విలీనం, విమోచన కాదు ముమ్మాటికి దురాక్రమణ

‘‘‌తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఎదుర్కోలేని నిజామ్‌ ‌పాలకులు, తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్ర సంపన్నులు, తెలంగాణ మన చేతికి రాకుంటే కమ్యూనిస్ట్ ‌పోరాటాల ద్వారా భవిష్యత్తులో  మన అధికారనికే ముప్పు వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్‌ ‌కలసి సెప్టెంబర్‌ 17 ‌దాడి చేశారు. ఈ దాడి తాడిత పీడిత ప్రజలపై సామ్రాజ్యవాదులు మూకుమ్మడిగా చేసిన దుర్మార్గపు చర్యగా చరిత్రలో నిలిచిపోయింది.’’

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్‌ 17 ‌న జరిగింది ఏమిటో నేటికి మెజారిటీ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఆనాటి రజాకర్ల, దేశ్‌ ‌ముఖ్‌ ‌ల, దొరల ఆగడాలు మాత్రమే సామాన్య ప్రజలకు తెలుసు ఆ క్రమంలోనే 1948 సెప్టెంబర్‌ 17 ‌న దాడులు జరిగాయని తెలుసు. ఆ రోజు జరిగిందేమిటి? విలీనమా? విమోచనా? విద్రోహమా? దురాక్రమణ నా? అనేది ప్రతి సారి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏడు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్ర సెప్టెంబర్‌ 17 ‌ను విద్రోహ దినంగా తేల్చి చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆనాటి ఇండియా పాలకవర్గం వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌నేతృత్వంలో 1948 సెప్టెంబర్‌ 17 ‌న తెలంగాణను దురాక్రమణ చేశారు.చెరపలేని చరిత్రను, గత చారిత్రక సత్యాన్ని వివాదాస్పదం చేసి ప్రజల మన్నలను పొందాలని పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు పదే పదే మోసపోతుంటారని కామ్రేడ్‌ ‌లెనిన్‌ అన్నట్లు… నిజమైన చరిత్ర, ప్రజల త్యాగాలు నేటి తరం ప్రజలకు వివరించనంతకాలం పాలకవర్గాలు చెప్పిందే ప్రజలు నమ్మి మోసపోతారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాలకవర్గం తెలంగాణ ప్రజల త్యాగాలను తక్కువచేస్తుంది.ఆనాటి పాలక పార్టీ కాంగ్రెస్‌ ‌విలీనమని, మత కోణంలో లబ్ది పొందాలని చూస్తున్న బిజెపి విమోచనని, ప్రజల ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధమున్న కమ్యూనిస్టు లు ముమ్మాటికీ విద్రోహమని గత 70 ఏండ్లుగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు.

నిజామ్‌ ‌నిరంకుశ పాలనలో దేశ్‌ ‌ముఖ్‌ ‌లు, దొరలు, భూస్వాముల పెత్తనం, వెట్టి చాకిరి లాంటి ఆగడాలపై ఎర్రజెండా అండతో ఎదురు తిరిగారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రజా పంచాయతీలను ఏర్పాటు చేసి దొరల గడీల పాలనను రద్దు చేసింది. ప్రజలు వారి దైనందిన సమస్యలను వారే పరిష్కరించుకునే నాయకత్వాన్ని తయారు చేసుకున్నారు. దొర, పటేల్‌, ‌పట్వారీ కుటిల వ్యవస్థను అరికట్టి ప్రజల ఏలుబడిని ఎత్తిపట్టి ప్రజాస్వామిక పాలనా సంస్కృతికి జీవం పోశారు. క్రమంగా హైదారాబాద్‌ ‌రాష్ట్ర ప్రజలు పోరాటాన్ని ఉదృతం చేసి నైజామ్‌ ‌పాలనను అంతమొందించే స్థాయికి వచ్చారు. వేలాది మంది మాన ప్రాణాలను దోచుకున్న ఊర్లలోని దొరలే కాదు నిజామ్‌ ‌కూడా గద్దె దిగే పరిస్థితిని రైతాంగ పోరాటం కలిగించింది. నలువైపుల నుండి వస్తున్న పోరాట వార్తలు నిజామ్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీన్ని గమనించిన నిజామ్‌ ‌పాలకులు ఆనాటి నెహ్రు ప్రభుత్వంతో కుమ్ముక్కయి ‘‘ఆపరేషన్‌ ‌పోలో’’ పేరుతో వచ్చిన భారత సైన్యం నిజామ్‌ ‌లొంగిపోయిన వెనుదిరిగి వెళ్ళకుండా తెలంగాణ ప్రజలపై దాడులు చేసి లక్షల మంది ప్రజలను చంపి, హింసించి తెలంగాణను దురాక్రమణ చేశారు.నిజామ్‌ ‌లొంగిపోయాడని దొంగ మాటలు చెప్పిన పటేల్‌ ‌ప్రజలపై దారుణమైన హింసకు పాల్పడిన ఖాసిమ్‌రజ్వి ని చాటుగా దాటించారు. ఊర్ల నుండి పారిపోయిన దొరలు కాంగ్రెస్‌ ‌టోపీలతో గ్రామాల్లోకి చేరుకునేలా సైన్యం అండనిచ్చింది.దొరలకు రాజకీయ పదవులు కట్టబెట్టి ప్రజాస్వామిక ప్రతినిధులు అనే రూపాన్ని ఇచ్చి ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజా పంచాయితీలను కూల్చి ప్రజలను వంచించారు. ప్రజల వైపున పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులను మట్టుపెట్టేందుకు నెహ్రూ సేనలు పూనుకున్నాయి.హైదరాబాద్‌ ‌రాష్ట్రం మీద నెహ్రూ-పటేల్‌ ‌సర్కార్‌ ‌సైనిక చర్య తెలంగాణ చరిత్రలో మాయని మచ్చ. ఆ సైనిక చర్య పురోగమిస్తున్న తెలంగాణ పీడిత ప్రజల విప్లవాన్ని ఊబిలోకి నెట్టింది.నిజామ్‌ను లొంగదీసుకోవడానికి వచ్చినట్లు చెపుతున్న సైన్యం అప్పుడప్పుడే భారత జనతా ప్రజాతంత్ర విప్లవానికి దారి చూపిస్తున్న వేగు చుక్కను హతమార్చింది.

