వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎవరు?

“‌రాష్ట్రంలో10 ప్రభుత్వ,23 ప్రైవేటు మెడికల్‌ ‌కాలేజీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గవర్నమెంట్‌ ‌బోధనా హాస్పిటల్స్ ‌లో 30 నుంచి 40 శాతం అధ్యాపకులు కొరతగా ఉన్నారు. ప్రైవేట్‌ ‌కాలేజీలో ఈ పరిస్థితి ఇంకాస్త తీవ్రంగానే ఉంది. నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌మార్గదర్శకాల ప్రకారం 100 ఎంబిబిఎస్‌ ‌సీట్లతో కాలేజీ ప్రారంభించాలంటే 104 మంది అధ్యాపకులు ఉండాలి, 150 సీట్లు అయితే నూట పదహారు మంది, 200 సీట్లు అయితే 142 మంది, 250 సీట్లు ఉంటే 159 మంది ప్రొఫెసర్లు ఉండాలి.”

కొరోనా మహమ్మారి సంక్షోభంలో అనితర సాధ్య సేవలు అందించి మానవాళి మనుగడకు అత్యంత కృషి సలిపిన వారు డాక్టర్లు. ఆ డాక్టర్లు డాక్టర్‌ ‌గా స్థిరపడాలంటే జీవితమంతా కష్టపడాలి. విద్యార్థి జీవితంలో సమయాన్ని వృధా చేయకుండా నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శ్రమించి లక్షలాదిమంది రాసే పోటీ పరీక్షలలో ఉన్నత ర్యాంకులు సాధించిన వారు మాత్రమే వైద్యవిద్యను అభ్యసించడానికి అర్హత సాధిస్తారు… జీవితంలో క్షణం తీరిక ఉండదు అని ,నిత్యం ఓర్పు సహనంతో సేవలు అందించాలని తెలిసి అందుకు సిద్ధపడి సమాజ బాగోగుల కోసం సేవా దృక్పథం కలిగిన వారే డాక్టర్‌ ‌గా స్థిర పడాలని ముందుకు వస్తారు. అటువంటి వారికి సమాజం, ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలు అన్ని,..అన్ని విధాల సహకరించి సక్రమంగా పనిచేసి ఎలాంటి కష్టనష్టాలు లేకుండా వైద్య విద్య అభ్యసించుటకు సహకరించాలి.. కానీ నేడు జాతీయ వైద్య విద్య విధానం, జాతీయ మెడికల్‌ ‌కమిషన్‌, ‌కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య విశ్వ విద్యాలయాలు సక్రమంగా తమ బాధ్యతలను నిర్వర్తించడం పోవడంతో వైద్య విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల 2021 -22 సంబంధించి 450 ఎం బి బి ఎస్‌ , 70 ‌పిజి సీట్లను నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌రద్దు చేసింది. లక్షలాది రూపాయలు చెల్లించి నెల క్రితమే చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. మూడు ప్రైవేట్‌ ‌కాలేజీలో మౌలిక సదుపాయాలు సరిగా లేవని, అధ్యాపకులు అవసరం మేరకు నియమించలేదని, ల్యాబొరేటరీ లు సరిపడ లేవని తదితర కారణాలతో సీట్ల ను రద్దు చేసినట్టు నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌ప్రకటించింది. వైద్య విద్యపై ఆసక్తితో ప్రవేట్‌ ‌కాలేజీ లైన కన్వీనర్‌ ‌కోటా, బి కేటగిరి మరియు ఎన్‌ఆర్‌ఐ ‌కోటా లో లక్షల రూపాయలు చెల్లించి అడ్మిషన్‌ ‌పొంది నెలరోజులుగా రోజు తరగతులకు హాజరవుతున్న క్రమంలో నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌సంచలన నిర్ణయం విద్యార్థులను కంగు తినిపించింది. 2021-22 వైద్య విద్యా సంవత్సరానికి గత నవంబర్‌ ‌లో అడ్మిషన్లకు సంబంధించి ఆయా కాలేజీలకు అనుమతి ఇచ్చి, కౌన్సెలింగ్‌ ‌పూర్తి అయిన తర్వాత నెల రోజులకు మౌలిక వసతులు కొరవడి నాయని అడ్మిషన్లను రద్దు చేయడం ఆశ్చర్యకరం….

రాష్ట్రంలో10 ప్రభుత్వ,23 ప్రైవేటు మెడికల్‌ ‌కాలేజీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గవర్నమెంట్‌ ‌బోధనా హాస్పిటల్స్ ‌లో 30 నుంచి 40 శాతం అధ్యాపకులు కొరతగా ఉన్నారు. ప్రైవేట్‌ ‌కాలేజీలో ఈ పరిస్థితి ఇంకాస్త తీవ్రంగానే ఉంది. నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌మార్గదర్శకాల ప్రకారం 100 ఎంబిబిఎస్‌ ‌సీట్లతో కాలేజీ ప్రారంభించాలంటే 104 మంది అధ్యాపకులు ఉండాలి, 150 సీట్లు అయితే నూట పదహారు మంది, 200 సీట్లు అయితే 142 మంది, 250 సీట్లు ఉంటే 159 మంది ప్రొఫెసర్లు ఉండాలి. వీటికి అదనంగా ఒక్కో కాలేజీలో 32 మంది ట్యూటర్లు , 35 మంది సీనియర్‌ ‌రెసిడెంట్‌ ‌వైద్యులు అవసరమని నిబంధనలో చెబుతున్నాయి. వైద్య విద్య కళాశాలలో మొత్తం 22 విభాగాలు ఉంటాయి.., అందులో నాన్‌ ‌క్లినికల్‌ ‌సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫి•జియాలజీ మరియు ఫోరెన్సిక్‌ ‌సైన్సెస్‌ ‌విభాగాల్లో, క్లినికల్‌ ‌విభాగంలో రేడియాలజీ, డెర్మటాలజీ ప్రొఫెసర్ల కొరత ఎక్కువగా ఉంది. దీంతో చాలా కాలేజీలలో శాశ్వత ప్రాతిపాదికన 40 శాతం మంది నియమించుకుని, మిగిలిన వారినందరినీ తనిఖీలకు వచ్చినపుడు బయట నుండి తీసుకొచ్చి నిర్వహించడం వల్ల అకస్మాత్తుగా తనిఖీలు జరిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, సరిపోను అధ్యాపకులనియామకం చేపట్టకపోవడం కాలేజీ యాజమాన్యాలకు తప్పయితే, వాటిని కౌన్సిలింగ్‌ అనుమతించి అడ్మిషన్లు కేటాయించడం ప్రభుత్వ, యూనివర్సిటీ అధికారుల తప్పిదం.. కాగ అనుమతించే ముందే అన్ని విషయాలను సక్రమంగా పరిశీలించి అన్ని వసతులు, అధ్యాపక నియామకాలు చేపట్టిన తర్వాత అనుమతి ఇవ్వాల్సిన నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌ప్రవేశాలు జరిగి నెల రోజులకు రద్దు చేయడం ఇబ్బందికరం.

నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌, ‌రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ మరియు కాలేజీ యాజమాన్యాల అసమర్థ విధానాల వల్ల వైద్య విద్యార్థులు నలిగిపోతున్నారు,నష్టపోతున్నారు,.. కళాశాలల వినతిని నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌మన్నించక ఉంటే విద్యార్థులను ఇతర కళాశాలలో సర్దుబాటు చేయవలసిన అవసరం ఉంటుంది. గతంలో ఒకసారి అడ్మిషన్లు పూర్తయ్యాక సీట్లు రద్దయితే ఆ కాలేజీ విద్యార్థులను వివిధ కళాశాలలో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపింది. కానీ ఈసారి 450 మంది విద్యార్థులు ఉండడంతో సమస్య జటిలమవుతుంది. నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌మే 19 న రద్దయిన ఎంబీబీఎస్‌ ‌పీజీ మెడికల్‌ ‌విద్యార్థుల మెరిట్‌ ‌మరియు కాలేజీలలో సీట్ల లభ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వారిని సర్దుబాటు చేయాలని స్పష్టం చేసింది. ఇతర మెడికల్‌ ‌కాలేజీలో సీట్ల సర్దుబాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన వాటిఅమలుకు స్పష్టమైన మార్గదర్శకాలను ఇవ్వాల్సి ఉందని కాళోజీ నారాయణరావు హెల్త్ ‌యూనివర్సిటీ వైస్‌ ‌ఛాన్స్లర్‌ ‌వెల్లడించారు..ఎన.ఎం.సీ చెప్పినట్లు ఇతర మెడికల్‌ ‌కాలేజీలో సర్దుబాటు చేయాలని విద్యార్థులు కోరుతుండగా అధికారులు మాత్రం సర్దుబాటు చేయడం కష్టసాధ్యం అంటున్నారు. పైగా ఫీజు తో సహా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తున్నారు.

ఎలాగైనా రద్దయిన కాలేజీలోనే అడ్మిషన్ల కొనసాగించే విధంగా నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్ను ఒప్పించి, మౌలిక, ఫ్యాకల్టీ సదుపాయాలు కల్పించే విధంగా కళాశాలలను ఆదేశిస్తామని అధికారులు ఉవాచ… 450 అడ్మిషన్లు అంటే 3 కాలేజీల సీట్లకు సమానమని, అంత మంది విద్యార్థులను సర్దుబాటు చేయడం అసాధ్యమని, ఏమెడికల్‌ ‌కాలేజీ లోనూ సీట్లు ఖాళీగా లేవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తేల్చాయి. ఇతర కాలేజీలో సర్దుబాటు చేసే పరిస్థితి లేనందున రద్దయిన సీట్లకు సమానంగా సూపర్‌ ‌న్యూమరీ సీట్లను సృష్టించాలని ప్రభుత్వం జాతీయ మెడికల్‌ ‌కమిషన్‌ ‌కు లేఖ రాసింది. అదనపు సీట్లు సృష్టించే అధికారం ప్రభుత్వానికి లేదని, దీనిపై జాతీయ మెడికల్‌ ‌కమిషన్‌ ‌మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇదిలా ఉండగా నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వుల్లో నే సర్దుబాటు విషయం గురించి వివరించామని, ఇటీవల బీహార్లో ఇదే విధంగా సర్దుబాటు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే సర్దుబాటు జరుగుతుందని, సర్దుబాటు చేసిన తర్వాత ఎక్కడ సీట్లు అవసరం ఉన్నదో ఆ మేరకు సీట్లను సృష్టించే అవకాశాన్ని పరిశీలిస్తామని కమిషన్‌ ‌చెబుతుంది. అదేవిధంగా మా కాలేజీ లోనే చదువుతామని కోరాలని విద్యార్థులను రద్దయిన కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ విధంగా మెడికల్‌ ‌కమిషన్‌, ‌రాష్ట్ర ప్రభుత్వం మరియు కాలేజీ యాజమాన్యాల దోబూచులాట లో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయం కానుంది.

ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థులు భవిష్యత్తు భరోసా కోసం ఆందోళనకు దిగారు. లక్షలాది రూపాయలు ఫీజులు గా ప్రైవేటు కాలేజీల్లో చెల్లించడంవల్ల, సీట్ల సర్దుబాటు జరిగితే అవి తిరిగి వస్తాయా? రావా? అని కుమిలి పోతున్నారు., ఎంతో కష్టపడి ర్యాంకు పొంది సీటు సంపాదించి ఆయా కాలేజీలో చేరితే నెలరోజులకే అడ్మిషన్ల రద్దు పేరిట భవిష్యత్తు భగ్నం కావడంతో మానసిక సంక్షోభంలో, విద్యార్థులు ,విద్యార్థుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో కొట్టుమిట్టాడుతున్నారు. వారి ప్రమేయం లేకుండానే, వ్యవస్థ అసమర్థ విధానాల వల్ల తీవ్ర నష్టాల పాలవడం జరుగుతుందని బాధపడుతున్నారు. గతంలో కూడా వైద్య విద్య అడ్మిషన్లు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా కోర్టులకు ఎక్కుతూనే ఉన్నాయి. 2016లో అడ్మిషన్లకు సంబంధించి స్పష్టమైన వైఖరిని అవలంబించకపోవడంవల్ల, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మరియు మెడికల్‌ ‌కమిషన్‌ ‌సమన్వయ లోపంతో యూజీ నీట్‌ ‌పరీక్షను, రాష్ట్రాల బోర్డులు నిర్వహించే ఎంసెట్‌ ‌లాంటి పరీక్షలను ప్రాతిపదిక తీసుకొని అడ్మిషన్లు నిర్వహించాలా ? అనే విషయంలో తర్జనభర్జనల అనంతరం తెలుగు రాష్ట్రాలకు చివరిసారిగా ఎంసెట్‌ ‌పరీక్షను అనుమతించడంతో పక్క తెలుగు రాష్ట్రం చక్కగా నిర్వహించి ఒక పరీక్ష తోనే అడ్మిషన్లను కొనసాగించింది. మన రాష్ట్రం మాత్రం ఎం బి బి ఎస్‌ అడ్మిషన్లకు ఒక పరీక్ష, అగ్రికల్చర్‌ ‌వెటర్నరీ కోర్సులకు మరొక పరీక్ష నిర్వహించి విద్యార్థులలో మానసిక అశాంతి , గందరగోళానికి తెరలేపింది. సందట్లో సడేమియా లాగా దుష్ట శక్తులు దుర్బుద్ధితో ఎంసెట్‌ ‌పేపర్ను లీక్‌ ‌చేయడంతో మూడో ఎంసెట్‌ ‌నిర్వహించాల్సి వచ్చింది. రెండో ఎంసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారు మూడో ఎంసెట్లో సీటు పొందలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఆ సంవత్సరం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం జరిగింది.

అరకొర వసతులతో, భోజన సదుపాయాలు, ఫ్యాకల్టీ కొరతతో కొట్టుమిట్టాడుతున్న కాలేజీలలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న సమయంలో రెండేళ్లుగా కొరోనా మహమ్మారి విద్యా సంవత్సరాలను నిర్వీర్యం చేసింది. ఈ సంవత్సరమైనా కాస్త కుదుటపడి కాలేజీలు సక్రమంగా నడుస్తాయి అన్నా ఆశతో విద్యార్థులు ఉంటే అడ్మిషన్ల రద్దు నిర్ణయం తీవ్ర కలకలం రేపింది. దీనికంతటికీ ఒక స్పష్టమైన విధానాన్ని అత్యంత పకడ్బందీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ మెడికల్‌ ‌కమిషన్‌ అవలంబిస్తే బాగుంటుంది. అడ్మిషన్లకు ముందే ప్రతి కాలేజీని తనిఖీ చేసి అడ్మిషన్ల పక్రియ కొనసాగిస్తే ప్రభుత్వాలకు, విద్యార్థులకు మరియు యూనివర్సిటీ అధికారులకు ఉపయోగకరంగా ఉంటుంది. అడ్మిషన్ల తర్వాత ఏమైనా లోపాలు ఉంటే వాటిని సవరించుకునేలా మాత్రమే ఆదేశించి, యజమానికి మాత్రమే శిక్ష ఉండేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అడ్మిషన్లు రద్దుచేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడం చేయని తప్పుకు శిక్ష విధించడం అవుతుంది. ప్రభుత్వాలు విద్య, వైద్యం పై సక్రమంగా శ్రద్ధ చూపి అధిక నిధులను కేటాయించి వాటిని ప్రజలకు ఉపయోగకరంగా నిర్వహించినపుడు మాత్రమే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది అని పాలకులు గ్రహించి, తక్షణమే విద్యార్థుల భవిష్యత్తును ఉద్దేశించి సరైన నిర్ణయం తీసుకొని వారి వైద్యవిద్యకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారికి, వారి కుటుంబ సభ్యుల మానసిక సంక్షోభానికి తెర దించి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *