రాష్ట్రంలో భేషుగ్గా శాంతిభద్రతలు
కుట్రలు చేసేవారిని దూరం పెట్టాలి
అభివృద్ధి చేస్తున్న కెసిఆర్‌నే ఆశీర్వదించాలి
విఎస్‌టి స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. పొరపాటు చేస్తే వందేండ్లు వెనక్కి వెళ్తుందన్నారు. కొందరు హైదరాబాద్‌లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని, పనిచేస్తున్న బిఆర్‌ఎస్‌ను ఆదరించాలని అన్నారు.
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి విఎస్‌టి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. తెలంగాణ వొచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఇది 36వ ఫ్లై ఓవరని చెప్పారు. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. అదే విధంగా స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. 2001 నుంచి నాయిని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నిలిచారని వెల్లడించారు. దశాబ్దాలుగా కార్మిక నాయకుడిగా, రాష్ట్ర తొలి హోమ్ మంత్రిగా పనిచేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. అందుకే ఆయన పేరు బ్రిడ్జికి పెట్టాలని నిర్ణయించామని అన్నారు. ఇందిరా పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని వెల్లడించారు. లోయర్ ట్యాంక్‌బండ్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడిందని చెప్పారు.
కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా మళ్లీ కూర్చోబెట్టాలన్నారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని వెల్లడించారు. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడిందని కెటిఆర్ అన్నారు. రూ.450 కోట్లతో ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ కే.కేశవరావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠ గోపాల్ పాల్గొన్నారు.స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్‌లింగంపల్లి వీఎస్టీ జంక్షన్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గిపోనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గిపోతుంది. ఇక స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం కార్యక్రమం వద్ద బీఆర్‌ఎస్ నేతల హంగామా అంతా ఇంతా కాదు. ఇందిరాపార్క్ వీఎస్టీ మార్గంలో అధికారపార్టీ నేతలు పోటాపోటీగా ప్లెక్సీల ఏర్పాటు చేశారు. పరస్పర నినాదాలతో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్‌ఎస్ శ్రీనివాస్ బల ప్రదర్శనకు దిగారు.



