సింగరేణిపై కాంగ్రెస్‌, బిజెపిల కుట్రలు

  • వేలం పాటలను ఎందుకు అడ్డుకోరు…
  • మండిపడ్డ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా..ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వ్నిడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్‌ చెబితే.. వాటితో ఏం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారని, 16 ఎంపీ సీట్లు వొచ్చిన తెదేపా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌కు చెరో 8 సీట్లు ఉన్నాయని, బొగ్గు గనుల వేలం పెట్టవద్దని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా  రేవంత్‌రెడ్డి.. ప్రధాని మోదీకి   లేఖ రాశారని, ఒడిశాలో రెండు గనులను వేలం లేకుండా నైవేలీ లిగ్నెట్‌కు అప్పగించారని, అలాగే గుజరాత్‌లో రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు 2015లో వేలం లేకుండానే నేరుగా నాలుగు గనులు కేటాయించారని, తమిళనాడులో కూడా బొగ్గు గనులను వేలం నుంచి మినహాయించాలని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై కేంద్ర మంత్రిని కోరారని కెటిఆర్‌ అన్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం వల్లే నష్టాల్లోకి వెళ్లిందని, ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్ల అనే గనిని క్యాప్టివ్‌ మైన్‌ కింద కేటాయించాలని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అడిగితే కేంద్రం ఇవ్వలేదని, ఆప్షన్‌లో అదానీకి అప్పగించిందని, సొంతగని లేకపోవడంతో నష్టాల్లోకి వెళ్లిన విశాఖ ఉక్కును అమ్మాలని చూశారని అన్నారు. ఇప్పడు సింగరేణి విషయంలో కూడా అదే విధమైన వ్యూహం అలవంబించబోతున్నారని, ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర అని కెటిఆర్‌ ఆరోపించారు. 2021 డిసెంబరు 11 నాడు సింగరేణికి కోల్‌ బ్లాక్స్‌ కేటాయించాలని డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి వైఖరి ఎందుకు మారిందని కెటిఆర్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. వేలంలో పాల్గొంటామని ఇప్పుడు చెబుతున్నారని, తెలంగాణలోని బొగ్గు గనులు వేలం వేయకుండా ఇప్పటి వరకు భారాస రక్షణ కవచంలా నిలిచిందని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి సింగరేణిని ఖతం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డి బొగ్గు గనుల యాక్షన్‌ను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. 16ఎంపీల పవర్‌ ఏంటో ఏపీని చూస్తే తెలుస్తుందని ఉద్ఘాటించారు. రేవంత్‌ ఎందుకు ఆపక పోవడానికి కారణం  కేసుల భయమా..అంటూ ఎద్దేవా చేశారు. సింగరేణి మెడ వ్నిద కేంద్రం కత్తి పెడితే సీఎం రేవంత్‌ ఆ కత్తికి సాన పడుతున్నారని సెటైర్లు విసిరారు. సింగరేణికి ప్రమాదం వొస్తే కాపాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. సింగరేణిని కార్పొరేట్‌ గద్దలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వొచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని అడ్డుకుంటామన్నారు. వేలంలో పాల్గొనే వారు ఆలోచించాలని కోరారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒరిస్సా, గుజరాత్‌లో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చి ఇక్కడ సింగరేణికి బొగ్గు బ్లాక్స్‌ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సింగరేణి వేలంలో ఎందుకు పాల్గొనాలని కెటిఆర్‌ నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *