సమాజ చైతన్యానికి ‘గజ్జెకట్టి గళం విప్పిన’ గొప్ప వ్యక్తి

కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు
ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న ఆయన మాటలు మాకు స్ఫూర్తి
ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : తన ఆట పాటలతో సమాజాన్ని చైతన్య పరిచేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న అని సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు. కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్‌ అవార్డును వొచ్చే ఏడాది నుంచి ఆయన ప్రతీ జయంతి రోజున పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో ప్రజా యుద్ధ నౌక జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరై మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దరన్న అని కొనియాడారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్న అని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు తమకు స్ఫూర్తి అని అన్నారు. ఆయనతో మాట్లాడితే తమకు వెయ్యేనుగుల బలం అని అన్నారు.

ఆ బలంతోనే గడీల ఇనుప కంచెల బద్దలు కొట్టి ప్రజా ప్రభుత్వంలో జ్యోతిరావు పూలే భవన్‌గా మార్చామని అన్నారు. ఏ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్‌ మోసం చేశారో, తమ ప్రజా ప్రభుత్వంలో ఆ దళితుడికే ఎమ్మెల్సీ కవిత వొచ్చి పూలే విగ్రహం కోసం వినతిపత్రం ఇచ్చారని అన్నారు. ఎవరైనా వొచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ తమ ప్రభుత్వంలో ఉందన్నారు. గద్దరన్న విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శపనార్థాలు పెడుతున్నారని అన్నారు. ఆరు నెలల్లో కేసీఆర్‌ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని, అలాంటి ఆలోచన చేసిన వారిని తెలంగాణ ప్రజలు ఘోరీ కడతారని అది వాళ్ల ఒంటికి, ఇంటికి మంచిది కాదని అన్నారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఐదేళ్లు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత తమదని అన్నారు. ఇదే వేదికగా తాను ఇదే శాసనం, ఇదే జీవో అని చెబుతున్నానని  అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *