి.
నూతన శకంగా సైన్స్‌లో మహిళా నాయకత్వం: ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 16, 17లను అధిగమించడానికి మహిళలు, బాలికల మేధను వినియోగించుకోవాలనే నినాదంతో ప్రతి ఏట 11 ఫిబ్రవరిన ‘‘వైజ్ఞానికశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ వూమెన్, గర్ల్స్ ఇన్ సైన్స్)’’ను గత 9 ఏండ్లుగా పాటించుట ఆనవాయితీగా మారింది. ‘‘సైన్స్‌లో మహిళలు, బాలికల నాయకత్వంతో సుస్థిరాభివృద్ధిలో నూతన శకం (వూమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ లీడర్‌షిప్, ఏ న్యూ ఏరా ఇన్ సస్టేనబులిటీ)’’ అనే నినాదంతో ఐరాస ‘వైజ్ఞానికశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినం – 2024’ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత మహిళా వైజ్ఞానిక శాస్త్రవేత్త, భౌతిక రసాయనశాస్త్రాల్లో పరిశోధకురాలు మెడమ్ క్యూరీ జన్మదినం రోజున ఈ వేడుకలను నిర్వహించడం ముదావహం.
లింగ వివక్ష వలయంలో మహిళా మేధో శక్తి: ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ అనబడే మూడు ప్రధాన అంశాలను సుసంపన్నం చేసుకోవడానికి మహిళలు, బాలికల మేధోశక్తిని వైజ్ఞానికశాస్త్రంలో వినియోగించాలని ఐరాస సూచిస్తున్నది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్ నినాదం) రంగాల్లో మహిళలు, బాలికలకు సమాన ప్రాధాన్యం, భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి 2015లో ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానంతో ‘వైజ్ఞానికశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినం’ పాటించుట జరుగుతోంది. వైజ్ఞానికశాస్త్రంలో లింగ సమానత్వ సాధనకు నడుం బిగించాలని ప్రపంచ దేశాలకు ఐరాస హితబోధ చేస్తున్నది. మహిళలను వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లోకి ఆహ్వానించడం, సైన్స్‌లో రాణిస్తున్న మహిళల్ని గుర్తించడం, భవిష్యత్తు తరాలను ప్రోత్సహించడం, సమ్మిళిత అభివృద్ధికి పునాదులు పటిష్ట పరచడం, సభలు/సమావేశాలు నిర్వస్తూ మహిళాలోకానికి అవగాహన కల్పించడం, సామాజిక మాద్యమాల వేదికగా ప్రచారం చేయడం లాంటి సానుకూల కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రయత్నాలు చేయాలి.
ప్రపంచ ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్త మేడమ్ క్యూరీ: భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో పరిశోధకురాలుగా, ప్రపంచంలోనే తొలి మహిళ నోబెల్ బహుమతి గ్రహీతగా, రెండు నోబెల్ బహుమతులు స్వీకరించిన పరిశోధకురాలిగా మహిళగా మేడమ్ క్యూరీ మనకు పరిచయమే. మేడమ్ క్యూరీ భర్త ‘పెరీ క్యూరీ’ కూడా నోబెల్ బహుమతి పొందిన సైంటిస్టుగా మనకి పరిచయమే. 1906లో ప్యారిస్ యూనివర్సిటీలో ఫ్రోఫెసర్‌గా సేవలందించిన తొలి మహిళగా కూడా రికార్డులు సాధించింది మేడమ్ క్యూరీ. పోలాండ్‌లో జన్మించి, ఫ్రాన్స్‌లో వైవాహిక జీవితం గడిపిన క్యూరీ రేడియోధార్మికత రంగంలో విలక్షణ పరిశోధనలు చేస్తూ ‘పొలోనియమ్, రేడియం’ అనే రెండు మూలకాలను కనుగొని ప్రపంచ వైజ్ఞానికశాస్త్ర రంగ నిపుణులను నివ్వెరపరిచారు.
ప్రఖ్యాత భారత మహిళా వైజ్ఞానిక శాస్త్రవేత్తలు: కలకత్తా యూనివర్సిటీ నుంచి తొలి డాక్టరేట్ (పిహెచ్‌డి) పొందిన మహిళా రసాయన శాస్త్రవేత్తగా ‘ఆసిమా చటర్జీ’(1917-2006)కి పేరుంది. వైద్యరంగంలో ‘‘అనంది గోపాల్ రావ్ జోషి’’(1865-87), పాశ్చాత్య వైద్యరంగంలో ‘‘కాదంబినీ గంగూలీ’’(1861-1923), సర్జన్‌గా ‘‘మేరీ పూనెన్‌లూకోస్’’(1886-1976), మైక్రోవేవ్ ఇంజరీనింగ్ శాస్త్రవేత్త ‘‘రాజేశ్వరి చటర్జీ’’ (1922-2010), భారత దేశంలో తొలి పిహెచ్‌డి పొందిన ఎంజైమ్ అంశం పరిశోధకురాలు ‘‘కమలా సొహోనీ’’ (1911-1998), క్యాన్సర్ పరిశోధకురాలు ‘‘కమలా రనడే’’ (1917-2001), సోలార్/ఓజోన్ రంగంలో పరిశోధకురాలు ‘‘అన్నా మని’’ (1918-2001), పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి మహిళా వృక్షశాస్త్ర శాస్త్రవేత్త ‘‘జానకి అమ్మల్’’ (1897-1984), ప్రఖ్యాత స్త్రీ వైద్య నిపుణురాలు ‘‘డా: ఉందిరా హిందుజా‘‘ లాంటి ఎందరో ప్రముఖ మహిళా శాస్త్రవేత్తలు నేటి కళాశాల యువతులకు దారి దీపంగా నిలుస్తున్నారు. మన స్త్రీమూర్తులు, కూతుర్లకు ఉన్నత వైజ్ఞానిక సాంకేతిక విద్యలను అందిస్తూ పరిశోధనలు, బోధనలు లాంటి పలు రంగాల్లో రేపటి శాస్త్రవేత్తలను/ప్రేఫెసర్లను తయారు చేద్దాం, ఆడది అబల కాదని ఏకరువు పెడదాం.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల