రెండు సీట్లూ కాంగ్రెస్‌కు దక్కేఛాన్స్
ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టులకు పోటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి8: ఎమ్మెల్సీ సీట్లతో పాటు, నామినేటెట్ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామంటూ సిఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో పలువురు నేతలు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. తమ పేర్లను రికమండ్ చేయాలంటే ఒత్తిడి చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో ఖాలీ గా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లూ అధికార కాంగ్రెస్‌కే దక్కనున్న నేపథ్యంలో వాటిని ఎవరికి కేటాయిస్తారన్నది ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరో రెండు గవర్నర్ కోటాలో భర్తీచేసే అవకాశం ఉంది. ఈ రెండు సీట్లను ప్రొఫెసర్ కోదండరామ్, కవి అందశ్రీతో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇకపోతే సామాజిక, ఇతర సకరణాల ఆధారంగా నాయకులు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి రాజీనామాతో ఖాలీ అయిన రెండు స్థానాలకు ఒకే ఎన్నిక జరిపితే శాసనసభలో సభ్యుల బలం ఆధారంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెరో ఎమ్మెల్సీ స్థానం దక్కేది. కానీ రెండు సీట్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ఇసి నిర్ణయించడంతో ఇప్పుడు రెండూ కాంగ్రెస్ ఖాతాలో పడనున్నాయి.
ఈ నెల 29న ఉప ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఇద్దరు ఎమ్మెల్సీల పదవీకాలం ఒకేసారి (2027 నవంబరు 30న) ముగియనున్నా.. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ పేర్కొంది. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా విడివిడిగానే ఎన్నికలు నిర్వహించాలని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 11న వేర్వేరు నోటిఫికేషన్ల విడుదలకు అసెంబ్లీ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు వేర్వేరుగా జరుగుతుండడంతో రెండు సీట్లూ 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. 11న నోటిఫికేషన్లు విడుదల కానుండగా పోటీకి దూరంగా ఉండాలని బిఆర్‌ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఉన్న రెండు ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్‌లో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముస్లింల నుంచి ఎమ్మెల్యేగా ఎవరూ గెలవకపోవడంతో.. ఒక్క ఎమ్మెల్సీ సీటును ఆ వర్గానికి ఇస్తారని అంతా భావించారు.ఇప్పుడు అదనంగా దక్కనున్న స్థానానికి పోటీ పెరిగింది. ముస్లిం కోటాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్, నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి ఫిరోజ్ ఖాన్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ముగ్గురూ ఓడిపోవడం, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిత్వానికి పేర్లు పరిశీలనలో ఉండడం, ఇతర కారణాల రీత్యా అధిష్ఠానం వారి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ ఖుస్రూపాషా, వరంగల్ జిల్లా నేత జాఫర్ జావేద్ తదితరుల పేర్లూ పరిశీలనలో ఉన్నాయి. గవర్నర్ కోటాలో ఖాలీ గా ఉన్న రెండు సీట్లలో సామాజిక రంగంలో టీజేఎస్ అధినేత కోదండరాం పేరు ఖరారైంది.
రెండో సీటుకు ప్రజా కవి అందెశ్రీ పేరు వినిపిస్తోంది. ఈయననే ఖరారు చేస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ రెండు సీట్లలో ఒకటి కచ్చితంగా ముస్లింలకు కేటాయించాల్సి వస్తుంది. అలగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షుడు హర్కార వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, సినీ నిర్మాత బండ్ల గణెశ్ తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు కాకముందు నుంచీ రేవంత్‌కు మద్దతుదారుగా ఉన్న హర్కార వేణుగోపాల్ పేరూ గట్టిగానే వినిపిస్తోంది. అద్దంకి దయాకర్‌ను వరంగల్ నుంచి లోక్‌సభ బరిలో దించాలని అధిష్ఠానం ఆలోచిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నా.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా తీసుకుని ఆయన సేవలను ప్రభుత్వంలో వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.





