లోక్‌సభ ఎన్నికల్లోనూ కెసిఆర్ పాపులర్ పథకాలు మరోమారు ప్రచారాంశం అవుతున్నాయి. రాజకీయ విమర్శలతో పాటు పథకాల పనితీరు ముందుకు వొస్తున్నాయి. ఇందులో నిరంతర విద్యుత్, రైతుబంధు, కాళేశ్వరం నీళ్ల్లు అంటూ కెసిఆర్ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇవే వోట్లు సాధిస్తాయని, కాంగ్రెస్, బిజెపిలను దెబ్బతీస్తాయన్న ధీమాలో కెసిఆర్ ఉన్నారు. అందుకే ప్రధానంగా 24 గంటలు కరంట్ అందించిన తీరును ఆయన బాగా ముందుకు తెస్తున్నారు. తాను అధికారంలో ఉండగా ఇచ్చిన కరెంట్‌ను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతున్నదని కెసిఆర్‌తో పాటు బిఆర్ఎస్ శ్రేణులు బాగా ప్రచారం చేస్తున్నారు. కరెంట్, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లతో రైతులను ఆకట్టుకునేలా ప్రచారం సాగిస్తున్నారు. గతంలో ఎండాకాలంలో ఊరూరా కరెంట్ ఇచ్చిన విషయాన్ని బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రాన్స్‌కో కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా విద్యుత్ సరఫరాలో ముందున్నది. ప్రధానంగా ఈ నాలుగు మాసాల్లో కాంగ్రెస్ కూడా విద్యుత్ సమస్యను అధిగమించి పనిచేస్తోంది.
గతంలో ఇచ్చిన మాదిరిగానే సరఫరా చేస్తున్నారు. అయితే దానిని కాదని కెసిఆర్ కరెంట్ కోతలు అంటూ ఈ మధ్య ట్వీట్లు చేస్తున్నారు. ఎందుకంటే కరెంట్ వెతలతో నానా కష్టాలు పడ్డ ,రైతులకు,పారిశ్రామికవేత్తలకు నిరంతర విద్యుత్ అలవాటయ్యింది. కరెంట్ లేదు..రాదు అన్న ఆలోచన లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే. తెలంగాణ ఏర్పడ్డ తరవాత సిఎం కెసిఆర్ కీలక నిర్ణయాలు తీసుకుని నిరంతర విద్యుత్‌కు పెద్దపీట వేశారనే చెప్పాలి. ఇలాంటి నిర్ణయాలతో తెలంగాణ పురోగమనంలో కీలక అడుగులు పడ్డాయి. అందుకే కరెంట్ కోతలు, ధాన్యం కొనుగోళ్లు, సాగు,తాగునీటి సమస్యలను ప్రధానంగా తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాల్లో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. అలాగే ప్రధానంగా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు పాలనా వికేంద్రీకరణలో ఇదో మైలురాయిగా కెసిఆర్ చెబుతున్నారు. జిల్లాలను మారుస్తామని సిఎం రేవంత్ గతంలోనే ప్రకటించారు. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను పాలనా వికేంద్రీకరణలో భాగంగా 33 జిల్లాలో చేశారు. అయితే అడ్డదిడ్డంగా జిల్లాల ఏర్పాటు జరిగిందని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ప్రస్తావించారు. అందుకే కాంగ్రెస్‌పై ఎదురుదాడికి అవసరమైన ఎజెండాను ఎత్తుకున్నారు.
ప్రధానంగా కెసిఆర్ ఇప్పుడు రైతుల ఎజెండాను భుజానకి ఎత్తుకున్నారు. రైతుబంధుతో పాపులర్ అయిన కెసిఆర్ ఇప్పుడు వారినే నమ్ముకున్నారు. అలాగే వివిధ పథకాల ద్వారా లబ్ది పొందిన వారినే వోటు బ్యాంక్‌గా గ్రహించారు. ఇందులో భాగంగానే భారతదేశంలోనే గొప్ప రైతులు, ధనవంతులైన రైతులు, ధనవంతులైన యాదవులు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణ రాష్ట్రంలోనే అని చెప్పుకునేలా చేశానని అంటున్నారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. దళితబంధు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. దేశంలోనే అతి ఎక్కువ సమయంలో ఆర్థికప్రగతి సాధించాం.. అతికొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించుకున్నాం. మిషన్ భగీరథ..కాళేశ్వరం ప్రాజెక్ట్.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం..ఇవన్నీ కూడా కెసిఆర్ కలల ప్రాజెక్టులు. నీళ్లు,నిధులు నియామకాలు అన్న స్లోగన్‌తో ఉద్యమాన్ని గమ్యం చేరేలా చేసి…అధికారం చేపట్టిన తరవాత ఇలాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లామని చెబుతున్నారు.
ప్రస్తుతం అమలవుతున్న వాటిలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ముఖ్యమైనవి. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేక చతికిల పడిరదని అన్నారు. ఇక రెండు పడకగదుల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నట్లుగా నాటి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎక్కడా లబ్దిదారులకు అవి అందలేదు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో గతంలో మునుపెన్నడూ జరగని పనులు జరిగాయని ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందజేసే మిషన్ భగీరథ, చెరువులను పునరుద్ధరించి వాటిలో పుష్కలంగా నీళ్లు ఉండేటట్టు చూసే మిషన్ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్లు, 36లక్షల మందికి ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేత వంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టిందని మాజీమంత్రిలు కూడా అంటున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లాంటివి పేదలకు వరంగా నిలిచాయని, తులం బంగారం జోడిరచి ఇస్తామన్నా ఇవ్వడం లేదన్నారు. అన్నింటికి మించి హరితహారం కార్యక్రమం తెలంగాణకు పెద్ద అసెట్ అయ్యిందని ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి అన్నారు.
మొక్కల పెంపకం పెద్ద ఉద్యమంగా సాగింది. నిరంతర విద్యుత్,నీటి సరఫరా, ఎరువులు విత్తనాలు అందచేత, పెట్టుబడి సాయం కింద ఎకరాకు 8వేలు అందచేసే కార్యక్రమం, రైతులకు బీమా పథకం..ఇవన్నీ కూడా అద్భుతాలు గానే చూడాలన్నారు. కెజి టూ పిజిలో భాగంగా గురుకులాల ఏర్పాటు కూడా ఓ విప్లవాత్మకమైన మలుపుగా చెప్పుకోవాలి. పేదలకు ఉచిత విద్యను అందించే క్రమంలో ఇదో అపురూపమైన ఘట్టంగా చెప్పుకోవాలి. చేపట్టిన పనిని ఆఖరి వరకు వదలకుండా చేసే మొండి ధైర్యం కెసిఆర్‌దని నిరూపించారని అన్నారు. తను చేపట్టిన పని విజయవంతంగా పూర్తి చేయడమే తప్ప వెనుదిరిగి చూడని ధృడచిత్తం కెసిఆర్‌కే సొంతం. ఈ ఎంపి ఎన్నికల్లో కనీసం 12సీట్లు గెలవాలి దిల్లీలో పాగా వేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.
`ప్రజాతంత్ర డెస్క్





