- కేసీఆర్ కిట్ల తరహాలో అందించేందుకు సన్నాహాలు
- దీర్ఘకాలిక రోగాలు పెరగడంతో సర్కారు నిర్ణయం
- నెలకు సరిపడా మందులు అందించేలా ప్రణాళిక
- జిల్లాలో షుగర్, బిపి, క్యాన్సర్ బాధితులకు ఎంతో ఊరట
- త్వరలోనే సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావుచే ఎన్సీడీ కిట్ల పంపిణీ
సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : షుగర్, బిపి, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక మెడికల్ కిట్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు ఆర్థిక భారాన్ని, దవాఖానల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించేలా వైద్యశాఖ సరికొత్త ఆలోచన చేసింది. ప్రసవ సమయంలో మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్ల పథకానికి ఇప్పటికే అద్భుత స్పందన వొచ్చింది. ఇలాంటి కిట్లనే దీర్ఘకాలిక రోగులకు పంపిణీ చేయాలని సిఎం కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా సిద్ధిపేట జిల్లాలో షుగర్, బిపి వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి త్వరలోనే నాన్ కమ్యూనబుల్ డిసీజెస్-ఎన్సీడీ కిట్లు ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా అసంక్రమిత వ్యాధులను గుర్తించడంలో భాగంగా జిల్లాలోని సిహెచ్‌సి, యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల వారీగా 35 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బిపి వ్యాధితో 61వేల 866 మంది, షుగర్‌తో 27వేల 238 మంది, క్యాన్సర్‌తో 449 మంది బాధపడుతున్నట్లు తేలింది. వీరందరికీ దశల వారీగా ఎన్సీడీ కిట్ల రూపంలో షుగర్, బిపి నియంత్రణ మందులు అందించేలా ఈ కిట్లను ప్రత్యేకంగా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్య వర్గాలను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. సమతుల ఆహారం, వ్యాయామం, పొగ తాగరాదు, జంక్ ఫుడ్ తినరాదు, మద్యం సేవించరాదు, యోగా, మంచి నిద్ర వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి ఈ కిట్లలో సవివరంగా పేర్కొన్నది. మరో వైపు షుగర్, బిపి లక్షణాలతో పాటు వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించింది. కిట్లలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రివేళలో వేసుకునే మందులు నెలకు సరిపోయే షుగర్, బిపి మందులను ఉంచి కిట్లను రోగులకు అందించనున్నారు. ‘ఉన్నతమైన జీవనానికై ఆరోగ్యకరమైన అలవాట్లు’ అనే నినాదాన్ని కిట్లపై ప్రచురించారు.
ఒకేసారి నెలకు సరిపడా మందులు…
నాన్ కమ్యూనబుల్ డిసీజ్ కిట్లను కేసీఆర్ కిట్ల తరహా ప్రత్యేక ఆకర్షణతో డిజైన్ చేశారు. ఇందులో మందులతో పాటు, వాటిని వినియోగించే తీరును వివరించే సమాచార పత్రాలు ఉంటాయి. ప్రత్యేకించి ఏఏన్‌ఏం గృహా సందర్శన చేసి రోగికి నేరుగా ఎన్సీడీ కిట్ అందిస్తుంది. ఈ కిట్‌లో ప్రత్యేకించి మూడు రకాల రంగులలో మూడు బ్యాగులు ఉంటాయని, వాటిలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పూటలు షుగర్, బిపి వ్యాధిగ్రస్తులకు ఇచ్చే వివిధ రకాల మందులు వేసుకునే విధానం గురించి ఏఏన్‌ఏం కిట్ అందిస్తూ వివరించి చెబుతుంది. ఒక్కో కిట్‌లో షుగర్, బిపి తదితర రోగాలకు సంబంధించి నెలకు సరిపడా మందులు అందుబాటులో పెడుతూ.. నిరక్షరాస్యులు సైతం తెలుసుకునేలా కిట్ లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి మందులు వేర్వేరుగా ఉంచుతారు. వృద్ధులకు అనుకూలంగా ఉండేలా వీటిని ఒక బ్యాగు రూపంలో అందించనున్నారు.
మానవతా హృదయంతో చేసే గొప్ప కార్యక్రమం ఇది: మంత్రి హరీష్‌రావు
బిపి, షుగర్ పేషంట్స్‌లలో మనోధైర్యం నింపేలా సిఎం కేసీఆర్ ప్రతి నెలా వారికి అవసరమయ్యే మందులు ప్రభుత్వం ఉచితంగా నేరుగా రోగి ఇంటి చెంతకే చేరవేయాలని సహృదయంతో మానవతా హృదయంతో చేసే గొప్ప కార్యక్రమం ఇది చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. రోగులకు ఆర్థిక భారం లేకుండా త్వరలోనే నెలనెలా మందులను కిట్ల రూపంలో అందించేలా సన్నాహాలు జరుగుతున్నాయనీ మంత్రి హరీష్‌రావు వివరించారు.




