వైభవోపేతంగా రాములోరికి పట్టాభిషేకం

  • గోదావరి జలాలతో భద్రాద్రి స్వామివారికి అభిషేకం
  • పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌

భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : భద్రాచలంలోని కల్యాణ రామునికి గురువారం నాడు మహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి స్వర్ణ కిరీటధారణ గావించా రు. అభిజిత్‌ లగ్నంలో కల్యాణం జరుపు కున్న శ్రీరాముడు కల్యాణం జరుపుకున్న మండపంలోనే గురువారం పుష్యమి పర్వదినాన పట్టాభిషిక్తుడయ్యాడు. స్వామి వారికి కల్యాణ తంతును భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించగా..గురువారం పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపారు.

ముందుగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మూర్తుల ను అందంగా అలంకరించిన పల్లకిలో మంగళ వాయిద్యాలు, మేళతాలా లతో కోలాటాల మధ్య మిధిలా మండపం వేదిక వద్దకు తీసుకువచ్చారు. ముందుగా విశ్వక్సేనపూజ, పుణ్యాహ వచనం, కళవా హన, మండపారాధన నిర్వహిం చారు. ముందుగానే అర్చకులు బిందెలతో తీసుకు ని వొచ్చిన పవిత్ర గోదావరి నదీ జలాలతో రామచంద్రుని పాదాలకు స్నపనం నిర్వ హించారు. అదే విధంగా అష్టదిక్పాలకులకు, త్రిమూర్తులను ఆవాహన చేశారు. అనంతరం శ్రీరామపట్టాభిషేక మంత్ర సంపుటిత అష్టోత్తర శత నామార్చన వైభవంగా నిర్వహించారు.

image.png

ఈ సందర్భంగా శ్రీరామపట్టాభిషేక విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. అభిజిత్‌ లగ్నంలో సమస్త నదీజలాలతో ప్రోక్షణ నిర్వహించారు. అదే విధంగా వేదపండితుల వేదమంత్రాల మధ్య రామయ్యకు లాంచనాల్లో భాగంగా స్వామివారి పట్టాభిషేక ఆభరణాలను ఒక్కొక్కటి భక్తులకు చూపిస్తూ అలంకరించారు. ముందుగా శ్రీరామపాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణచత్రం, చామరం, ముత్యాల హారాన్ని సీతమ్మవారికి సమర్పించగా తన మెడలో ఉన్న హారాన్ని సీతమ్మ వారు ఆంజనేయుడికి సమర్పించినట్లు అర్చకులు చెబుతారు.

భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, శ్రీరామమాడ, చింతాకు పతకాన్ని స్వామివారికి సమర్పించారు. అనంతరం రామయ్యకు పట్టాబిషేకాన్ని పురస్కరించుకుని రాజమకుటంను ధరింపచేశారు. రాష్ట్ర గవరర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. తర్వాత స్వామివారికి చతుర్వేదపారాయణం నిర్వహించారు. నదీజలాలతో స్వామివారికి ప్రోక్షణ చేసిన అనంతరం భక్తులపై మహాకుంభ తీర్థాన్ని ప్రోక్షణం గావించారు. అనంతరం హనుమంతునికి ముత్యాల దండను బహుకరించారు. అష్టోత్తర శతహారతి ఇవ్వడంతో మహాపట్టాభిషేక ఘట్టం ముగిసింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రియాంక అలా, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్‌జైన్‌, ఏఎస్‌పి పరితోస్‌పంకజ్‌, దేవస్థానం ఇఓ ఎల్‌ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *