సింగరేణికి అండగా ఉంటా…

  • అనవసరంగా విమర్శలు చేస్తే సహించం
  • సింగరేణిని మభ్య పెట్టి లబ్ది పొందిన బిఆర్‌ఎస్‌
  • కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : కేంద్ర మంత్రిగా సింగరేణికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…సింగరేణి కార్మికుల కు అన్ని రకాలుగా అండగా ఉంటానని అన్నారు. సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత 49 శాతం వాటా ఉన్న కేంద్రంపై కూడా ఉందని, ఆ సంస్థకు లాభం చేకూర్చే పని కేసీఆర్‌, కేటీఆర్‌, భారాస ప్రభుత్వం ఏనాడూ చేయలేదన్నారు. ఉద్యోగులకు, కార్మికులకు సొంత ఇంటి పథకం అంటూ మభ్యపెట్టారని, వైద్య సదుపాయం, కాంట్రాక్ట్‌ కార్మికుల రైగ్యులరైజ్‌, కోల్‌ ఇండియా కార్మికుల తరహా జీతాలు వంటి    హావ్నిలన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డగా సింగరేణి ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వేర్వేరు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా సరే సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని అన్నారు. రానున్న రోజుల్లో మనం కూడా ఆత్మనిర్భర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సొంత కాళ్లపై నిలబడాలన్నారు.

 

దేశంలో బొగ్గు ఉత్పత్తి మరింత పెరగాల్సి ఉందని, ఆ దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అభివృద్ధికి అడ్డుపడొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు కిషన్‌ రెడ్డి. త్వరలోనే సింగరేణికి సంబంధించిన అన్ని అంశాలపై సవ్నిక్ష నిర్వహిస్తానని, కోల్‌ ఇండియా కూడా వేలంలో పాల్గొంటుందని తెలిపారు. సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చట్టం చేశామని, రాష్ట్రంలోని బొగ్గు గనులకు వేలం వేసుకోవాలని కేంద్రం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రూ.2వేల కోట్ల ఆదాయం కోల్పోయామన్నారు.

చట్టంతో తమకేం సంబంధం అని ఇవాళ భారాస నేతలు మాట్లాడుతున్నారని, చట్టం చేసిన సమయంలో వారు సభలోనే ఉన్నారని, దానికి మద్దతు ప్రకటించారని, సింగరేణి విషయంలో ప్రశ్నిస్తున్న నేతలు మైన్స్‌ వేలంలో ఎందుకు పాల్గొనలేదో సమాధానం చెప్పాలని అన్నారు. ఐరన్‌ వోర్‌, సున్నపురాయి గనులకు వేలం వేయకుండా నిర్లక్ష్యం చేశారని, ఓడిపోయామనే బాధలో కేటీఆర్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలపై జాలి చూపించాలని కిషన్‌రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *