‘‘తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ ప్రజలు చేసిన పోరు ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం సాగిన పోరాటం.. మట్టి మనుషులు ఏకమై వెట్టి చాకిరీకి,కౌలు వ్యవస్థకు,బానిసత్వానికి,వ్యతి
రేకంగా బరిసెలు, బండి గుంజలు ఎత్తి సామాన్య ప్రజానీకమంత కదిలొచ్చి చేసిన యుద్దం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమం.’’
మట్టి మనుషులు చేసిన పోరాటం కాళ్ళు మొక్కించిన చోటనే కదనానికి కాలు దువ్విన గడ్డ
ఈ తెలంగాణ అడుగడుగున
రక్తం మరకలు ఎరుపెక్కిన నేల
తూటాలకు ఎదురు నిలబడి కొట్లాడిన గడ్డ
ఆధిపత్య భూస్వామ్య పెత్తనాలకు రొమ్ము విరిసి గర్జించిన భూమి..
కారంపొడి మూటలతో కామాంధులను తరిమిన వీర వనితలున్న నేల ఇక్కడి చరిత్రంతా ప్రజలదే ఇక్కడి విప్లవమంత అసువులు బాసిన వీరులదే ఈ త్యాగఫలం తెలంగాణ రైతాంగానిదే. చరిత్రను ఎంత వక్రీకరణ చేసి కాయిదాలమీద కలాలతో గోడలమీద రంగులతో రాయించిన ఒకనాడు సూర్యూడు కొండల మధ్యనుండి పొడుసుకొచ్చినట్లు వెలుగులు రావడం ఖాయం.ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు సెప్టెంబరు17 పై చేస్తున్న చరిత్ర వక్రీకరణల రాజకీయాలు ప్రజలను, మేధావులను తప్పుతోవన నడిపించలేక చతికిలబడిపోయాయి. నిజాలు ప్రజలు తెలుసుకునేటంతటి కుతూహలం సాక్షాత్తు ప్రభుత్వాలే కల్పించాయి.జరిగిన పోరాటం అసలు నిజాలు తెలుసుకొని బండారం బయటేసుకున్న పార్టీల డొల్లతనం బయటపడింది.
అటు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సెప్టెంబరు 17 కు మతంరంగు పూసి హిందువులకు ముస్లింలకు జరిగిన పోరులో హిందువులు గెలిచినట్లు ముస్లింలు ఓడినట్లు కొత్త నాటాకానికి తెరలేపింది. వాస్తవానికి ఈ సాయుధ పోరాటం గాయపడ్డ గుండెలన్ని కంకణం కట్టుకొని రజాకార్ల దాష్ఠికానికి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు గ్రామాలలో నిజామ్ అనుకూల శక్తులు దొరలు, పటేల్, తాబేదార్ల క్రూరమైన హింసకాండకు దమననీతికి ఆడపిల్లలపై చేస్తున్న ఆత్యచారాలకు వ్యతిరేకంగా గ్రామాలకు గ్రామాలే కదిలివచ్చి కమ్యూనిస్టుల అండతో చైతన్యమై చేసిన ప్రజాపోరాటం…దీనిని ఆసరాగా తీసుకున్న బిజెపి ప్రభుత్వం ఇండియన్ యూనియన్ లో కేవలం పటేల్ తీసుకున్న ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యకు భయపడి మీర్ ఉస్మాన్ అలీఖాన్ లొంగిపోయాడని ఎవరి పాత్ర ఎలాంటిది లేదని కట్టు అబద్దలు ప్రచారం చేసి ప్రజలను చిన్న చూపు చూసి పటేల్ ను మాత్రం యోధుడిగా చిత్రీకరించే పనిలో ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న కాలాన టి.ఆర్.ఎస్ కూడా మజ్లిస్ తో జతగట్టి నిజామ్ ను పొగుడుతూ నిజామ్ కట్టించిన భవనాలను, ఆనకట్టలను అభివృద్ధి గా చూపిస్తూ ఇటు పోరాట వీరులైన దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, షోయబుల్లా ఖాన్, రావి నారాయణరెడ్డి లాంటి త్యాగాలను ఎలా కీర్తిస్తారో చూడాలి. సెప్టెంబరు 17 దినాన్ని చూసే కోణాన్ని బట్టి అర్థం చేసుకునే పరిధి ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొ విధంగా కనిపిస్తుంది. కాకపోతే బిజెపి పార్టీ మతం ముసుగులో రాజకీయం చేస్తూ ఈ చారిత్రక సందర్భాన్ని కూడా తన ఖాతాలో జమచేసుకోవాలనీ తెగ ఆరాటం చేస్తుంది.తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ ప్రజలు చేసిన పోరు ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం సాగిన పోరాటం.. మట్టి మనుషులు ఏకమై వెట్టి చాకిరీకి,కౌలు వ్యవస్థకు, బానిసత్వానికి,వ్యతిరేకంగా బరిసెలు, బండి గుంజలు ఎత్తి సామాన్య ప్రజానీకమంత కదిలొచ్చి చేసిన యుద్దం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమం. నిజాం ముసుగులో ప్రత్యేక బలగం రజాకార్ల వ్యవస్థ ఖాసీమ్ రజ్వీ నేతృత్వంలో ఏర్పడింది. నిజామ్ హయంలో ప్రపంచంలోనే ధనవంతమైన రాజకుటుంబంగా ఎదిగిపోయింది.ఒకపక్క పేదలు డొక్కలు ఎండిపోయి కడుపాకలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. కౌలు కట్టలేక బీద రైతులు ఉరికొయ్యలకు వెలాడారు. పసిపిల్లలు పాలులేక మరణించారు.. కరువుకాటకాలతో జనం విలవిలలాడిపోయారు.. ఇంత జరుగుతున్న నిజామ్ వ్యవస్థ కింద పనిచేసే బలగమంత ధనరాశులతో తులతూగిపోయింది.
ఇవేగాక సామాజిక రుగ్మతలు ప్రజలను పిప్పి చేశాయి. పట్వారీల గఢీలలో పండుగలై పెండ్లిలైన ఊరంత వచ్చి పని చేయాలి. వారి ఖర్చులకు అనుకూలంగా పన్నులు అత్యధికంగా చెల్లించాలి. గ్రామాలకు అధికారులొస్తే వారికి కూడా రాచమర్యాదలు చేసి పెట్టాలి.శ్రమ దోపిడికి, ఆర్థిక దోపిడికి అద్దుపద్దులు ఉండేవి కావు.. ప్రశ్నించేవారిని చెట్లకు కట్టేసి చంపటం.. నిలువున తగలబెట్టడం యువకులను గుంతలు తవ్వి పూడ్చడం.. మహిళలను బట్టలిప్పి బతుకమ్మలాడించడం లాంటి సామాజిక సమస్యలకు విసిగిపోయి గుత్పలందుకొని చావోరేవో తేల్చుకుందామని పోరు చేసింది తెలంగాణ రైతాంగం. చైతన్యానికి ఎటువంటి మార్గం లేనప్పుడు ఆంధ్ర జనసంఘం,ఆంధ్ర మహాసభ లు ఏర్పాటు చేయబడ్డాయి.సభలకు సమావేశాలకు ఎలాంటి వీలులేదు. కేవలం నిజామ్ కు భజన చేస్తమంటేనే అవకాశం ఇచ్చేవారు.. ప్రభుత్వ ఫర్మానాలు కూడా ఎవరికి అర్థం అయ్యేవి కావు.. ఎందుకంటే ఉర్దూ భాషనే అధికారిక భాష కాబట్టి చైతన్యం అనే మాటకు అవకాశం లేకుండా పోయింది. అప్పుడప్పుడే పాటలు, బుర్రకథలు వెలుగులోకి వచ్చి ప్రజలను ఉద్యమబాట నడిపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
చరిత్రను చరిత్రలానే చదువుకోవాలి లేదంటే మీరు వక్రీకరించిన చరిత్ర మీ మీదనే తిరగబడటం ఖచ్చితం..మూడోసారి అధికారం కోసం వెంపర్లాడటంలో భాగంగానే టి.ఆర్.ఎస్ ఈ కొత్త పొలిటికల్ డ్రామా… అట్లనే బిజెపి కూడా తెలంగాణ మీద పెత్తనం కోసం రాజకీయ రంగు ముసుగులో సెప్టెంబరు 17 కు మతం రంగుబూసి ఏమాత్రం అవగాహన లేని పార్టీ నాయకులకు నూరిపోస్తుంది.ఇటు తెలంగాణలో అటు దేశంలో ఎన్నో సమస్యలు తిష్టవేసిన కాలంలో ప్రజలను తప్పుదోవన నడిపించుటకు సెప్టెంబరు17 ను ఒక సాకుగా తీసుకొని ఏడాదంతా ఉత్సవాలు చేయాలని సంకల్పించుకొని మాది పై చేయంటే మాదే పై చేయనీ ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చుకుంటున్నాయి. ప్టెంబరు 17 ఘట్టాన్ని సంబరంగా జరుపుకోదగినవారు ఉంటే వారు కేవలం కాంగ్రెస్ మరియు కమ్యునిస్ట్ ల పార్టీ మాత్రమే …బిజెపి, టిఆర్‌ఎస్ ఆ చారిత్రక సందర్భాన్ని ఉత్సవంగా చేసుకోవడం ఓ చారిత్రక చమత్కారమే.
అవనిశ్రీ, కవి,రచయిత.
9985419424.