ఇంతటి దుర్మార్గాన్ని,దురాక్రమణను, విద్రోహాన్ని రాజకీయ పార్టీలు సుదినంగా చిత్రించబోవడం విషాదకరం. హైదరాబాద్‌ ‌స్టేట్‌ ఇం‌డియాలో భాగం కానప్పటికి అవకాశవాద పాలనకు అలవాటుపడిననిజామ్‌ ‌పాలకులు మొదటి నుండి బ్రిటిష్‌ ‌పాలకులతో సన్నిహితంగానే మెదులుకుంటున్నారు. టిప్పు సుల్తాన్‌ ‌ను హతమార్చడంలో ఇంగ్లీష్‌ ‌పాలకులతో విద్రోహ బుద్ధితో చేతులు కలిపిన నిజామ్‌ ‌పాలకులు 1948 సెప్టెంబర్‌ 17 ‌న నెహ్రూ ప్రభుత్వంతో చేతులు కలిపి తెలంగాణ ప్రజలను వంచించి, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ప్రజల స్వేచ్ఛను హరించివేశారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని ఎదుర్కోలేని నిజామ్‌ ‌పాలకులు, తెలంగాణ సంపదపై కన్నేసిన ఆంధ్ర సంపన్నులు, తెలంగాణ మన చేతికి రాకుంటే కమ్యూనిస్ట్ ‌పోరాటాల ద్వారా భవిష్యత్తులో లో మన అధికారనికే ముప్పు వాటిల్లుతుందని భావించిన కాంగ్రెస్‌  ‌కలసి సెప్టెంబర్‌ 17 ‌దాడి చేశారు. ఈ దాడి తాడిత పీడిత ప్రజలపై సామ్రాజ్యవాదులు మూకుమ్మడిగా చేసిన దుర్మార్గపు చర్యగా చరిత్రలో నిలిచిపోయింది. ఇండియాకు స్వాతంత్య్రం  ఇచ్చే క్రమంలో తెలంగాణ లాంటి స్వతంత్ర సంస్థానాలు మా పాలనలో ఎన్నడూ లేవని వారి సంస్కృతి, జీవనం, సామాజిక, ఆర్ధిక స్థితిగతులు వేరని వారికి ఇష్టం లేకుంటే ఆ ప్రాంతాలను మీరు స్వతంత్రంగానే వొదిలెయ్యాలని బ్రిటిష్‌ ‌పాలకులు చాలా సూటిగా చెప్పారు. దేశంలో అధికారమే పరమవాదిగా స్వాతంత్ర ఉద్యమం చేసిన బ్రాహ్మణీయ శక్తులు అంబేడ్కర్‌ ఉద్యమం వల్ల దళిత ముస్లింల ఐక్యత చూసిన నాయకులు కావాలనే గాంధీని ముందుపెట్టి లార్డ్ ‌మౌంట్‌ ‌బాటన్‌ ‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకొని ముస్లింలు అధిక జనాభా కలిగిన ప్రాంతాన్ని పాకిస్థాన్‌ ‌దేశంగా విభజించారు. పాకిస్థాన్‌ ‌విభజన వల్లనే దేశంలో బ్రాహ్మణ, బనియా వర్గాలకు అధికారం వచ్చింది. బ్రిటిష్‌ ‌వాల్ల నుండి బ్రిటిష్‌ ‌పాలించిన ప్రాంతానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. హైదరాబాద్‌, ‌కాశ్మీర్‌ ‌లాంటి పెద్ద సామంత రాజ్యాలకు ఇది వర్తించదు.

బ్రిటిష్‌ ‌పాలనకన్నా ముందునుండే స్వతంత్రంగా ఉన్న తెలంగాణపై కన్నేసిన కాంగ్రెస్‌ ‌పాలకులు ఎలాగైనా తెలంగాణను ఆక్రమించుకోవాలని తెలంగాణ పై పోలీసు దాడి చేసి దుర్మార్గానికి ఒడికట్టారు. హైదరాబాద్‌ ‌సంస్థానంలో పాలన రెండు విధాలుగా సాగింది. ఒకటి నిజామ్‌ ‌రాజ్యం ప్రత్యక్ష పాలనలో ఉండే ప్రాంతం ఈ ప్రాంతాన్ని సర్ఫే ఖాస్‌ అనేవారు. రెండోది నిజామ్‌ ‌పరోక్ష పాలనలో ఉండే ప్రాంతం. పరోక్ష పాలనలో ఉండే ప్రాంతం అంటే జమీందారులు, దొరలు, భూస్వాములు, దేశ్‌ ‌ముఖ్‌ ‌ల ఆధీనంలో ఉండే ప్రాంతం. వీరు ఆ ప్రాంతం నుండి శిస్తులు వసూలు చేసినిజామ్‌కు చెల్లించేవారు. ఆయా ప్రాంతాల్లో పాలన చేసిన జాగీర్‌ ‌దారులు నిజామ్‌ అం‌డతో చేయని దుర్మార్గాలు లేవు. భూస్వాములు, దొరల నిరంకుశత్వం వల్ల 1910 లోనే నిజామ్‌ ‌రాజు నిషేధించిన వెట్టి చాకిరి తెలంగాణ పరోక్ష పాలనలో కొనసాగింది. అణగారిన వర్గాల ప్రజలకు ప్రత్యక్ష పాలనలో దొరికిన చట్టపరమైన వెసులుబాట్లు భూస్వాముల పాలనలో లభించలేదు. వెట్టి చాకిరికి, దొరల పీడనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఉద్యమానికి ఆనాటి కమ్యూనిస్టులు నాయకత్వం వహించి ప్రజలను సాయుధ పోరాటం వైపు మరలించి గ్రామ గ్రామాన స్వయం రక్షక దళాలను ఏర్పాటు చేసి దొరల, భూస్వాముల ఆగడాలను, దోపిడీని అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఆంధ్ర మహాసభ పేరుతో ప్రారంభమైన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటం హైదరాబాద్‌ ‌రాజకీయ చిత్రపటాన్ని మార్చేసింది.

