సింగరేణిలో 485 పోస్టులకు నోటిఫికేషన్లు

ఈ ఏడాది వెయ్యి కారుణ్య నియామకాలు
26న కొత్తగూడెంలో 10.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు
బొగ్గు కొరత లేకుండా చర్యలు
సీఎండీ ఎన్‌.బలరామ్‌కు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు
సింగరేణి అభివృద్ది,
సంక్షేమ కార్యాక్రమాలపై సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : సింగరేణి కాలరీస్‌లో ఖాలీగా ఉన్న 317 డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్‌ రిక్రూట్మెంట్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి ఛైర్మన్‌ అండ్‌ ఎం.డీ బలరామ్‌ నాయక్‌ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. బుధవారం సచివాలయంలో సింగరేణి కాలరీస్‌ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంస్థ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ బలరామ్‌, డైరెక్టర్‌(పర్సనల్‌) ఎన్‌వికె శ్రీనివాస్‌, ఇతర అధికారులతో డిప్యూటి సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటి సీఎం మాట్లాడుతూ…ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల్లో ఏలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేలాలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో ఏలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేకుండా చేసుకున్న రూ.కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పందం పురోగతి గురించి భట్టి ఈ సందర్భంగా ఆరా తీశారు. ప్రమాద భరితమైన బొగ్గు రంగంలో పనిచేస్తున్న 43 వేల మంది ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించిన వారమవుతామని తెలిపారు.

ఇప్పటి వరకు కోల్‌ ఇండియాలోనూ ఇలాంటి ఒప్పందం లేదని, త్వరలో మిగిలిన బ్యాంకులతోనూ ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎండి బలరామ్‌ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. కోటి ప్రమాద బీమాపై కార్మికులకు అవగాహన కల్పించాలని డిప్యూటి సీఎం సూచించారు. సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఈ నెల 26వ తేదీన ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటి సీఎం సింగరేణి అధికారులను ఆదేశించారు. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన మిగిలిన సోలార్‌ ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. సింగరేణి ఉద్యోగులు, అధికారుల సౌకర్యార్ధం హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన అతిథి గృహం భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరై శంకుస్థాపన చేస్తామన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం సహకారం అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదే కాకుండా గోదావరిఖని, మంచిర్యాల కార్మికులకు సురక్షిత మంచినీరు అందించేందుకు వీలుగా చేపట్టిన ర్యాపిడ్‌ గ్యావిటీ ఫిల్టర్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు. ఈ వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాలపై రోజువారీ సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాల మేరకు సింగరేణిలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్‌, 168 ఇంటర్నల్‌ పోస్టులకు నేడు నోటిఫికేషన్లను జారీ చేస్తున్నామని ఆసంస్థ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ ఎన్‌ బలరామ్‌ వెల్లడిరచారు. డిప్యూటీ సీఎంతో భేటీ అనంతరం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. వారసుల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలపై అన్ని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ (పర్సనల్‌) ఎన్‌వికె శ్రీనివాస్‌ను ఆదేశించారు. కొత్తగూడెం సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం పనులను, అలాగే హైదరాబాద్‌ అతిథి గృహం భూమి పూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *