శిశుపాల సంహారం

బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

శిశుపాలుడు కూడా తనను సమర్ధించే వారిని కూడగట్టుకుని యుద్ధానికి సన్నద్దుడయ్యాడు. యజ్ఞం పూర్తయ్యే సమయంలో ఇదేమిటా అనుకుంటున్న సమయంలో భీష్ముడు సింహపరాక్రముడైన వాసుదేవునికే ఈ విషయాన్ని వదిలివేద్దాం అన్నాడు. శిశుపాలుడు భీష్ముని నానామాటలూ అన్నాడు. సంతానహీనుడన్నాడు. ఇలా దుర్భాషలాడుతుండగా వాసు దేవుడు ధనుజాంతక చక్రాన్ని వదిలాడు. అది శిశుపాలుని తలను తెగవేసింది. శిశుపాలుడు మరణించిన తర్వాత, ఆయన పిల్లలు దహనసంస్కారాలు నిర్వర్తించారు. యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తి అయింది. అందరూ ధర్మరాజుకు అభినందనలు తెలియజేశారు!సభాభవనం ఎంతో రమ్యంగావుందని, దుర్యోదనుడూ, శకునీ చూడాలని ఉబలాటపడి, ధుర్యోదనుడు ఒంటరిగానే మయసభ భవనం చూడటానికి వెళ్ళాడు. స్పటిక మణిమయ శిలానిర్మిత స్థలం చూశాడు. దాన్ని సరోవరం అనుకుని పంచె చేత్తో పట్టుకుని నడిచి కాదని తెలిసి కాలు జారిపడ్డాడు. సిగ్గువేసింది. తర్వాత సమతలంగా ప్రదేశం వుంటే దానిమీద నడిచి మరలా జారిపడ్డాడు.

స్పటిక శిలా నిర్మితమైన ద్వారం గుండా ప్రవేశించబోతే తలగడపకు కొట్టుకుంది. అలాగే తెరిచివున్న తలుపులో గుండా ప్రవేశించబోయి పడబోయాడు. ఇలా అవమానాల పాలైన ధుర్యోదనుడు వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో మామ శకుని ధుర్యోదనుడి ముఖంలో దైన్యం చూసి కారణం అడిగాడు. పాండవులు దిగ్విజయ యాత్ర ముగించుకుని రాజసూయయాగం చేసి దేశాధీశుల నుండి కానుకలనందుకోవడం ఆపైన తాను ఎలా అవమానాలపాలైనదీ తల్చుకుంటే బాధగావుందన్నాడు. శకుని బాధపడవద్దని ఉపాయం చెప్పాడు. ధర్మరాజుకు జూదం అంటే చాలా ఇష్టం. మహారాజుని ఒప్పించి, ధర్మరాజుని జూదంలో కూర్చోబెడితే అంతా నీపరం అయ్యేలా చూస్తానన్నాడు. ఆ భారాన్ని కూడా తానే భరించి, మహారాజుని ఒప్పించమన్నాడు ధుర్యోదనుడు. శకుని మహారాజు వద్దకు వెళ్ళి ధుర్యోదనుడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తుందన్న విషయం చెప్పాడు. మహారాజు ధుర్యోదనుని పిలిపించి కారణం అడిగాడు. పాండవుల వైభవం గురించి వివరంగా చెప్పి, అభిమానధనుడైన తనకు ఇంతకన్నా అవమానం ఏం కావాలన్నాడు. యాగం చేసినంతకాలం తృప్తిగా భోజనం చేశారన్న దానికి గుర్తుగా గంటమ్రోగుతూనే వుందనీ, ఆ గంటానాధం విని తన మనస్సుక్షోభించినదనీ చెబుతుంటే, ధృతరాష్ట్రునికి శకుని ధర్మరాజును జూదానికి  ఆహ్వానించమన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *