సికింద్రాబాద్‌ కుట్రకేసు

సికింద్రాబాద్‌ కుట్రకేసును రచయితల  మీద బనాయించడమే  కుట్ర పూరితంగా జరిగింది. విప్లవ రచయితలు తమ మార్క్సిస్టు భావాలకు అనుగుణంగా సామాజిక వాస్తవాలను తమ రచనలో ప్రతిబింబిస్తూ వచ్చారు గనుక ఆ భావాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం వారిని వేధించేందుకే ఇటువంటి అక్రమ కేసులలో వారిని బనాయి­స్తోంది.

చెరబండరాజు, రాజలోచన్‌ ఇద్దరూ ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు గనుక ఈ అధికరణం సహాయంతో కారణం చూపకుండా, విచారణ అవసరం లేకుండా వారిద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 1980 మార్చి 18న జారీ చేసిన జి.వో నెం.ఎస్‌ 214 ద్వారా చెరబండరాజును, జి.వో. ఎం.ఎస్‌.215 ద్వారా జి రాజలోచన్‌ను ఉద్యోగాల నుంచి తొలగించింది. అప్పటికి చెరబండరాజు హైదరాబాద్‌లో గ్రేడ్‌`1 తెలుగు పండిట్‌గా, రాజలోచన్‌ వరంగల్‌లో అసిస్టెంటు (తెలుగు)గా పని చేస్తున్నారు.
ఆ ఉత్తర్వులు రెండూ అప్రజాస్వామికమైనవని, చట్ట వ్యతిరేకమైనవని, కనుక వాటిని కొట్టివేసి వారిద్దరినీ తిరిగి ఉద్యోగాలలో నియమించమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వారి తరఫున నేను హైకోర్టులో వేర్వేరు రిట్‌ పిటిషన్లు దాఖలు చేశాను. జస్టిస్‌ మాధవరెడ్డి, జస్టిస్‌ వ­క్తధర్‌లు ఆ పిటిషన్లపై నా వాదనలను, ప్రభుత్వ ప్లీడర్ల వాదనలను జులై 9 నుంచి జులై 15 వరకు విని, జులై 17న తీర్పు ప్రకటించారు.

చెరబండరాజుగా దిగంబరకవిగా, విప్లవ కవిగా ప్రఖ్యాతుడైన బి. భాస్కరరెడ్డి హైదరాబాద్‌లో మలక్‌పేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గ్రేడ్‌`1 తెలుగు పండిట్‌గా పని చేస్తుండేవాడు. ఆయన 1966 జనవరి నుంచి ప్రభుత్వ కొలువులో ఉన్నాడు. విప్లవ రచయితల సంఘం స్థాపకులలో ఒకడిగా ఆయన సుప్రసిద్ధుడు. కొంత మంది విప్లవ రచయితలను, కొంత మంది విప్లవ కార్యకర్తలను కలిపి సికింద్రాబాద్‌ కుట్రకేసు అని ఒక కేసును పోలీసులు 1974 మే లో నమోదు చేశారు. ఆ కేసులో చెరబండరాజును 1974 మే 18న అరెస్టు చేశారు. ఆ అరెస్టుతో చెరబండరాజును అరెస్టయిన నాటి నుంచి తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ (సస్పెండ్‌ చేస్తూ) హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారి 1974 జూన్‌ 6న ఒక ఉత్తర్వు జారీ చేశారు. సికింద్రాబాద్‌ కుట్రకేసులో బెయిల్‌పై చెరబండరాజు 1975లో విడుదలయ్యాడుగాని, అప్పటికి ఎమర్జెన్సీ మొ­దలయింది. దాదాపు వెంటనే ఆయనను అంతరంగిక భద్రతా చట్టం (మీసా) కింద మళ్లీ అరెస్టు చేశారు. ఎమర్జెన్సీ కాలమంతా ఆయన జైలులోనే ఉన్నాడు.ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌లో ఉన్నాడు.

ఎమర్జెన్సీ తర్వాత ఆయన విడుదలయిన తర్వాత, జిల్లా విద్యాశాఖాధికారి 1977 ఏప్రిల్‌ 19న ఇచ్చిన ఒక ఉత్తర్వులో పాత సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆయనను సీతాఫల్‌ మండిలోని ఉన్నత పాఠశాలలో నియమించారు. కాని మూడు రోజులు కూడా గడవకముందే , ఏప్రిల్‌ 22న ఇచ్చిన మరొక ఉత్తర్వులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఏప్రిల్‌ 19 ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. చెరబండరాజు ఆంధ్రప్రదేశ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ట్రిబ్యునల్‌లో ఆ ఉత్తర్వులను సవాలు చేశాడు.
ట్రిబ్యునల్‌ నోటీసుకు జవాబుగా జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన జవాబు చాలా చిత్రమైనది. తనకు ఏప్రిల్‌ 20న  డిప్యూటీ ఇనస్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (ఇంటిలిజెన్స్‌) నుంచి ఒక ఉత్తరం వచ్చిందని అందులో సికింద్రాబాద్‌ కుట్రకేసు మరొక ఏడాదిలో అయిపోతుందని, అందువల్ల ఆ కుట్రకేసు నిందితులను ఉద్యోగాలలో పునర్నియామకం ఉత్తర్వులను నిలిపివేశానని ఆ విద్యాశాఖాధికారి ట్రిబ్యునల్‌కు నివేదించాడు.

ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది ప్రజా ప్రతినిధులా, ప్రభుత్వమా, ఇంటిలిజెన్సు డిఐజీనా అని నేను చాలా కాలంగా అడుగుతున్నాను. అసలు ఒక జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించడానికి ఇంటిలిజెన్సు డిఐజి ఎవరు? ఆ ఆదేశాన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఎందుకు పాటించాలి?
ఇది ఒక వైపు జరుగుతుండగానే చెరబండరాజు విషయంలో చెప్పవలసిన సంగతి మరొకటి ఉంది. ఆయన ముందు  సికింద్రాబాద్‌ కుట్రకేసులోనూ, ఆ తర్వాత ఎమర్జెన్సీలోనూ సుదీర్ఘ కాలం జైలులో ఉండడంవల్ల ఆరోగ్యం పూర్తి చెడిపోయింది . జైలులో ఉండగానే ఆయనకు బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి మొదలైంది. అది క్యాన్సర్స్‌గా ముదిరి పోయింది.  అప్పటికే ఎన్నోసార్లు శస్త్ర చికిత్సలు జరిగి ఆయన ఎక్కువకాలం జీవించి ఉంటాడా అని సందేహాలు మొ­దలయ్యాయి ­. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అయినా ఆయనను ఉద్యోగంలో పునర్నియమించాలని ఆయన మిత్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని కోరడం మొదలుపెట్టాయి . నిజంగానే ఆయన ఆ తర్వాత రెండు సంవత్సరాలలో మరణించాడు. ఆ చివరిరోజుల్లో ఆయనపట్ల ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించింది.

ఆయన మీద సస్పెన్షన్‌ ఎత్తివేయాలని ఒకవైపు కోరికలు వస్తుంటే, ప్రభుత్వం ఆ మానవతావాద ఆకాంక్షలకు ప్రతిస్పందించలేదు సరిగదా, సరిగ్గా ఆయన మృత్యుశయ్యపై ఉన్నప్పుడే ఆయనను 311(2)(సి) కింద జవాబు చెప్పనక్కరలేకుండా ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఆయన మీద ప్రభుత్వం ఇలా కక్ష కట్టడం ఆయన రచనల మీద, ఆయన సహ రచయితల రచనల మీద కక్షతోనే. అసలు సికింద్రాబాద్‌ కుట్రకేసును రచయి­తల మీద బనాయించడమే  కుట్ర పూరితంగా జరిగింది. విప్లవ రచయితలు తమ మార్క్సిస్టు భావాలకు అనుగుణంగా సామాజిక వాస్తవాలను తమ రచనలో ప్రతిబింబిస్తూ వచ్చారు గనుక ఆ భావాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం వారిని వేధించేందుకే ఇటువంటి అక్రమ కేసులలో వారిని బనాయి­స్తోంది. వారిని ఈ విధంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది అని నేను కోర్టులో వాదించాను.

సికింద్రాబాద్‌ కుట్రకేసులో ఈ రచయితలను తప్పుడుగా ఇరికించడం జరిగిందని నేను చేసిన వాదనను ప్రభుత్వ న్యాయవాదులు ఖండించారు.. ‘‘ప్రభుత్వాన్ని సాయుధ  విప్లవం ద్వారా కూలదోసేందుకు, హింసకు పాల్పడేందుకు ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొట్టేందుకు తమ రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఈ విప్లవ రచయితలు ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారని’’ అన్నారు. హత్యలూ, దోపిడీలూ చేస్తున్న, హింసను నమ్మే నక్సలైటు కార్యకర్తలతో చెరబండరాజు చేతులు కలుపుతున్నాడని అన్నారు. కలం మాది కత్తి మీది అనే నినాదంతో ఈ విప్లవ రచయి­తలు నక్సలైట్లు కార్యకర్తలకు మద్దతు ఇస్తున్నారని అన్నారు. చెరబండరాజు ఇంకా హింసను ప్రబోధిస్తూనే ఉన్నాడని అందువల్ల ఆయనను పునర్నియమించడం సాధ్యంకాదని అన్నారు. ఏది ఏమైనా, ఆంతరంగిక భద్రతా కారణాల దృష్ట్యా, విచారణ జరపకుండానే చెరబండరాజును ఉద్యోగం నుంచి తొలగించాలనే అభిప్రాయానికి గవర్నర్‌ సంతృప్తి చెందారని, గవర్నర్‌ నిర్ణయాన్ని సవాలు చేయడానికి వీలులేదని ప్రభుత్వ న్యాయవాది వాదించాడు.

-కె.జి. కన్నబిరాన్‌
ఆత్మకథాత్మక సామాజిక చిత్రం
అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *