- నియోజక వర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్
- అడుగడుగునా రాహుల్ గాంధీకి నీరాజనాలు
- నేడు హైదరాబాద్‌కు ఖర్గే..పాదయాత్రలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు
షాద్‌నగర్, ప్రజాతంత్ర, ఆక్టోబర్ 31 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర 54వ రోజు, రాష్ట్రంలో 6వ రోజు షాద్‌నగర్ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొనడంతో ఉత్సాహంగా కొనసాగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గంలో సోమవారం ఉదయం 6 గంటలకే ప్రారంభం అయిన పాదయాత్ర స్థానిక నియోజకవర్గ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ముందుకు సాగింది. అడుగడుగునా నీరాజనాలతో, కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో నేషనల్ హైవే పాత రోడ్డు నిండిపోయింది. కాంగ్రెస్ సైనికులు వేలాదిగా తరలివచ్చారు. గుజరాత్‌లో వంతెన కూలిన దుర్ఘటనలో మృతులకు నివాళి అర్పించిన అనంతరం ఆయన షాద్‌నగర్‌లో పాదయాత్ర సాగించారు.
అనంతరం షాద్ నగర్ చౌరస్తాలో వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చడంతో పాటు ఆకాశం నిండా బెలూన్లను వదిలారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాల రెపరెపలాడుతుండగా వేలాదిమంది రాహుల్‌కు ముందు, వెనుక నడిచారు. రాహుల్ గాంధీ వెంట స్థానిక ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ, చల్ల వంశీచంద్ రెడ్డి, కీలక నాయకులు రాహుల్ అడుగులో అడిగేసి నడిచారు. లింగారెడ్డి గూడ వద్ద పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు లభించాయి. అదే విధంగా చంద్రాయన గూడ, నందిగామ, కొత్తూరు వద్ద భారీ ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలతో రాహుల్ యాత్ర
రాహుల్ పాదయాత్రలో దాదాపు మూడు కిలోమీటర్లకు పైగా కాంగ్రెస్ శ్రేణులు నిండిపోయారు. పాత హైవే రోడ్డులో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ర్యాలీ ఎవరు కనివిని ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున యాత్ర కొనసాగింది. రేవంత్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు రాహుల్ వెంట నడిచారు. కాంగ్రెస్ సైనికుల కేరింతలు, ఉత్సాహం, ఉల్లాసం అందరినీ ఉత్తేజపరిచింది. రోడ్డు పొడవునా నినాదాలతో హోరెత్తించారు. ప్రతి గ్రామం మలుపుల వద్ద రాహుల్ గాంధీకి అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. రాహుల్ గాంధీని చూడటానికి గ్రామస్తులు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వొచ్చారు. అందరికీ రాహుల్ చేయి ఊపుతూ నమస్కరించారు. మహిళలు పిల్లలు కనిపిస్తే వారిని ఆప్యాయంగా పలకరించారు. కొందరు చిన్నారులను తన వెంటే నడిపించుకుంటూ వెళ్లారు. నందిగామ వద్ద కాసేపు టీ బ్రేక్ ఉండడంతో అక్కడ గిరిజనుల సంప్రదాయ నృత్యాన్ని స్వయంగా వీక్షించారు.
30 వేల మందికి అన్నదానం
షాద్‌నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ సైనికుల కోసం వేలాది మందికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వొచ్చిన వారికి సర్వసదుపాయాలు కల్పించడంతో పాటు దాదాపు 30 వేల మందికి నందిగామ, కొత్తూరు ఇతర ప్రాంతాల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఎంతో పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ వీర్లపల్లి శంకర్ ఒంటిచేత్తో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల పార్టీ శ్రేణులు అభినందించారు. రెండు రోజుల పాటు కార్యక్రమాన్ని స్వయంగా సమీక్షించి వీర్లపల్లి శంకర్ శభాష్ అనిపించుకున్నారు.
కొత్తూరులో సేద తీరిన రాహుల్
షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో రాహుల్ గాంధీ సేద తీరారు. పాదయాత్రకు సంబంధించిన మంది మార్బలంతో పాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి వొచ్చిన కార్యకర్తలు, ప్రజలు అక్కడికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ బసచేసిన ప్రాంతంలో మీడియాతో పాటు అగ్ర నాయకులు తదితర ముఖ్యమైన వ్యక్తులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10 గంటల వరకే కొత్తూరుకు చేరుకున్న రాహుల్ గాంధీ భోజనం విరామం వరకు సేద తీరారు. భోజనాలు పూర్తి చేసుకున్న అనంతరం రెండు గంటలకు మీడియాతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇక నేడు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే రాహుల్ పాద యాత్రలో పాల్గొనడానికి హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.




