మరో ఇరవై ఐదేళ్లలో పూర్తిస్థాయిలో దేశాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దిల్ల్లీలోని ఎర్రకోటపై నుంచి తన సంకల్పాన్ని ప్రకటించారు. ఏ దేశానికైనా లక్ష్యం ఉండాల్సిందే. లక్ష్యం మేరకు ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే అందుకు తగ్గట్లుగా వ్యూహాలు ఉండాల్సిందే. ఆ లక్ష్యాలు ఏ మేరకు సాకారం అయ్యా యన్నదే ముఖ్యం. ఎవరైనా ఏదైనా విజయం సాధించారంటే గతాన్ని చూస్తారు. గతంలో ఏం చేశారన్నదే ప్రాతిపదికగా ముందుకు సాగాలి. ఈ ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ ఏమేం చేశారన్నది ముఖ్యం. ముఖ్యంగా ప్రజలు ఏ మేరకు బాగుపడ్డారన్నదే ప్రాతిపదికగా తీసుకోవాలి. దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్ అన్న మన గురజాడ సూక్తి ఎప్పటికీ ఆదర్శమైన నీతవాక్యం. కానీ మన పాలకులు ప్రజలను పక్కన పెట్టి పథకాలతో కుస్తీ పడుతున్నారు. కేవలం ఎన్నికల కోసమే పథకాలు ప్రవేశ పెట్టి, ప్రజలను మభ్యపెట్టి పాలన సాగిస్తే మరో 75 ఏళ్లయినా మనం పురోగమించలేం. మానవ వనరులను ఉపయోగించు కుని ముందుకు సాగాల్సి ఉన్నా..130 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో వారికి తగ్గట్లుగా మౌళిక సదుపా యాలు కల్పించలేకపోయాం. నేటికీ విద్యుత్, మంచినీరు లేని గ్రామాలు అనేకం.
ఇళ్ల సంగతి సరేసరి. స్వఛ్చభారత్ ప్రచారం జరిగినంతగా మరుగుదొడ్ల నిర్మాణాలు జరగలేదు. ప్రజలు తమ కొనుగోలు శక్తిని కోల్పోయారు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట లేకుండా..పథకాల పేరుతో ప్రజలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలను ఏమనాలి. నిజానికి ముందుగా ప్రజలకు సంక్షేమం కన్నా…బతకగలిగేలా ప్రణాళికలు సిద్దం కావాలి. గ్రామాల వారీగా ప్రణాళికలు సిద్దం కావాలి. ప్రజలు కనీస వసతులు కల్పించుకునే అవకాశం ఇవ్వాలి. ఏది కొనాలన్నా అందుబాటులో లేదు. జిఎస్టీ వాయింపులతో ప్రజలు నానాయాతన పడుతున్నారు. ఇవన్నీ గమనించకుండా, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా భవిష్యత్ ప్రణాళిక రచించడం ప్రజలను మోసం చేయడం తప్ప మరోటి కాదు. గత ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలతో పాటు..వైఫల్యాలపై ముందుగా చర్చ సాగాలి. అలా చెప్పకుండా రానున్న రోజుల్లో మరింత ప్రగతిని సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పడంలో అర్థం లేదు. ముందు ప్రజలు బతకగలిగే పరిస్థితులు తీసుకుని రావాలి.
ఆకలితో ఉన్న వాడికి ముందు ముద్ద పెట్టండని చెప్పిన స్వామి వివేకానందుడి సూక్తిని ఆదర్శరంగా తీసుకుని ప్రజలు బతకగలిగే పరిస్థితులను సృష్టించాలి. వారికి ఉచితంగా ఏ ఇవ్వాల్సిన అసవరం లేదు. బతక డానికి అవకాశాలు కల్పించాలి. అప్పుడే 2047లో జరిగే శతాబ్ది స్వాతంత్య్ర ఉత్సవాల నాటికి దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని గుర్తించాలి. ఇకపోతే మరో 25 ఏళ్ల వరకు ఇప్పుడున్న వారిలో పావు వంతు ఉండకపోవచ్చు. వచ్చే 25 ఏళ్ల కోసం పంచసూత్రాలను ప్రకటించి… వీటిని ప్రధాని మోడీ ’పంచ ప్రాణ్’గా అభివర్ణించారు. వీటిని అమలు చేయడం ద్వారా దేశం ముందుకు పోతుందన్నారు. దేశాభి వృద్ధికి అవినీతి, బంధుప్రీతి పెద్ద సవాళ్లుగా మారాయని ప్రకటించారు. నిజానికి రాజకీయ అవినీతిని మించిన అవినీతి దేశంలో మరోటి ఉండదు. కాబట్టి మరో రెండేళ్ల పదవీకాలంలో రాజకీయ అవినీతికి మోడీ సంకల్పం తీసుకోవాలి. ఎందకంటే దేశరాజకీయాల్లో అవినీతి, బంధుప్రీతి రెండు పెద్ద సవాళ్లను ఎదుర్కొం టోంది. అవినీతి బంధుప్రీతిపై ప్రముఖ కవి శ్రీశ్రీ తెలుగు పాటలో 60 ఏళ్ల క్రితమే ప్రస్తావించారు. వీటిని సకాలంలో పరిష్కరించకపోతే, అవి మరింత తీవ్రంగా మారుతాయని ఆనాడే తన పాట రూపంలో హెచ్చరించారు. అవినీతికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటం నిర్ణయాత్మక దశలోకి ప్రవేశిస్తోందని చెప్పిన మోదీ•…అవినీతితో బ్యాంకులను ముంచిన వారి గురించి చెప్పాలి. ఎందరు పెద్దలు బ్యాంకులకు ఎగనామం పెట్టారో వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయ లేక పోతున్నారో చెప్పాలి. బ్యాంకులను ముంచిన వారి జాబితాను బయటపెట్టి వారి భరతం పట్టండి. రాజకీయ అవినీతిని ముందుగా తన పార్టీ నుంచే ప్రారంభించాలి. పెద్దపెద్ద వాళ్లు కూడా తప్పించుకోలేరని చెప్పిన ప్రధాని ముందుగా ఆ పనిచేసి చిత్తశుద్దిని చాటుకోవాలి. బంధుప్రీతి గురించి తాను మాట్లాడినప్పుడు, రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతు న్నానని అనుకుంటారని అన్నారు.
దురదృష్టవశాత్తూ, రాజకీయ రంగంలోని ఆ దుర్మార్గం దేశంలోని అనేక సంస్థలకు వ్యాపించిందన్నారు. దేశాన్ని వంశపారంపర్య రాజకీయాల నుండి విముక్తం చేయాలని, ప్రతిభ ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలని చేసిన వ్యాఖ్యలను ప్రజలంతా స్వాగతిస్తున్నారు. రాజకీయ అవినీతిని, వారసత్వ రాజకీయాలను తుదముట్టించాల్సిందే. అలాగే ఏళ్లతరబడి చట్టసభల్లో పాతుకుపోకుండా చట్టం చేయాలి. పేదలకు, అణగారిన వర్గాలకు పాలించే హక్కు రావాలి. అందుకు అమెరికా తరహాలో నిర్ణీత కాల వ్యవధి విధించాలి. ఎమ్మెల్యేలు, ఎంపిలు రెండు టర్మ్‌లకు మించి ఎన్నిక కాకుండా నిరోధించే చట్టం తీసుకుని రావాలి. దేశంలోని ప్రతిభావంతులు, అర్హులకే అవకాశాలు దక్కాలని, మహిళలకు మరిన్ని అవకాశాలు దక్కాలని అంటున్న ప్రధాని మోదీ• ముందుగా మహిళలకు రాజకీయంగా రావాల్సిన రిజర్వేషన్లు వచ్చేలా చేయాలి. చట్టసభల్లో వారికి పెద్దపీట వేయడం ద్వారా మోదీ• తన ఆచరణను ప్రారంభించాలి. వచ్చే 25 ఏళ్ల నాటికి శతాబ్ది ఉత్సవాలను అభివృద్దిన భారత్‌గా ఆవిష్కరించాలన్న సంకల్పానికి అనుగుణంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవాలి. తనకున్న ఈ రెండేళ్ల పదవీ కాలాన్ని అందుకు ప్రాతిపదికగా చేసుకుని కార్యక్రమాలను చేపడితేనే ప్రజలు విశ్వసిస్తారు.
అందుకు అనుగుణంగా జాతి సంపద, ఐక్యతను కాపాడుతూ వచ్చే 25ఏళ్లలో భారత్‌ను సమున్నత దేశంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నామన్న విశ్వాసం కల్పించాలి. ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లపై చర్చించాలి. ప్రజల సమస్యలపై దేశంలో పెద్ద ఎత్తున చర్చ చేయాలి. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపైనా చర్చించాలి. పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోవాలి. పార్లమెంటులో చర్చలకు అవకాశం ఇవ్వాలి. ధరల పెరుగుదల, నిరుద్యోగం,ఆహారాధాన్యాల అందుబాటు, మంచినీరు, ఆహారం,విద్యుత, రోడ్లు వంటి మౌళిక సదుపాయాలపై చర్చించకుండా లక్ష్యాన్ని చేరుకోలేం. పెద్ద సంకల్పాలతో ముందుకు కదలాలంటే ముందుగా చిన్నచిన్న సమస్యలను పరిష్కరించు కోవాలి. అప్పుడే స్వాతంత్య ్రశతాబ్ది ఉత్సవాల నాటికి ’భారత్ అభివృద్ధి చెందిన దేశ’మనే కల సాకారం కాగలదు.లక్ష్యం ప్రకటించిన మోదీ .. చిత్తశుద్దిని కూడా ప్రకటించి ముందుకు సాగితేనే ..ప్రజలు విశ్వసిస్తారు.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్




