సిట్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
విధుల్లో ఉన్న పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల
అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
స్టేషన్ వద్ద తల్లి విజయమ్మ హంగామా
పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తన : ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : లోటస్ పాండ్‌లోని వైఎస్ షర్మిల ఇంటి వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సిట్ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందకు బయలు దేరిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. షర్మిల కారు ఎక్కే సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్‌లపై షర్మిల చేయి చేసుకున్నారు. పోలీసులపై దుర్భాషలాడారు. వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో షర్మిలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సోమవారం సిట్ అధికారులకు మెమొరాండం ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల భావించారు. అందులో భాగంగా ఉదయం 10:30 గంటలకు లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు ఒక్కసారిగా పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకు వెళ్లేందుకు అనుమతిలేదని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే షర్మిల పోలీసుల మాటలను బేఖాతరు చేశారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు. ఒక పార్టీ అధ్యక్షురాలిపట్ల పోలీసుల తీరు సరిగా లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కానిస్టేబుళ్లను పెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆమెను తోసివేసే ప్రయత్నం చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
తన తప్పులేకపోయినా పోలీసులు తనపై ప్రవర్తించిన తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నందుకు షర్మిలపై ఐపీసీ 330, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై వైఎస్సార్టీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు..జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఆమెను కలవడానికి షర్మిల తల్లి విజయమ్మ అక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో.. విజయమ్మ పోలీస్ స్టేషన్ ఎదుటే నిరసన తెలుపుతున్నారు. అనంతరం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన బిడ్డను కలవడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని విజయమ్మ, పోలీసులను నిలదీశారు. అసలు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్లో ఉన్న కుమార్తెను పరామర్శిస్తే తప్పేంటనీ విజయమ్మ పోలీసులను ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తెలంగాణలో లేదా అంటూ ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో ఆమెతోపాటు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు సైతం తరలివచ్చారు.
పోలీసులపై షర్మిల దురుసు ప్రవర్తన : ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు
చట్టవిరుద్ధంగా పోలీసులపై వైఎస్ షర్మిల దాడిని పోలీసులు శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఎస్సై రవీందర్ ఫిర్యాదు మేరకు షర్మిలపై 353, 330 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ అధికారులను కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వొచ్చిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. కారులో వెళ్లేందుకు యత్నించగా…కారును చుట్టుముట్టిన పోలీసులు..ఆమె వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టేస్తూ ముందుకు సాగేందుకు యత్నించారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌ను ముందుకు తోసేశారు. అయినా షర్మిలను మహిళా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిల పోలీసులపై దాడి చేసినట్లు తెలిసిందని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. పర్మిషన్ లేకుండా షర్మిల సిట్ ఆఫీసుకు వెళ్తున్నారని..దాడిపై మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. షర్మిల సచివాలయంకు వెళ్తారని సమాచారం ఉందని సీవీ సీవీ ఆనంద్ తెలిపారు. అందుకే ముందస్తు అప్రమత్తమయ్యామన్నారు. ఎస్సై ఫిర్యాదు ఆధారంగా షర్మిల కేసులో ముందుకెళ్తామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.



