విధ్వంసం అయిన తెలంగాణ పునర్నిర్మాణమే మేస్త్రి లక్ష్యం

ఆర్థిక దివాలా నుంచి గట్టెక్కించే ప్రయత్నం
రాస్ట్రాన్ని జీతాలు ఇవ్వలేని దుస్థితికి తెచ్చారు
పార్లమెంట్ట్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను బొందపెట్టాల్సిందే
కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి కృషి చేయాలి
కాంగ్రెస్‌ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 25 : తెలంగాణను పునర్నిర్మించే క్రమంలో తాను మేస్త్రీనేనని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆర్థక విధ్వంసం సృష్టించి, జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి గత పాలకులు తీసుకుని వచ్చారని మరోమారు ధ్వజమెత్తారు. ఈ క్రమంలో బిఆర్‌ఎస్‌ను బొందపెట్టాల్సిందేనని, కెసిఆర్‌ పీక పిసికే కార్యక్రమం కాంగ్రెస్‌ చేపట్టిందని స్పష్టం చేశారు. వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెల్చుకుని రాహుల్‌ను ప్రధానిని చేయడమే మనముందున్న లక్ష్యమన్నారు. కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన ఆవేశంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ పాదయాత్రతోనే కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వొచ్చామని, అధికారంలోకి వొచ్చిన 100 రోజుల్లో హావిూలు అమలు చేస్తామని చెప్పామని, 50 రోజులు కూడా కాలేదు..హావిూలు అమలు ఎక్కడ అని భారాస నేతలు అడుగుతున్నారని మంగిపడ్డారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హావిూలు అమలు చేస్తామని, ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా నగదు అందిస్తామని ఆయన తెలిపారు. భారాస ఇచ్చిన హవిూలు అమలు చేశారా అని అంటూనే.. పదేళ్లలో కేసీఆర్‌ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలని, కొందరు తనను మేస్త్రి అని విమర్శిస్తున్నారని, తాను తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనేనని అన్నారు.

అవినీతిపరులు, కోటీశ్వరులను కేసీఆర్‌ రాజ్యసభకు పంపించారని, బలహీన వర్గాల బిడ్డలు మందు శామ్యూల్‌, వెడ్మ బొజ్జుకి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించిందని, రైతు బిడ్డనైన తాను కాంగ్రెస్‌లో సీఎం అయ్యానని, కాంగ్రెస్‌ పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయన్నారు. లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకం. భారాసను మొన్న ఎన్నికల్లో ఓడిరచాం.. పార్లమెంట్‌ ఎన్నికల్లో తరిమికొడదాం. పులి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పులి వొస్తే బోనులో పెట్టి బొందపెడతాం. మోదీ, కేసీఆర్‌ వేరువేరు కాదు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్లమని భారాస నేతలు అంటున్నారు. మార్చాల్సింది అభ్యర్థులను కాదు.. కేసీఆర్‌ కుటుంబాన్ని…అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ’సీఎం పదవి అనేది గుంపు మేస్త్రి పాత్ర వంటిద’ని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలా విమర్శలొచ్చాయో అందరికీ తెలుసు. ఇప్పటికీ సోషల్‌ విూడియాలో ట్రోలింగ్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ట్రోల్స్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. తాను మేస్త్రినే అని, విూరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రినంటూ బీఆర్‌ఎస్‌పై రేవంత్‌ ధ్వజమెత్తారు. మిమ్మల్ని ఘోరీ కట్టే మేస్త్రిని కూడా తానేనంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

ఈ నెలలోనే ఇంద్రవల్లి వస్తాను. కాస్కోండి అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. మా ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కాలేదు..వాళ్ల పాలనలో ఏవిూ చేయలేని సన్నాసులు.. బిల్లా రంగాలు ప్రభుత్వంపై దుష్పచ్రారానికి బయల్దేరారని రేవంత్‌ రెడ్డి అన్నారు. దేశంలో త్యాగం అంటే గాంధీ ఫ్యామిలీదేనని అన్నారు.. రాజీవ్‌ వీర మరణం తర్వాత ప్రజలకోసం సోనియాగాంధీ ముందుకు వొచ్చారన్నారు. గాంధీ కుటుంబం త్యాగాలు చేసినప్పుడు  ప్రధాని మోదీ ఎక్కుడున్నారని ప్రశ్నించారు. దేశంలో పాలనపై సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. దేశాన్ని కాపాడటం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేశారన్నారు. ఎన్నో పదవులు సోనియా గాంధీ త్యాగం చేసిందన్నారు. 2004, 2009లో ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా సోనియా గాంధీ పదవి వదులుకున్నారని చెప్పారు. యువతకు కంప్యూటర్లు, 18 యేళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్‌ గాంధీదే అన్నారు. సోనియాగాంధీ,రాహుల్‌ ను వేధించేందుకే ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్‌ రెడ్డి.  ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం పనిచేసే కాంగ్రెస్‌ పార్టీని లోక్‌ ఎన్నికల్లో గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, అందులో అందరికీ అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖర్గే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *