చీకటిని అసహ్యించుకోనేవారు కొందరు, చీకటిని చూసి భయపడేవారు ఇంకొందరు, చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు అలాంటి మూడవ రకంనకు చెందిన వాళ్ళను మూడక్షరాల పదంలో సూరీడు అంటారు. వైకల్యం శరీరాన్ని ఇబ్బంది పెడితే, ప్రతి చిన్నపనికీ మరొకరి సాయం అడగాల్సిరావడం మనసుని బాధిస్తుంది. శారీరకంగా మానసికంగా నిత్య పోరాటం చేస్తూనే తమ కాళ్ల మీద తాము నిలబడాలన్న ఆరాటంతో బయటకు వస్తే – బడీ వద్దంటే ఎక్కడికి వెల్లాలో ఎలా వెల్లాలో గమ్యం ఎలా చేరుకోవాలో ఇలా ఎన్నో ప్రశ్నలు మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తూ జీవితం పై నిరాశ ఎదురొచ్చిన కష్టాలు కనపడని ఆంధుడు ఇంటా బయటా విధికి ఎదురీది, విజేతలుగా నిలిచి, నేటి యువతకు స్ఫూర్తినిస్తున్న వ్యక్తి వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి, విద్యా వ్యవస్థపై పోరాడి గెలిచిన రియల్ హీరో, భూమి మీదున్న సూరీడు అతడే శ్రీకాంత్ బొల్లా.

బాల్యం బాధలతోనే…
మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం గ్రామం నకు చెందిన ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన శ్రీకాంత్ బొల్లా పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ ఊరిజనం అయితే మరో అడుగు ముందుకేసి, ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ బొల్లా అమ్మ నాన్న అలా చేయలేదు. మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి అని ఊరివాళ్లతో అనేవారు.
విద్యా వ్యవస్థపై పోరాడి గెలిచిన రియల్ హీరో…
కళ్ళు కనపడకపోవడం తప్ప, బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ సైన్స్ గ్రూప్ లో నీవు అంధుడివి కాబట్టి సీటు ఇవ్వలేమని కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి సీటు తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి రెండు ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో ప్రత్యేక పాఠశాల లో చేరాడు. అక్కడకూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడివదిలేసి పారిపోతుంటే ఒక్క ఉపాధ్యాయురాలు పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది. అదే అతని జీవితం లో మలుపు తిరిగింది. ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లో ఎమ్.పి.సి. చదివి తొంబై ఎనిమిది శాతం సంపాదించగా ఎగతాళి చేసినవారు అందరూ అవాక్కయ్యారు.
ఐఐటీ నన్ను వద్దనుకుంటే ఐఐటీ కూడా వద్దు
అంధత్వం కారణంగా అగ్రశ్రేణి భారతీయ విద్యా సంస్థ ఐఐటీ లచే ప్రవేశాన్ని తిరస్కరించబడిన తరువాత కళ్లులేవని ఐఐటీ వద్దంది నిరుత్సాహపడని శ్రీకాంత్ బొల్లా ఐఐటీ నన్ను వద్దనుకుంటే నాకు ఐఐటీ కూడా వద్దు అని అమెరికా లోని విశ్వవిద్యాలయం లకు ప్రవేశానికి పరీక్ష వ్రాస్తే ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, మరో రెండు విశ్వవిద్యాలయంలు అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. శ్రీకాంత్ హోవార్డ్ మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా లో చేరాడు. అక్కడ బ్రైన్ కాగ్నిటివ్ సైన్స్ లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి, చదువు పూర్తి అయ్యాక నాలుగు అమెరికన్ కంపెనీ లు తమ దగ్గర ఉద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా లేదు అని చెప్పాడు. భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద, దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించేవాడు. ఆ ప్రార్థనలు ఫలించాయి.
ప్రపంచం అంతా నువ్వు ఏమీ చేయలేవు అని చెబితే, ప్రపంచం వైపు తిరిగి చూసి నేను ఏదైనా చేయగలను అని నిరూపించిన వ్యక్తే బొల్లా హైదరాబాద్ కు 2012లో తిరిగి వచ్చిన శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ రతన్ టాటా సహాకారంతో నెలకొల్పి వికలాంగులకు ఉపాధిని అందిస్తున్నారు. అంధుడైన శ్రీకాంత్ బొల్లా చిన్నప్పటి నుంచి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని, దాదాపు రూ.500 కోట్ల విలువైన కంపెనీని సృష్టించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ 2021 జాబితాలో బోల్లా పేరు కూడా ఉంది. ప్రస్తుతం బొల్లాంట్కు నాలుగు ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి హుబ్లీ (కర్ణాటక) మరియు నిజామాబాద్ (తెలంగాణ), మరియు రెండు హైదరాబాద్ (తెలంగాణ). బొల్లాంట్ ఇండస్ట్రీస్ లో సుమారు 300 మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. బొల్లా 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.
నీకంటూ ఓ రోజు….. ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు..
పుట్టుకతో వికలాంగులైన వారికి ప్రత్యేకమైన శక్తులుంటాయనే విషయమూ నిరూపించిన వారెందరో, చూపులేనివారు ఒక మారు విన్న స్వరాన్ని మరోమారువినగానే ఆవ్యక్తిని గుర్తిస్తారు. ఒక మారు స్పర్శ తగిలిన వారినీ రెండోమారు గుర్తించగలుగుతారు. వారికి గ్రహణ శక్తీ అధికంగానే ఉంటుంది. వికలాంగులు మానసికంగా ఆధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు దూసు కెళుతున్నారు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ నీ దంటూ ఓ రోజు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, కొంచం ఓపికగా భరించు, నీ ఆత్మ విశ్వాసం ఎప్పుడు కోల్పోవద్దు. దివ్యాంగులకు చెయూత నిద్దాం….వారికి గౌరవాన్ని అందిద్దాం, ఆదరిద్దాం, వారిలో దాగి ఉన్న అధ్భుత శక్తులు ప్రపంచానికి తెలిసేలా చేద్దాం.
(శ్రీకాంత్ బొల్లా జీవితంపై బాలీవుడ్లో తెరకెక్కుతున్న
సినిమా ట్రైలర్ విడుదలైన సందర్భంగా..)
-డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి,
స్పెషల్ ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్, సైకాలజిస్ట్
ఫ్యామిలీ కౌన్సెలర్
సెల్: 9703935321