ఆనాటి కాంగ్రెస్‌ ‌పార్టీ, ఆర్య సమాజం జమీందార్లకు, భూస్వాములకు వత్తాసు పలికాయి.నిజామ్‌ ‌రాజుకు, దొరలకు ఈ సంస్థలు వ్యతిరేకం కాదు. న్యాయమైన హక్కుల కోసం, విముక్తి కొరకు పోరాటం చేస్తున్న అణగారిన వర్గాల ప్రజలకు ఈ సంస్థలు వ్యతిరేకంగా పని చేశాయి. కమ్యూనిస్ట్ ‌పార్టీ ఆధ్వర్యంలో సాగిన పోరాటం దొరలను తరిమి గడీలను ఆక్రమించుకొని ప్రజారాజ్యం నిర్మించుకున్న ప్రజలను నిజామ్‌ ఎదుర్కోలేక పోయాడు. అణగారిన ప్రజలకు, కమ్యూనిస్టులకు వ్యతిరేకమైన తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకులు నిజామ్‌తో కుమ్ముక్కయి తెలంగాణ ప్రజల మీద పోలీసు యాక్షన్‌ ‌చేసి దురాక్రమణ చేసారు.నెహ్రూ సైన్యం దురాక్రమణ చేసిన తర్వాత ఎవరికి నష్టం జరిగింది? ఎవరికి లాభం జరిగింది? ప్రజల పోరాటాలకు జడిసి పట్టణాలకు పారిపోయిన దొరలు, భూస్వాములు పల్లెలకు వచ్చారు. 1948 వరకు పీడిత ప్రజల విముక్తి కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో 400 మంది మరణిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చి తెలంగాణ దురాక్రమణ జరిగిన 1948 నుండి 1950 వరకు సైన్యం జరిపిన హత్యాకాండలో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కర్ణాటక, మరట్వాడ ప్రాంతాల్లో మతం మారిన ఎస్సి, ఎస్టీ, బి.సి లను సుమారు రెండు లక్షల మందిని ఊచ కోత కోసారని, ముస్లింల నెత్తురు కాల్వలు కట్టాయని వీటిపై కేంద్రం నియమించిన పండిట్‌ ‌సుందర్‌ ‌లాల్‌ ‌కమిటీ నిర్ధారించింది. ఉస్మానాబాద్‌, ‌నాందేడ్‌, ‌గుల్బర్గా, బీదర్‌ ‌జిల్లాలు నాలుగింటిలోనే 18 వేల మందికి పైగా హత్యకు గురయ్యారు. మొత్తం సంస్థానంలో 40 వేల వరకు హతులైనట్లు సుందర్‌ ‌లాల్‌ ‌నివేదిక పేర్కొనగా ఈ మృతుల సంఖ్య రెండు లక్షలు ఉండవచ్చని ఉద్యమ సంస్థల నివేదికలు చెపుతున్నాయి.

పోలీసు యాక్షన్‌ ‌వల్ల గ్రామాలు వల్లకాడుగా మారాయి. లక్షల మంది హింసించబడ్డారు. రెండు లక్షల మంది కాన్సంట్రేషన్‌ ‌క్యాంపులో నిర్బంధం అనుభవించారు. ఇల్లందు, ములుగు, నర్సంపేట, పాల్వంచ, కొత్తగూడెం, బూర్గంపాడు తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో వెయ్యికి పైగా ఏజెన్సీ గిరిజన గ్రామాలను తగులబెట్టారు. గిరిజన మృతుల సంఖ్య వెలుగులోకి రాలేదు. ఐదు వేల మంది మహిళలు మిలటరీ అత్యాచారాలకు గురయ్యారు. నాలుగు వేల మందిని చంపి, రెండు లక్షల మందిని ఊచ కోత కోసి దురాక్రమణ చేసి ప్రజల మాన ప్రాణాలను హరించివేసిన సైనిక చర్యను కాంగ్రెస్‌ ‌నేతలు విలీనం అంటున్నారు. విలీనమంటే ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా జరగాలి. ముస్లింలను ఊచ కోత కోసి, ముస్లిం పాలన పోయి బ్రాహ్మణ పాలన వచ్చినందున ఇది విమోచన అంటుంది బిజెపి.నిజామ్‌రాజు అధికారాలేవి 1956 వరకు తొలిగించలేదు. సైనిక చర్య తర్వాత నిజామ్‌సైన్యం, నెహ్రూ సైన్యం, కాంగ్రెస్‌ ‌పార్టీ వాలేంటీర్లు ఒక్కటై నరమేధం సాగించాయి. హైదరాబాద్‌ ‌సర్వోన్నత అధికారిగా, రాజప్రముఖ్‌ ‌గా నిజామ్‌రాజు విశేష అధికారాలు అనుభవించాడు.ఆయన ఆస్తులు, అధికారాలకు బ్రాహ్మణ పాలకులు రక్షణ కల్పించారు. తెలంగాణ ను ఆంధ్రాలో కలిపే 1956 వరకు నిజామ్‌ ‌రాజు చేతిలోనే అధికారం ఉంది. శాంతి భద్రతలు, విదేశాంగ వ్యవహారాలు, రక్షణ ఇండియన్‌ ‌ప్రభుత్వ పరిధిలో ఉండగా సివిల్‌, ‌క్రిమినల్‌, ‌రెవిన్యూ జ్యడిషియల్‌ అధికారాలన్నీ పాత పద్దతిలో నిజామ్‌రాజు ఆధీనంలో ఉన్నాయి.ఎవరినుండి ఎవరికి విమోచన వచ్చినట్లు? ప్రజల నుండి నిజామ్‌ ‌పాలకులకు విమోచన కలిగింది. ప్రజల నుండి దొరలు, భూస్వాములకు విమోచన కలిగింది.నిజామ్‌ ‌నుండి కాంగ్రెస్‌ ‌పార్టీకి అధికార మార్పిడి జరిగింది. దీన్ని ఎలా విమోచన అంటారో ఉత్సవాలు చేసుకునే బిజెపి చెప్పాలి.

కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటున్నారు. ద్రోహం చేయాలంటే ముందు విశ్వాసం కల్పించాలి. ఆ విశ్వాశానికి విరుద్ధంగా వ్యవహరిస్తే అది విద్రోహం అవుతుంది. కాంగ్రెస్‌ ‌పార్టీ 1946 నుండి నేటి వరకు అలాంటి విశ్వాసం కల్పించలేదు. అది నేరుగా దురాక్రమణకే తెగబడింది. తెలంగాణను ఆంధ్రలో కలపడం కూడా దురాక్రమణనే. అందువల్ల కమ్యూనిస్టులు చెపుతున్నట్లు ఇది విద్రోహ దినం కాదు. సెప్టెంబర్‌ 17 ‌విషయమై తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పటివరకు కిమ్మనకుండా ఉన్న కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఈసారి కొత్త రాగం ఎత్తుకున్నాడు. సెప్టెంబర్‌ 17 ‌ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని అందుకోసం మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు.నానాటికి పడిపోతున్న పాలనా ప్రగతి ని కాస్తన్న కాపాడుకోవడానికి, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇతర రాజకీయ పార్టీల ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఈ సమైక్యతా రాగం తీసుకున్నాడనిపిస్తుంది. సెప్టెంబర్‌ 17 ‌న జరిగిన చరిత్ర సాక్షాలు చరిత్రలో లిఖించబడి ఉండగా ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు సెప్టెంబర్‌ 17 ‌చరిత్రను వారికి అనుకూలంగా వాడుకుంటున్నారంటే వారికి తోడు కెసిఆర్‌ ‌కొత్త రాగం జత కలిసి. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప మరో అంశం కనపడడం లేదు.

దేశమంతా బ్రిటిష్‌ ‌పాలనలో కొంత అభివృద్ధి చెంది, ప్రజలు విద్య నేర్చుకొనగా తెలంగాణ మాత్రం 400 ఏండ్లు నిజామ్‌ ‌పాలనలో విద్య కు, అభివృద్ధికి దూరమయ్యారు. పోరాటాలతో తరతరాలు నష్టపోయారు. అలాంటి తెలంగాణను అప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉన్న సీమాంధ్రతో కలపడం వల్ల చాలా నష్టం జరిగింది. ఉద్యోగాలు, ఉన్నత విద్యలో సీట్లు, రాజకీయ అవకాశాలు, వ్యాపారాల్లో అవకాశాలు అన్ని తెలంగాణకు దక్కకుండా పోయాయి. ఇంతటి అన్యాయం జరిగిన తెలంగాణ కోసం ఎలాంటి అభివృద్ధి చేయాలో ఆలోచించాల్సిన రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని వక్రీకరించి రాజకీయ రంగులు పులిమి ఆటలు ఆడుచున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా తెలంగాణ గోసను, తెలంగాణ చరిత్రను రాజకీయాలకు వాడుకోవడం ఆపి తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు వేయాలి.
నిజామ్‌కాలం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన అన్ని రకాల ఉద్యమాల్లో నష్టపోయిన కుటుంబాలను తెలంగాణ సమరయోధులుగా గుర్తించి అన్ని రకాల సహాయం అందించాలి. ఏ కోణంలో చూసిన సెప్టెంబర్‌ 17 ‌న తెలంగాణ ప్రజల మీద ఏక పక్ష దాడి తో పాటు దురాక్రమణ జరిగింది. ఈ దురాక్రమణ వల్లే తెలంగాణ ప్రాంతాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో బ్రాహ్మణ పాలకులు ఆంధ్ర రాష్ట్రంలో బలవంతంగా కలిపారు. ఇది రెండో దురాక్రమణ. రెండు సార్లు దురాక్రమణకు గురైన తెలంగాణ ప్రపంచంలోనే అత్యంత దోపిడీకి గురైనది. కాంగ్రెస్‌ ‌పార్టీ నైజం తెలుసుకొని వినోభా బావే భూదానోద్యమం ఎవరికి మేలు చేసిందో ప్రజలు ప్రత్యక్షంగా చూసారు.

దురాక్రమణలను, దోపిడీ పీడనలను తట్టుకోలేని ప్రజలు మళ్ళీ విప్లవ బాట పట్టారు. నక్సలైట్ల ఉద్యమంలో చేరి దొరల, భూస్వాముల ఆగడాలపై తిరగబడ్డారు. రూపం మార్చి దోపిడీ కొనసాగిస్తున్న భూస్వాముల భూములను పేద ప్రజలు పంచుకొని దొరలను మళ్ళీ గ్రామాల నుండి పారదోలారు. 1995 లో మారోజు వీరన్న నాయకత్వంలో మలిదశ ఉద్యమం మొదలై ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. త్యాగాల పునాదుల మీద రాష్ట్రం సాధించాక మళ్ళీ అదే తంతు పునరావృతమైంది. భూములు వొదిలి వెళ్లిన దొరలు భూస్వాములు గ్రామాల్లోకి వచ్చి అణగారిన వర్గాల ప్రజల నుండి భూములు గుంజుకొని దోపిడీని కొనసాగిస్తున్నారు. తెలంగాణ అణగారిన శ్రామిక వర్గాల విముక్తి కోసం మరో పోరాటం అవసరమని ప్రజల నుండి మరో బలమైన పోరు నినాదం వినిపిస్తుంది.
(సెప్టెంబర్‌ 11 ‌నుండి 17 వరకు జరుగు సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా)
image.png
సాయిని నరేందర్‌
‌సామాజిక , రాజకీయ విశ్లేషకులు
9701916091

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *