సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
డిప్యూటి సిఎంగా భట్టి, పది మంది మంత్రుల ప్రమాణం
ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై
ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం
భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు
సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా
పలువురు ప్రముఖులు అభినందనలు

 
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : తెలంగాణ రెండవ సిఎంగా గురువారం మధ్యాహ్నం 1.21కి ఎల్‌బి స్టేడియం వేదికగా ఎనుముల రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సిఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి , దామోదర్‌ రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ , కొండా సురేఖ, సీతక్క,  తుమ్మల నాగేశ్వరరావు,  జూపల్లి కృష్ణారావు వరుసగా ప్రమాణం చేశారు. దాంతో రాష్ట్రంలో సిఎంగా రేవంత్‌ రెడ్డితో పాటు 12 మందితో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. నవంబర్‌ 30న జరిగిన ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిరది. ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ సిఎంతో పాటు మంత్రులతో ప్రమాణం చేయించారు. తొలుత సిఎంగా రేవంత్‌ రెడ్డి తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రేవంత్‌ అనే నేను అని .. పలకగానే స్టేడియం హోరెత్తిపోయింది. రేవంత్‌తో  పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణం చేశారు. రేవంత్‌ రెడ్డి తర్వాత మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, తరువాత పది మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దిల్లీ నుంచి ఏఐసీసీ అగ్రనేతలందరూ తరలి వచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖ్‌ ఇతర నేతలు కూడా తరలి వొచ్చారు.
ఈ సందర్భంగా ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ముఖ్యమైన నేతలందరూ తరలి రావడంతో హైదరాబాద్‌ మొత్తం సందడిగా మారింది.  64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేదికపై నిలిచారు. ప్రమాణం చేసిన వెంటనే సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు కాంగ్రెస్‌ అగ్రనేతలను కలుసుకని అభివాదం చేశారు. ప్రమాణ స్వీకారం అనుకున్న సమయానికన్నా 15 నిముషాలు ఆలస్యం అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా పలువురు ముఖ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క ట్రాఫిక్‌లో ఉండిపోయారు. గవర్నర్‌ తమిళిసై కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. గవర్నర్‌ కాన్వాయ్‌ ఇంకా ట్రాఫిక్‌లోనే ఉండిపోయింది. ఒంటిగంటకు సభకు చేరుకోవాల్సిన గవర్నర్‌ ట్రాఫిక్‌ జామ్‌ వలన ఆలస్యమైంది. స్టేడియం వైపుకు గవర్నర్‌ కాన్వాయ్‌ను పోలీసులు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎల్బీస్టేడియం వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అటు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడటంతో నేతల్లో టెన్షన్‌ నెలకొంది. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పోలీసు వైఫల్యాలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు కిలోవిూటర్ల మేర భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. చివరకు అందరినీ ఒకే వాహనంలో ఎల్బీస్టేడియానికి పోలీసులు పంపించి వేశారు. ఇకపోతే ప్రమాణానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రజలు కేరింతలు కొట్టారు. జై రేవంత్‌ అంటూ నినాదాలు చేశారు. స్టేడియంలో నినాదాలు మార్మోగాయి.
సిఎం రేవంత్‌కు ప్రధాని మోదీ, మంత్రి హరీష్‌రావు సహా పలువురు ప్రముఖులు అభినందనలు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి మోదీ తదితరులు అభినందన సందేశాలు అందించారు. ఈ మేరకు  ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా ప్రధాని మోడీ విషస్‌ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హావిూ ఇస్తున్నాను అంటూ కామెంట్‌ చేశారు. ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో నరేంద్ర మోదీ ఎక్స్‌ నుంచి ఈ పోస్టులు వొచ్చాయి. ప్రధాని మోదీతో పాటు మాజీమంత్రి హరీష్‌ రావు, మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డికి, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన మల్లు భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల అమలు దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని హరీశ్‌రావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ కొత్తగా భాద్యతలు తీసుకుంటున్న మంత్రులకు మెగాస్థార్‌ చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.. తెలంగాణ నూతన సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు.. మంత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విూ నాయకత్వంలో మన రాష్ట్రం ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. అంటూ రాసుకొచ్చారు.
సచివాలయంలో సిఎం చాంబర్‌లో రేవంత్‌ ప్రత్యేక పూజలు
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ప్రమాణ స్వీకారం అనంతరం సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న సిఎం రేవంత్‌ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రోటోకాల్‌ ప్రకారం కాన్వాయ్‌లో సెక్రటేరియట్‌కు వొచ్చిన రేవంత్‌కు సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ గుప్తా సహా పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో పోలీసులు రేవంత్‌ రెడ్డికి గౌరవ వందనం సమర్పించారు. సీఎస్‌, డీజీపీతో సెక్రటేరియట్‌ లోనికి వెళ్లిన రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి ఛాంబర్‌ ఉన్న ఆరో అంతస్తుకు వెళ్లే ముందు పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. చాంబర్‌లో భార్యతో కలసి పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనం మధ్య తన సీటులో ఆసీనులయ్యారు. ఆ తర్వాత కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రులు కూడా సెక్రెటేరియట్‌ చేరుకున్నారు.  అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది.

అన్ని విధాలా సహకారాన్ని అందిస్తాం..
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి  ప్రధాని మోదీ అభినందనలు

image.png
హైదరాబాద్‌, పిఐబి, డిసెంబర్‌ 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలియ జేశారు. గురువారం ప్రధాన మంత్రి ఎక్స్‌ ద్వారా చేసిన ఒక సందేశంలో..‘‘తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన రేవంత్‌ రెడ్డికి ఇవే అభినందనలు. రాష్ట్ర ప్రగతికి మరియు రాష్ట్రం యొక్క పౌరుల సంక్షేమానికి సాధ్యమైనటువంటి అన్ని విధాలుగాను సమర్థనను అందిస్తానంటూ నేను హామీని ఇస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *