- ప్రేమను పంచే నగరం
- తెలంగాణ ఇప్పుడొక బ్రాండ్
- రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
హైదరబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : అనేక రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని, అంతే కాకుండా దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హెటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏర్పాటయిన ‘టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్‌పో’ కార్యక్రమాన్ని శనివారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రెండు రోజులు హైటెక్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ స్టాళ్లను సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..కోవిడ్-19 వల్ల అన్ని రంగాలకు దెబ్బ పడింది. అదే రీతిలో రియల్ ఎస్టేట్ రంగంపైన ప్రభావం పడింది. అయినా ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆశాజనకంగా ఉన్నాయి.
మళ్లీ అన్ని రంగాలు ముందుకు వెళుతున్నాయి. అదే రీతిలో తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటుంది..అన్నారు. కాని తెలంగాణ స్వరాష్ట్రమై తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది. అంతే కాదు అన్ని రంగాల్లో దేశానికి రోల్ మోడల్ అయింది. తెలంగాణ ఇప్పుడు ఓ బ్రాండ్. చేస్తే తెలంగాణలో చేసినట్లు చేయాలన్న రీతిలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ బ్రాండ్ ఇమేజ్ మన రాష్ట్రానికి సృష్టించారని అన్నారు. ఇవాళ దేశంలో అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా హైదరాబాద్ నగరం పేరు పొందింది. చక్కటి వాతావరణం, 24 గంటల కరెంటు, తాగు నీటి కొరత లేని ప్రాంతం. మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సదుపాయాలు మంచి విద్యాలయాలు, అత్యాధునిక వైద్య సదుపాయాలున్న నగరం..ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ విశిష్టత అంతా ఇంతా కాదు. అందుకే ఇది భాగ్యనగరం అయిందన్నారు. అందుకే ఎవరు హైదరాబాద్ వొచ్చినా ఈ నగరంతో ప్రేమలో పడతారు.
మర్చిపోలేరు..మళ్లీ మళ్లీ ఇక్కడకు రావాలన్నంత ప్రేమను ఈ నగరం అందిస్తుంది. అనేక మంది ప్రముఖులు ఇక్కడ స్థిరపడాలని ఇళ్లు కొనుక్కొంటున్నారు. అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. అనుమతులు వేగంగా వొచ్చేలా..రూపాయి ఖర్చు లేకుండా నిర్మాణ పనులకు అనుమతులు వచ్చేలా చట్టాలు చేసింది. అవి అమలవుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు లేవు..ఇక ఇలాంటి కార్యక్రమాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక పత్రికా సంస్థ చేపట్టడం అభినందనీయమన్నారు.




