వోట్ల కోసమే ఎస్సీ వర్గీకరణపై కమిటీ

షెడ్యూల్‌ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తాజాగా ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో  అయిదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారని కేంద్రం జీ.ఓ కూడా జారీ చేసింది. ఈ కమిటి తొలి సమావేశ తేదీని కూడా ప్రకటించింది. ఈ నెల 23న హోం, న్యాయ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉండే  కమిటీ సమావేశం అవుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసిందని ఆ పక్షాలు ఆరోపిస్తున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లబ్ది పొందేందుకే కేంద్రం ఈ ప్రకటన చేసిందని ముఖ్యంగా కాంగ్రెస్‌ దుయ్యపడుతోంది. ఈ ఎన్నికల్లో దళితుల వోట్ల్ల్లను దండుకోవడానికే బిజెపి ఈ ఎత్తుగడను వేసిందంటున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రక్రియనే చేపట్టింది కాని, దురదృష్టవశాత్తు బిజెపి అధికారంలోకి రాలేకపోయిందన్న విమర్శకూడా లేకపోలేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం తామేనని చెప్పుకున్న బిజెపి ఎన్నికల సమయానికి కాంగ్రెస్‌కన్నా వెనుకబడిరది. దీంతో తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న బిసి వోట్ల్ల్లను దండుకునేందుకు బిసి సిఎం అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతాపార్టీని గెలిపిస్తే తప్పకుండా వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. ఒక విధంగా ఆ ప్రకటన సంచలనాన్ని లేపింది. దీంతో పోటీలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ సాధ్యమైనంతగా బిసీ వర్గాలవారికి టికట్లు ఇచ్చేవిధంగా చొరవ చూపాయి. అంతటితో ఆగకుండా నిజంగానే బిజెపి గెలిస్తే కాబోయే సిఎం ఎవరన్న విషయంపైన ఆ పార్టీలో చర్చోపచర్చలు  జరిగాయి కూడా. ఒకరిద్దరు తామే కాబోయే సిఎం అని ప్రకటనలు కూడా చేశారు. అయితే అదే క్రమంలో ఎస్సీ వోట్ల్ల్లను  కూడా సాధించుకునే ఎత్తుగడ వేసింది బిజెపి.

తెలంగాణ శాసనససభ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని పరేడ్‌  గ్రౌండ్‌లో దండోరా ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నవంబర్‌ 11న ఏర్పాటు చేసిన మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. వేదిక మీద మందకృష్ణ మాదిగను ఆలింగనం చేసుకోవడం, ఇంతకాలానికి తన కల సాకారం కాబోతున్నదన్న ఆనందాశ్రులతో ఉన్న మందకృష్ణను ఆనునయించడం చూసిన వారికెవరికైనా ఆ ఎన్నికల్లో ఎస్సీల వోట్లన్నీ బిజెపికే అనిపించకమానదు. ఎస్సీల వర్గీకరణపై మందకృష్ణ మాదిగ గత 25 ఏళ్ళపాటు నిర్వరామంగా చేస్తున్న ప్రయత్నాలకు ఆనాడు ముగింపు లభిస్తుందని అందరూ ఎదురు చూశారు. కాని, వర్గీకరణపై ఒక కమిటీని వేయనున్నట్లు ఆరోజున మోదీ ప్రకటించారు. వర్గీకరణకు సంబంధించిన  కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో కొనసాగుతుండడమే అందుకు కారణమై ఉంటుందనుకున్నారు. వాస్తవంగా ఎస్సీల వర్గీకరణ అంశం 1994 నుండీ నలుగుతున్నది. ఆ సంవత్సరం జూలై ఏడున మందకృష్ణ మాదిగ సారధిగా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌) ఏర్పడిరది. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న తమ కులానికి విద్య, ఉపాధి రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, ఇంతవరకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లలో మాలలకే లాభం జరుగుతున్నదన్నది వారి ప్రధాన డిమాండ్‌.  ఎంఆర్‌పిఎస్‌ ఏర్పడిననాటి నుండి నాటి కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మొదలు రాష్ట్రంలో టిడిపి, తెలంగాణ ప్రభుత్వాల వరకు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది ఎంఆర్‌పిఎస్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ విషయమై నాటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కూడా. అయితే గత తొమ్మిదిన్నర ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదన్న అపవాద ఉంది.

నిజంగానే ఎస్సీ వర్గీకరణ విషయంలో బిజెపికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు వర్గీకరణకు ఎందుకు చట్టబద్దత కల్పించలేదని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తున్నది. వాస్తవానికి 2014 ఎన్నికల వేళ బిజెపి తన మానిఫెస్టోలో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ ఇంతకాలం మౌనం వహించి ఇప్పుడు దాని పరిశీలన కోసం కమిటీని ప్రకటించడం వెనుక అ వర్గాల వారి  వోట్లను రానున్న లోకసభలో దండుకునేందుకేనని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా విమర్శిస్తున్నది. అంతేకాదు ప్రతీ ఎన్నికల్లో బిజెపికి హిందూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లాభపడాలని చూస్తున్నదని. అందులో భాగంగానే ఇప్పుడ లోకసభ ఎన్నికలకు ముందు రామ విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని మొదలుపెట్టిందంటున్నారు. మందిరం పూర్తికాకుండానే హడావిడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలోనే బిజెపి ఎత్తుగడ ఏమిటో అర్థమవుతున్నదని కాంగ్రెస్‌ ధ్వజమెత్తుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *