ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో వోటు వేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. సికింద్రాబాద్ మరియు హైదరాబాదులోని నియోజకవర్గాల్లో యాభై శాతం వోటింగ్ కూడా నమోదు కాలేదు. మల్కాజిగిరి, చేవెళ్లలో మాత్రం 50 శాతం దాటింది. గ్రేటర్ సిటీ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్లలో ఏ ఎన్నిక జరిగిన పోలింగ్ శాతం తగ్గుతూనే వస్తున్నది. ప్రతిసారి ఎన్నికలకు ముందే పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా సిటీ వోఓటర్లు వోటింగ్ పై ఆసక్తి చూపడం లేదు. సిటీలో వోటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల తోటి, జిల్లా అధికారులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసి పోలింగ్ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేగాకుండా ఎన్నికల సంఘం ప్రైవేటు కంపెనీలు, సాఫ్ట్ వేర్ సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలతో చర్చలు జరిపి వారి దగ్గర పని చేసే వారందరూ తప్పక వోటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పడం జరిగింది.
ప్రతి ఒక్కరూ వోటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు, వ్యాపార సంస్థలకు లేబర్ హాలిడేగా ప్రభుత్వం సెలవు ప్రకటించడం జరిగింది.ఈ సారి రాష్ట్రంలో తొలిసారి వోటర్లు (18 ఏండ్లు నిండినవారు)భారీ ఎత్తున వోటు కోసం నమోదు చేసుకున్నారు. నూతన వోటర్ల నమోదులో తెలంగాణలోనే అధికమని నివేదికలు తెలుపుతున్నవి. దీంతో ఈసారి పోలింగ్ శాతం గతం కంటే పెరుగుతుందని ఆశించిన ఆ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. నిజానికి సిటీ పరిధిలో విద్యావంతులైన వోటర్లే ఎక్కువగా ఉంటారు. మనం ఒక్కరం వోటు వేయకపోతే జరిగేదేముంది అన్నట్టుగా వీరు పోలింగ్ రోజున బూత్ లకు రావడం లేదు. వారంతపు సెలవులతో పాటు వోటింగ్ రోజు కూడా సెలవు రోజుగా భావించి విహారయాత్రలకు వెళ్లడం లాంటివి పెట్టుకోవడం చేస్తున్నారు. తల రాతలను నిర్దేశించే వోటు హక్కు వినియోగంలో పౌరుల నిర్లిప్తత ప్రజాస్వామ్య మనుగడకే అత్యంత ప్రమాదకరమైనది.
వోటర్లలో అనాసక్తతతో పాటు ఇంకా చాలా కారణాలు వోటింగ్ శాతం తగ్గడానికి కారణం అవుతున్నాయి. మల్కాజిగిరి, మేడ్చల్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏపీ ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరంతా తమ సొంత రాష్ట్రంలోనే వోటు వేసేందుకు వెళ్లడంతో కూడా ఆయా సెగ్మెంట్లలో వోటింగ్ శాతం గణనీయంగా తగ్గిందని చెప్పవచ్చు. వీరంతా సెటిలర్స్ కావడంతో వారికి ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వోట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో వీరంతా ఏపీలో వోటు వేయడానికి ఆసక్తి చూపారని చెప్పవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ పరిధిలోని బహదూర్ పుర, చంద్రయనగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, మలక్ పేట, యాకత్ పురాలలో చాలా తక్కువ శాతం పోలింగ్ నమోదయింది. ఎన్ని వోటర్ చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన పాతబస్తీ వోటర్ల తీరులో మార్పు రావడం లేదు. ఇక్కడి వోటర్లు వోటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. వీటన్నిటికీ తోడు వోటరు జాబితాలో గందరగోళం, ఒక కుటుంబంలోని వోట్లు వేర్వేరు బూతులలో ఉండడం. వోటు వేసేందుకు ఎపిక్ కార్డుతో వచ్చిన వోటు లేకపోవడం, పోలింగ్ స్లిప్పులు కొన్ని చోట్ల అందకపోవడం వంటివి కూడా వోటింగ్ శాతం తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు.
ఒక రకంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత వోటర్లలో ఉన్న చైతన్యం సిటీ వోటర్లలో కనిపించడం లేదని చెప్పవచ్చు. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని అటవీ ప్రాంతంలోని పెనుగోలు గుట్టపైన పది గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో 26 మందికి వోటు హక్కు ఉండగా వీరిలో పదిమంది వోటు హక్కు వినియోగించుకోవడానికి కాలినడకన 20 కిలోమీటర్లు వాగులు, వంకలు, గుట్టలు దాటి వాజేడులోని పోలింగ్ కేంద్రానికి వచ్చి వోటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా తీర్మాని మండల లోని కౌటాగాం గ్రామస్తులు వోటు వేసేందుకు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లి వోటు వేసి తిరిగి ఏడు కిలోమీటర్లు నడిచి స్వగ్రామానికి చేరుకున్నారు. వీరంతా వోటు వేయడం తమ సామాజిక బాధ్యతగా భావించి వోటు వేశామని చెప్పడం గమనార్హం. మనం వేసే వోటు అయిదు సంవత్సరాల భవిష్యత్తు అనే విషయం మర్చిపోరాదు. ఎన్నికల్లో వోటింగ్ శాతం తగ్గిపోతే భవిష్యత్తులో వోటు తప్పనిసరి చేసే అవకాశం లేకపోలేదు. ఆ దిశగా ఈ మధ్య డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో ‘ప్రజలే ప్రభువులు’ వారికి అధికారాన్ని ఇచ్చేది వోటు హక్కు. దానిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని, వోటు విలువను గురించి మరింత చైతన్యం తీసుకు వచ్చే దిశలో వోటరు అవగాహన కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ పకడ్బందీగా నిర్వహించాలి. పోలింగ్ సెంటర్లు వోటర్లకు అందుబాటులో ఉండేలా చూడాలి. పోలింగ్ సెంటర్ లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ముఖ్యంగా ఎన్నికలు వారాంతపు సెలవుల తర్వాత కాకుండా పని దినాల్లో వారం మధ్యలో పెడితే యువత పోలింగ్ రోజు వోటుకు వచ్చే అవకాశం కలదు. దానితో పాటుగా ప్రతి మనిషికి ఆధార్ ఏ విధంగా ఉందో వోటు కూడా దేశం మొత్తంలో ఎక్కడైనా సరే ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలి. చాలామందికి వలస వచ్చిన సిటీలో వోట్లు ఉండడమే కాకుండా గ్రామాల్లో కూడా వోట్లు ఉండడంతో గ్రామాల్లోనే వోటు వేయడానికి ఆసక్తి చూపుతూ ఎన్నికల సమయంలో స్వగ్రామాలకు వెళ్ళుచున్నారు. స్వస్థలంలో వోట్లు వేస్తేనే అక్కడ ఇస్తున్న సంక్షేమ పథకాలు పోకుండా ఉంటాయనే భావనతో స్వస్థలాల్లో కూడా వోటును నమోదు చేయించుకుం టున్నారు. ఇది కూడా నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి కారణం అవుతున్నది. ‘‘నా ఒక్క వోటు ఫలితాలను మారుస్తుందా’’ అని తేలిగ్గా తీసుకోకుండా ప్రజాస్వామ్యంలో వోటు హక్కు అనేది ఒక ఆయుధంగా భావించి సురక్షితమైన సమాజం కొరకు ప్రతి ఒక్కరు వోటు వేయాలి’’.
పుల్లూరు వేణుగోపాల్
9701047002





